జీజీహెచ్‌లో గర్భిణి మృతి దురదృష్టకరం
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:39 AM
రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు వచ్చిన గర్భిణి డెలివరీ సమయంలో అధిక రక్తస్రావంతో మృతిచెందడం దురదృష్టకరమని, అది తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన జీజీహెచ్ గైనిక్ విభాగాన్ని ఆయన సందర్శించారు.
మాజీ ఎంపీ విమర్శలు అర్థరహితం
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు వచ్చిన గర్భిణి డెలివరీ సమయంలో అధిక రక్తస్రావంతో మృతిచెందడం దురదృష్టకరమని, అది తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన జీజీహెచ్ గైనిక్ విభాగాన్ని ఆయన సందర్శించారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలు, ఇతర సదుపాయాలపై సమీక్ష చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గర్భిణి మృతి విషయం తెలియగానే సంబంధిత అధికారులతో మాట్లాడానని, ఘటనపై లోతుగా విచారణ జరపాలని జీజీహెచ్ ఉన్నతాధికారులకు చెప్పానన్నారు. డాక్టర్ల నివేదికను పరిశీలించామని, అధిక రక్తస్రావంతో మృతిచెందడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారని అన్నారు. కూటమి పాలనలో ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ, ఆరోగ్య రాజమండ్రి నినాదంతో ముందుకు వెళుతున్నామని, ఇందులో భాగంగా ఆసుపత్రి అభివృద్ధికి చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందే వైద్యసేవలను ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఉచితంగా అం దించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మాజీ ఎంపీ భరత్‌రామ్ వ్యాఖ్యలపై ఆయన సీరియస్‌గాను, వ్యంగ్యంగాను స్పందించారు. భరత్‌రామ్ రాజకీయంగా పరిణతిలేని, అవగాహన లేని వ్యక్తి. ఆయన బాగా డిస్ట్రబ్‌గా ఉన్నాడు అన్నారు. అలాగే, శారీరకంగానే కాదు, మానసికంగాను కొంచెం పాడైనట్టు ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధినేత వాడుతున్నట్టుగా లండన్ మందులు వేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. సంక్రాంతి పండగ నాటికి మోరంపూడి ఫ్లై ఓవర్ సర్వీస్‌రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తవుతుందని, వారం పదిరోజుల్లో లైట్లు వెలుగుతాయన్నారు. సమావేశంలో ఆర్‌ఎంవో సుబ్బారావు, కూటమి నాయకులు, హెచ్‌డీఎస్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.