చెయ్యెత్తిన చోట ప్రయాణికులను ఎక్కించుకుంటాం
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:13 AM
ప్రయాణికులు చేయి ఎత్తినచోట ఎక్కించుకుని, వారు కోరిన చోట దించవలసిందిగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ ఆదేశాలు ఇచ్చామని రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ స్పష్టం చేశారు. శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించారు.
భద్రాచలం వయా కుక్కునూరు సర్వీస్‌లకు స్త్రీ శక్తి పథకం వర్తించదు
డయల్ యువర్ ఆర్టీసీ డీఎంలో రాజమహేంద్రవరం డీఎం మాధవ
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులు చేయి ఎత్తినచోట ఎక్కించుకుని, వారు కోరిన చోట దించవలసిందిగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ ఆదేశాలు ఇచ్చామని రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ స్పష్టం చేశారు. శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కుక్కునూరుకు చెందిన పలువురు ప్రయాణీకులు వయా కుక్కునూరు బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలు కావడంలేదని, పురుషులు ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీల కంటే ఎక్కువగా చెల్లించడం వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని ఫోన్ ద్వారా డీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ రాజమహేంద్రవరం-భద్రాచలం వయా కుక్కునూరు రూటులోని ఆల్ర్టా డీలక్స్ సర్వీసుల్లో స్త్రీ శక్తి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వర్తించదని, అంతర్రాష్ట్ర సర్వీసులకు ఇతర రాష్ట్రాల్లో 16 కిలోమీటర్ల లోపు ప్రయాణ పరిధి ఉంటేనే స్త్రీ శక్తి పథకం వర్తిస్తుందని తెలిపారు. గతంలో తిరిగిన రాజమహేంద్రవరం-పేకేరు నైట్‌హాల్టు బస్సును పునరుద్ధరించాలని కోరగా, సరైన ఆదాయం రాకపోవడంతో రద్దు చేశామని ప్రయాణికుల కోరిక మేరకు కొత్త బస్సులు వచ్చాక పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. అలాగే, వేమగిరి గట్టు వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఉన్నా బస్సులు ఆపడంలేదని వినతి రాగా, సమస్యను పరిష్కరిస్తామన్నారు. బొబ్బిల్లంక స్టేజీ వద్ద స్టాప్ ఉన్నా బస్సులు ఆపడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎం స్పందిస్తూ ప్రయాణికులు చేయి ఎత్తినచోట ఎక్కించుకుని, వారు కోరిన చోట దించే విధంగా సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు. రాజమహేంద్రవరం నుంచి వయా చక్రద్వారబంధం, తుంగపాడు, ద్వారపూడి, మండపేట మీదుగా రామచంద్రపురం బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె బస్సులు ద్వారపూడి గ్రామంలోకి రావాలని, బస్టాండులో బస్సుల టైమింగ్స్ డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని, పండుగల సమయంలో ద్వారపూడి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడపాలని అందిన వినతిపై డీఎం స్పందిస్తూ కొత్త బస్సులు వచ్చాక తుంగపాడు మీదుగా బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. అద్దె బస్సులు ద్వారపూడి గ్రామంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, టైమింగ్స్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే దూరప్రాంత బస్సు సర్వీసులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా అన్ని వేళలా ఏర్పాటు చేస్తామని, దీనికోసం డిపో అధికారులను సంప్రదించాలని మాధవ పేర్కొన్నారు.