కష్టం.. నష్టమై..
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:29 AM
మొంథా తుఫాన్ పెను విలయాన్ని సృష్టించలేదుగానీ.. దాని ప్రభావానికి నష్టపోని రంగమంటూ లేదు. ప్రాణనష్టం తప్పిందని సంతోషం మిగిలింది గానీ.. కొన్ని రంగాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి. ఏ తుఫాన్ వచ్చిన సాగు మీదున్న పంటలకే తొలి నష్టం. ఈసారి అదే ఆనవాయితీ. సాధారణంగా ఆగస్టు తర్వాత వచ్చే తుఫాన్‌లకు ప్రతి ఏటా రైతు దొరికిపోతాడు. లేదా మాసూలు సమయంలో ప్రకృతి వైపరీత్యానికి తలవంచుతాడు. ఇప్పుడు సరిగ్గా వరి పంట ఈనిక దశలోనో, గింజ పాలుపోసుకునే దశలోనో ఉంది. ఈ సమయంలో పైరు పడిపోతే పశుగ్రాసానికి తప్ప దేనికీ పనికిరాదు. చివరి దశలో పడిపోయినా ఎంతోకొంత చేతికి దక్కుతుంది. అన్నదాతల కష్టం ఇలా నష్టాలపాలైంది. ఇక వాణిజ్య, కూరగాయల పంటలు.. ముఖ్యంగా కొబ్బరి, అరటి భారీగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల నష్టం కోట్లలోనే ఉంది. రహదారుల పరిస్థితి మరీ దారుణం.
పెరిగిన తుఫాన్ నష్టం.. రూ.200 కోట్లు పైనే

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు భారీగా నష్టాలు వాటిల్లాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్లు పైబడి నష్టం ఉండే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. జిల్లాలో అత్యధికంగా వ్యవసాయ రంగానికే భారీగా నష్టం సంభవించడంతో అన్నదాతలు కుదేలయ్యారు. వరితోపాటు ఉద్యాన పంటలు, కొబ్బరిచెట్లు కుప్పకూలడం వంటి నష్టాలతో అన్నదాతలకు రూ.80 కోట్లు పైబడే నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా బట్టి తెలుస్తోంది. తుఫాన్ వల్ల వీచిన ఈదురుగాలులు, తుఫాన్ తీరం దాటే సమయానికి ముందు.. తర్వాత కురిసిన వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా జిల్లాలో వరిసాగుకు సంబంధించి 1.63 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. తుఫాన్ పరిస్థితుల వల్ల 65 వేల మంది రైతులకు చెందిన 30 వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. తద్వారా సుమారు రూ.77.50 కోట్ల నష్టం వచ్చినట్టు అంచనా వేశారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో పంట నష్టాలను అంచనా వేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో బృందాల ద్వారా నష్టాలను గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఉద్యానశాఖకు సంబంధించి 4667 మంది రైతులకు చెందిన 1592 హెకార్టర్లలో అరటి, బొప్పాయి, తమలపాకు, పసుపు, కూరగాయలు, పువ్వులు వంటి పంటలకు నష్టం సంభవించింది. జిల్లాలో 669 మంది రైతులకు చెందిన 950 కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. వీటి కారణంగా 5.51 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఉద్యానశాఖ అంచనా వేసింది. ఇక ఆర్‌డబ్ల్యుఎస్‌కు సంబంధించి 113 పనులకు సంభవించిన నష్టం వల్ల రూ.33 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి జిల్లాలోని 22 మండలాల్లో సుమారు రూ.46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాల నివేదికను అందజేశారు. మత్స్యశాఖకు సంబంధించి అంతర్వేది ఫిషింగ్ హార్బరుకు రూ.10లక్షలు, ఐదు మండలాల పరిధిలో చేపల పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు రూ.50 లక్షలు, ఉప్పలగుప్తం మండలంలో 3512 చెరువులకు నష్టం వాటిల్లడం ద్వారా సుమారు రూ. 50 లక్షలు నష్టం సంభవించినట్టు మత్స్యశాఖ అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో 30వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారికి సహాయం అందించనున్నారు. ఐసీడీఎస్‌కు ఒక అంగన్‌వాడీ భవనంపై కొబ్బరిచెట్టు పడడం ద్వారా రూ.3లక్షల నష్టం వాటిల్లినట్టు అంచనా. చేనేత సహకార సంఘానికి సంబంధించి 4200 చేనేత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. వారికి బియ్యం, ఆర్థిక సహాయానికి ప్రభుత్వం సిఫార్సు చేసింది. అదేవిధంగా జిల్లాలో 486 ఇళ్లకు నష్టం జరిగింది. వీటిలో 29 పక్కా ఇళ్లు, 163 కచ్చా ఇళ్లు, 294 తాటాకు ఇళ్లకు సంబంధించి సుమారు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లింది. విద్యుత్‌శాఖకు సంబంధించి 300 స్తంభాలు నేలనంటినట్టు చెబుతున్నప్పటికీ నష్టాల వివరాలను ఆ శాఖ అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఇంకా ఆర్‌అండ్‌బీ, డ్రైనేజీ, జలవనరులశాఖ, విద్యుత్ శాఖలకు సంబంధించి ప్రాథమిక నష్టాలు అందాల్సి ఉంది. అయితే జిల్లాలో ఐదు రోజుల వ్యవధిలో అన్నిశాఖలకు సంబంధించిన నష్టాలపై అధికారులు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలను లక్ష్యంగా పెట్టుకుని నష్టాలను అంచనా వేయాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశాలిచ్చినట్టు సమాచారం.