కొద్ది రోజులు.. ఆగుదాం
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:20 AM
వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇక కొద్ది రోజులే కదా వేచి చూద్దాం అనే ధోరణి, ఆపై విజయదశమి దగ్గరగా ఉండడంతో అప్పుడు కొందామనే ఆలోచనతో అందరూ బ్రేక్ ఇచ్చేశారు.
వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఫలితం
నిలిచిన కార్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కొనుగోళ్లు
ముందస్తు బుకింగ్‌లు
22 నుంచి కొనేందుకు ఏర్పాట్లు
విజయదశమికి భారీగా అమ్మకాలు జరిగే అవకాశం
వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇక కొద్ది రోజులే కదా వేచి చూద్దాం అనే ధోరణి, ఆపై విజయదశమి దగ్గరగా ఉండడంతో అప్పుడు కొందామనే ఆలోచనతో అందరూ బ్రేక్ ఇచ్చేశారు. ఫలితంగా కేంద్రం ప్రకటన వచ్చిన నాటి నుంచి కార్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు దాదాపుగా నిలిచిపోయి షోరూంల్లో సందడి కనిపించడం లేదు. ఈ సమయంలోనే పలు వాహన కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)
జీఎస్టీ సంస్కరణల్లో బాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో అన్ని రకాల వాహనాల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఈనెల 22వ తేదీ నుంచి అమలుల్లోకి రానున్న నేపథ్యంలో ప్రస్తుతం వాహనా ల కొనుగోలు చేయాలని భావించిన వారంతా తమ నిర్ణయాలను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే అన్ని రకాల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలను తగ్గిస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఒకటి రెండు కార్ల కంపెనీలు పోటీకి తెరలేపుతూ జీఎస్టీ తగ్గింపును ముం దస్తుగానే వినియోగదారులకు వర్తింపజేస్తామంటూ ప్రకటనలు ఇస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఎస్‌యూవీలు ఇతర వాహనా లపై విధించే జీఎస్టీని తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 350 సీసీ, అంతకంటే తక్కువ కెపాసిటీ కలిగిన ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీ ఎస్టీని 18 శాతానికి తగ్గించారు. దీంతో వాహనాల ధరలు రూ.8 వేల నుంచి రూ.23 వేల వరకూ తగ్గే అవకాశం ఉంది. 1200 సీసీ అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్లు, 1500 సీసీలోపు ఉన్న డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లపై ఇప్పటివరకూ 28శాతం జీఎస్టీ ఉండగా దానిని 18 శాతానికి తగ్గించారు. ఇదే రీతిలో మధ్యశ్రేణి, ఉన్నతశ్రేణి ఎస్‌వీయూలపై ఇప్పటివరకూ జీఎస్టీ 28 శాతం, సెస్‌లతో కలుపుకుని 45 నుంచి 50 శాతం వరకూ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. జీఎస్టీని 28 నుంచి 40 శాతానికి పెంచారు. సెస్‌లను మినహాయించారు. దీంతో పన్నులు 5-10 శాతం వరకూ తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో కార్ల ధరలు కనిష్ఠంగా రూ.30 వేల నుంచి గరిష్ఠంగా రూ.4.50 లక్షల వరకూ తగ్గనున్నాయి. ఇదే విషయాన్ని తెలుపుతూ మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందయ్, ఎంజీ, కియా, హోండా తదితర కార్ల కంపెనీలు ఇప్పటికే అధికారికంగా ప్రకటనలు కూడా విడుదల చేశాయి.
అమ్మకాలకు బ్రేక్
కేంద్రం జీఎస్టీ పన్నుల శ్లాబుల్లో మార్పులు చేస్తుందనే సమాచారం వచ్చిన నాటి నుంచి వాహనాలు కొనుగోళ్లు మందగించాయి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత దాదాపుగా అమ్మకాలు నిలిచిపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గల కార్లు, ద్విచక్రవాహనాల షోరూంల్లో కొద్దిరోజులుగా కొనుగోళ్లు జరగడంలేదు. ఈనెల 21వ తేదీ వరకూ ఇదే పరిస్థితి కొనసాగనున్నది. 22వ తేదీ నుంచి జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఆ తర్వాతే కొనుగోళ్లు జరపాలని వినియోగదారులు భావిస్తుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. సాధారణంగా కాకినాడ జిల్లాలో ప్రతినెలా సగటున 2వేల నుంచి 3 వేల వరకూ ద్విచక్ర వాహనాలు, 300- 450 వరకూ కార్లు విక్రయాలు జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలో 2,200 నుంచి 2,800 వరకూ ద్విచక్ర వాహనాలు, 300-500 వరకూ కార్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి నెలా 1800 నుంచి 2,500 వరకూ ద్విచక్ర వాహనాలు, 300నుంచి 500 వరకూ కార్లు విక్రయాలు జరుగుతాయి. విజయదశమి, దీపావళి, సంక్రాంతి, ఉగాది తదితర పండుగల సమయా ల్లో వీటి విక్రయాలు రెట్టింపుపైగా ఉంటాయి.
ముందస్తు బుకింగ్‌లపై దృష్టి
ఇప్పుడు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల కం పెనీలతోపాటు షోరూంల నిర్వాహకులు కొనుగోలుకు ఆసక్తి చూపించే వారివద్దనుంచి ముందస్తు బుకింగ్‌లు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు షోరూంలు ఆఫర్లు ప్రకటించాయి. తమ వద్ద కొనుగోలు చేసే వారికి యాక్సిసరీలు ఉచితంగా ఇస్తామంటూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు కార్ల కంపెనీలు తమ కార్లు ఇప్పుడు కొనుగోలు చేసినా జీఎస్టీ తగ్గింపు వర్తింపజేస్తామం టూ ప్రకటనలు జారీ చేశాయి. సాధ్యమైనంత వరకూ ఎక్కువమందికి తమ వాహనాలు విక్రయించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు.