సూపర్ మాయ!
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:23 AM
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి సామాన్యు లకు భారీ ఉపశమనం కలిగించి నెల దాటిం ది. ఇప్పటికీ సూపర్ జీఎస్టీ ఫలాలు సామా న్యుడికి దక్కడం లేదు.
కానరాని జీఎస్టీ తగ్గింపు
పాత ధరలకే అమ్మకాలు
పాత స్టాకు పేరిట దోపిడీ
మోసపోతున్న కొనుగోలుదారు
అధికారుల చర్యలు శూన్యం
ఆన్‌లైన్‌లోనూ అయోమయం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి సామాన్యు లకు భారీ ఉపశమనం కలిగించి నెల దాటిం ది. ఇప్పటికీ సూపర్ జీఎస్టీ ఫలాలు సామా న్యుడికి దక్కడం లేదు. ప్రభుత్వాల ఆదేశాలతో యంత్రాంగం ఓ వారం హడావుడి చేసి చతి కిలబడింది. మొన్నటి వరకూ పండుగ ఆఫర్లు అంటూ ఊదరగొట్టిన వ్యాపారులు.. ఇప్పుడు ప్రత్యేక తగ్గింపు అంటూ యథావిధిగా మోస పు ఉదారత చాటుకుంటున్నారు. మరి తగ్గిన జీఎస్టీ ఎంత? అసలు అంతకు ముందు ధర ఎంత? కేంద్ర ప్రభుత్వం తమకు కల్పించిన మేలుతో లాభం ఎంత సమకూరింది? అనే ప్రశ్నలకు సమాధానం ప్రశ్నగానే ఉండి పో తోంది. వ్యాపారులు మాత్రం తమ చాకచ క్యాన్ని ప్రజలపై రుద్దుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం గతంలో ఉన్న ఐదు స్లాబులను రెండుకు తీసుకొచ్చాం..జనానికి భారీగా ఒనగూరుతుందని చెప్పింది. ఈ ధర ల మోళీ జీఎస్టీ సూపరట! సేవింగ్స్ ఎక్క డట? అనే సందేహాన్ని నివృత్తి చేయలేక పో తోంది.ఈ గందరగోళం నడుమ ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లాలో రోజుకు జనం కోట్లాది రూపాయలు నష్టపోతూనే ఉన్నారు.
వ్యాపారుల మాయాజాలం..
జీఎస్టీ తగ్గక ముందు ఎంత ధర, తర్వాత ఏ మేరకు తగ్గిందనే విషయాలు దుకాణాల్లో ఎక్కడా కనబడడం లేదు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అయితే అంతా అయోమయమే నడుస్తోంది. అసలు ధరను అమాంతం పెంచేసి భారీ తగ్గింపును చూపిస్తుం టారు. ఇప్పుడు కూడా ఆ మాదిరిగానే ధరలు ఉండ డంతో జీఎస్టీ వల్ల తమకు ఏమి ఒరిగిందో విని యోగదారుడికి బోధ పడడం లేదు. మొన్నటి వరకూ పండుగ ఆఫర్ల పేరుతో అంతా కలగాపులగం చేసే శారు. జీఎస్టీ తగ్గింపు ఎంత, వ్యాపారి ఇస్తున్న ఆఫర్ ఎంత? అనే వాటిపై స్పష్టత లేకుండాపోయింది. జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. గతంలో ఐదు స్లాబులుగా ఉన్న పన్నులను 5, 12ు రెండు స్లాబులకు తెచ్చింది. దీనిలో కారుల నుంచి బిస్కట్ల వరకూ దాదాపు 375 వస్తువులపై 5 నుంచి 10 శాతం వరకూ పన్నుపోటు తగ్గింది. కొన్నిటికి పన్ను సున్నా చేశారు. అయితే ఆ మేరకు వినియో గదారుడికి ఎంత లబ్ధి చేకూరిందో సూపర్ జీఎస్టీ అమల్లోకి వచ్చి నెల దాటినా స్పష్టత కొరవడింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో మరీ దారుణంగా పరిస్థితి నడుస్తోంది. వాస్తవ ధర నిర్ధారణలో స్పష్టత లేకపో వడంతో రూ.5 విలువ చేసే పెన్‌ని రూ.5 వేల ధర చూపించి 99 శాతం డిస్కౌంట్ ఇచ్చేస్తున్నామని రూ.50 ధర పెడుతున్నారు. దీని వల్ల ఇప్పుడు జీఎస్టీ ఎంత తగ్గించారో కూడా తెలియడం లేదు.
మందుల్లో మోళీ..
ఇవాళ మందుల ఖర్చు చూసి రోగం మరింత ముదిరి పోతోంది. ఓ వైపు అధిక శాతం డాక్టర్లు మందులతో చీటీలను పూర్తిగా నింపేస్తుంటే.. మరోవైపు మందుల దుకాణాల వాళ్లు ఎడాపెడా దోచేస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో సొంత మెడికల్ షాపులు అదనపు వ్యాపా రంగా మారిపోయింది. బయట షాపుల్లో ఎమ్మార్పీపై ఏకంగా 20 శాతం వరకూ తగ్గింపు ఇస్తామంటూ వ్యాపారస్తులు పోటీ పడుతుంటారు. ఆస్పత్రుల్లోని మెడి కల్ షాపుల్లో ఆ రాయితీ వర్తించడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మందులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించింది. అత్యవసర మందులపై పన్ను ఎత్తేసింది. కానీ ప్రజలకు మాత్రం ఆ మేరకు జేబుకు ఆదా కనబ డడం లేదు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 వేల వరకూ మందుల షాపులు ఉండగా.. 150 వర కూ పెద్ద దుకాణాలు ఉన్నాయి. అత్య వసర మందులతో పాటు సాధారణ మందులను ఒకే చీటీలో రాస్తారు. దీంతో సందట్లో సడేమియా మాదిరిగా అత్యవసర మందులకు జీఎస్టీ తగ్గింపు ఇవ్వడం లేదు.
అంతా గందరగోళం
దుకాణదారులు జీఎస్టీ మార్పులను అమలు చేయడం లేదు. ఏదో ఒకటి రెండు వస్తువులపై తగ్గింపును చూపుతూ అధిక శాతం వస్తువులపై దోపి డీ సాగుతోంది. కిరాణా తదితర సరుకుల విషయంలో ఇదే నడుస్తోంది. కొందరు వ్యాపారులు పాత స్టాకు, పాత ధరలకే హోల్‌సేల్‌గా కొన్నా మం టూ ధరలు తగ్గించకపోవడం గమనార్హం. సబ్బులు, టూత్‌పేస్ట్, బిస్కట్లు, లేస్, బింగోస్ వంటి వాటి విషయంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ధరలు తగ్గించలేదు. అయితే వీటి పరిమాణాన్ని పెంచామని చెబుతూ గందర గోళానికి తెరలేపుతున్నాయి. పాలు, ఆహార పదార్థాలు, హోటళ్లు, నిత్యావస రాల్లో వేటిపై జీఎస్టీ ఎంత తగ్గిందో ఇప్పటికీ అయోమయంగానే ఉంది. సెప్టెంబరు 22 నుంచి సూపర్ జీఎస్టీ అమల్లోకి రాగా ఓ వారం రోజులు అధికారులు పరుగులు పెట్టారు. తర్వాత యథావిధిగా పట్టు వదిలేశారు.
జీఎస్టీ తగ్గలేదా.. ఫిర్యాదు చేయండి
జీఎస్టీ అమలుకాని పక్షంలో కొనుగోలుదారుడు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తగ్గిన పన్నుల ప్రకారం ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగించకపోతే కొనుగోలుదారుడు నేషనల్ యాంటీ ప్రాఫెటరింగ్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇలాంటి ఒక సంస్థ ఉందని వందలో ఒక్కరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికీ దీనిపై యంత్రాంగం అవగాహన కల్పించలేదు. అసలు అధికారుల్లో అధిక శాతం మందికి ఆ సంస్థ గురించి తెలియదు. బిల్లులు ఇవ్వకపోయినా వాణిజ్య పన్నుల శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు. అటు ఔషధ నియంత్రణ శాఖ అసలు ఉందా? అనే తీరు కనబరుస్తోంది.