రెండు రోజుల్లో..సుఖీభవ
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:07 AM
అన్నదాతలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. రైతులను ప్రోత్సహిం చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద సహాయం చేయనున్నాయి.
2న రైతుల ఖాతాలకు సొమ్ములు
అన్నదాత సుఖీభవ రూ.5 వేలు
పీఎం కిసాన్ రూ.2 వేలు
ఒక్కో ఖాతాలో రూ.7 వేలు జమ
పీఎం కిసాన్ లబ్ధిదారులే ఎక్కువ
కౌలు రైతులకు రూ.20 వేలు
వచ్చే విడత నుంచి అమలు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
అన్నదాతలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. రైతులను ప్రోత్సహిం చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద సహాయం చేయనున్నాయి.గత వైసీపీ ప్రభు త్వం ఉన్నప్పుడు రైతులకు ఏడాదికి కేవలం రూ. 13,500 మాత్రమే రైతు భరోసా కింద ఇచ్చేవారు. అందులో రాష్ట్రం వాటా రూ.7500, కేంద్రం వాటా రూ.6 వేలు ఉండాది. ఎన్నికల హామీలో భాగంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏకంగా 6,500 పెంచి మొత్తం రూ.20 వేలు వేస్తోంది. రాష్ట్రం వాటా రూ.14 వేలు, కేంద్రం వాటా రూ.6 వేలు. కానీ అప్పటి మాదిరిగానే మూడు విడతలుగా సొమ్ము రైతుల బ్యాంక్ ఖాతాలకు జమకానుంది. ఏప్రిల్ నుంచి జూలై వరకూ మొదటి విడత , ఆగస్టు నుంచి నవంబరు వరకూ రెండో విడత, డిసెంబర్ నుంచి మార్చి వరకూ మూడో విడతగా విభజించారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత రూ.5 వేలు, రెండో విడత రూ.5 వేలు, మూడో విడత రూ.4 వేలు జమ చేస్తుంది. పీఎం కిసాన్ పథ కం కింద ఒక్కో విడతకు రూ.2వేలు వంతున మూడు విడతల్లో ఆరువేలు సరిపెడుతుంది. ఆగస్టు 2న జిల్లాలో ఒక్కో రైతుకు రూ.7 వేల వంతున జమకానుంది.ఈ సారి ప్రభుత్వం కౌలు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. ఒక్కో రైతుకు రూ.20 వేల వంతున ఇస్తుంది. ఈ విడతలో ఇంకా అర్హులైన కౌలు రైతుల లెక్కతేలక వచ్చే విడత నుంచి జమచేస్తారు..
జిల్లాకు రూ.54 కోట్లు
ఆగస్టు 2న జిల్లా రైతాంగానికి అన్నదాత సుఖీభవ కింద సు మారు రూ.54 కోట్లు జమ కానుంది. జిల్లాలో మొత్తం 1,16, 544 మంది రైతులు ఉండగా వారిలో ఈకేవైసీ పూర్తయిన వారు 1,13,539 మంది ఉన్నారు.2,992 మందిని వివిధ కార ణాలతో రిజక్ట్ చేశారు. 13 పెండింగ్ ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో వారు ఆధారాలు చూపి సరిచేసుకుంటే డబ్బులు పడ తాయి.ఆధార్ నంబర్ సరిగ్గా లేకపోవడం, బ్యాంక్ ఖాతాలు పనిచేయకపోవడం వంటి కారణాలు ఉన్నాయి.
పీఎం కిసాన్ రూ. 24 కోట్లు
పీఎం కిసాన్ కింద జిల్లాలో ఒక లక్షా 20 వేల మంది రైతులకు రూ.2 వేల వంతున రూ.24కోట్లు జమకా నుంది. జిల్లాలో అన్నదాత సుఖీభవ కంటే పీ ఎం కిసాన్ రైతులు ఎక్కువ మంది ఉన్నారు. దీనికి కారణం 2019 ఫిబ్రవరి 1వతేదీ లోపు భూమి రికార్డుల డేటా ఆధారంగా పీఎం కిసాన్ అమలవుతోంది. అప్పటి నుంచి డేటా మారలేదు. చనిపోయిన వారుంటే తీసేస్తున్నారు. కానీ అమ్మకాలు, కొనుగోళ్లు చేసిన రైతులకు మాత్రం ఈ పథకం వర్తిస్తుంది.
ఎవరు అనర్హులంటే..
రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అనర్హులు.ఎంపీ, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, సర్పంచ్, వార్డు సభ్యులు కూడా అనర్హులే.కౌన్సిలర్లు, మునిసిపల్ చైర్మన్లు అన ర్హులే. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభు త్వ ఉద్యోగులు అనర్హులు. వెబ్‌ల్యాండ్‌లో లేని రైతులకు ఈ పథకం వర్తించవదు. పీఎం కిసా న్ పథకం కింద గతంలో లబ్ధిపొందినా రైతు చనిపోతే వారి కుటుంబీలకు కూడా ఇవి వర్తిం చవు. జిల్లాలో ఈకేవైసీ కింద 13 మంది పెండింగ్ ఉన్నారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల్లో కొందరు ఉండగా బయోమెట్రిక్‌లో వేలిము ద్రలు పడకపోవడం వల్ల కొందరికి సమస్యగా ఉంది.కనీసం పది సెంట్ల భూమి ఉన్నా ఈ పథకం కింద అర్హులవుతారు.