Share News

బంధువులమని చెప్పి తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారం

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:51 AM

ముమ్మిడివరం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో బంధువులమని చెప్పి బాలికను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతడికి సహకరిం

బంధువులమని చెప్పి తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారం
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌

నిందితుడితో పాటు సహకరించిన మరో ఇద్దరి అరెస్ట్‌

ముమ్మిడివరం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో బంధువులమని చెప్పి బాలికను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. ఈ వివరాలను మంగళవారం ముమ్మిడివరం పోలీసుస్టేషన్‌లో అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌ వెల్లడించారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు.

అసలేం జరిగిందంటే..?

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక ముమ్మిడివరం మండలం ఠాణేలంక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు వడ్డివారిపేటకు చెందిన మోకా గిరిబాబు ఈనెల 3న గురుకుల పాఠశాలకు వచ్చాడు. బాబాయిని అని చెప్పి అతడితో పాటు వరసకు మరదలు అయిన నేరేడుమిల్లి అర్చనాదేవి అలియాస్‌ చిన్నీ సాయంతో బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తానని పాఠశాల యాజమాన్యాన్ని అనుమతి కోరారు. వారు అంగీకరించకపోవడంతో తాము రక్త బంధువులమని మరో మహిళతో చెప్పించి నమ్మబలికారు. బాలికకు ఉన్న అనారోగ్య సమస్య దృష్ట్యా వారితో బయటికి పంపించారు. వారు మోటారుసైకిల్‌పై బయలుదేరారు. అర్చనాదేవిని గిరిబాబు ముమ్మిడివరంలో వదిలి బాలికను అక్కడి నుంచి తీసుకుపోయాడు. అయితే ఆరోజు సాయంత్రానికి బాలిక తిరిగి రాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ డి.శారద ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం గిరిబాబు బాలికను పాఠశాల వద్దకు తిరిగి అప్పచెప్పగా యాజమాన్యం విషయాన్ని పోలీసులకు తెలియచేయడంతో గిరిబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆ బాలికను మహిళా ఎస్‌ఐతో విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయని డీఎస్పీ తెలిపారు.

లాడ్జికి తీసుకెళ్లి..

బాలికను గురుకుల పాఠశాల నుంచి బయటికి తీసుకువెళ్లిన గిరిబాబు ఆ రోజు తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం తీసుకెళ్లి కొంతసేపు గడిపి అక్కడి నుంచి అమలాపురంలోని శ్రీగణపతి లాడ్జికి తీసుకెళ్లి గుమస్తాగా పనిచేస్తున్న నాగవరపు వెంకటరమణ అలియాస్‌ బద్రికి కొంతసొమ్ములు ఆశగా చూపి గది అద్దెకు తీసుకుని ఆ రాత్రి ఆ బాలికపై పలుసార్లు అత్యాచారం చేసినట్టు విచారణలో తేలింది. గిరిబాబు ఆ బాలిక ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు. తల్లి గల్ఫ్‌లో ఉండడం, తండ్రి పనుల నిమిత్తం బెంగుళూరులో ఉండడంతో బాలిక నాన్నమ్మ, తాతయ్యల వద్దే ఉంటుంది. దీంతో బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. ఆమె సెలవులకు వచ్చినప్పుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు అనారోగ్యం దృష్ట్యా వైద్యం కోసం గిరిబాబును ఆమెతో ఆసుపత్రికి తోడుగా పంపేవారని, దీన్ని గిరిబాబు ఆసరాగా తీసుకునేవాడు. అత్యాచారానికి పాల్పడిన గిరిబాబు, అతడికి సహకరించిన నేరేడుమిల్లి అర్చనాదేవి అలియాస్‌ చిన్నీ, లాడ్జి గుమస్తా నాగవరపు వెంకటరమణపై పోక్సో చట్టం కింద కిడ్నాప్‌, అత్యాచారం కేసులు నమోదు చేసి సోమవారం సాయంత్రం ముగ్గురిని అరెస్టు చేసి మంగళవారం ముమ్మిడివరం కోర్టుకు హాజరు పరచగా రిమాండ్‌ విధించారని డీఎస్పీ ప్రసాద్‌ పేర్కొన్నారు. సమావేశంలో సీఐ ఎం.మోహన్‌కుమార్‌, ఎస్‌ఐ డి.జ్వాలాసాగర్‌ పాల్గొన్నారు.

పాఠశాల ప్రిన్సిపాల్‌, హౌస్‌ టీచర్‌పై చర్యలు

గురుకుల పాఠశాలలో విద్యార్థిని అదృశ్యం.. అత్యాచారం సంఘటనపై ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ డి.శారదను సస్పెండ్‌ చేయగా కాంట్రాక్టు బేసిక్‌పై పనిచేస్తున్న మేథమెటిక్స్‌ టీచరు, హౌస్‌ టీచరు డి.లోవకుమారిని విధుల నుంచి తొలగిస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఉత్తర్వులు విడుదల చేసింది.

Updated Date - Dec 10 , 2025 | 12:51 AM