Share News

జీఆర్‌ఎస్‌లో 211 అర్జీలు స్వీకరణ

ABN , Publish Date - May 27 , 2025 | 01:39 AM

ప్రతీ సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుందని భరోసా అధికారులు కల్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు.

జీఆర్‌ఎస్‌లో 211 అర్జీలు స్వీకరణ
గోదావరి భవన్‌లో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌పీ

అమలాపురం టౌన్‌, మే26(ఆంధ్రజ్యోతి): ప్రతీ సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుందని భరోసా అధికారులు కల్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్‌ రాజకుమారి, సమగ్రశిక్ష కోఆర్డినేటర్‌ జి.మమ్మి, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌, డీఎల్డీవో రాజేశ్వరరావు, ఎస్‌డీసీ పి.కృష్ణమూర్తి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 211 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంతోపాటు సంక్షేమం, అభివృద్ధిపరంగా వచ్చే ప్రతీ అర్జీని నాణ్యతగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్య సాధనలో ప్రజా సమస్యల పరిష్కారమే తొలిమెట్లు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 27న అధికారులతో మాస్‌ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 29న రైతులతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఆహార భద్రత చట్ట ప్రకారం ప్రస్తుత సీజన్‌లో మామిడిపండ్లను హానికరమైన రసాయనాలతో మగ్గపెట్టకుండా సహజంగా పండే వాటిని ప్రోత్సహించాలన్నారు. మగ్గపెట్టిన పండ్లు మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టయితే ఫుడ్‌ సెక్యూరిటీ కంట్రోల్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించి విక్రయదారులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులకు రిజిస్ర్టేషన్‌ ఐడీ నంబరు ఇవ్వడం జరుగుతుందని, కాల్‌సెంటర్‌ 1100 ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వికాసా జిల్లా మేనేజర్‌ గోళ్ల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 01:39 AM