ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంపొందించాలి : జేసీ నిషాంతి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:25 AM
పౌరులకు ప్రభుత్వ సేవలు అందించడంలో సంతృప్తి స్థాయిల్లో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
అమలాపురం, జూలై 8(ఆంధ్రజ్యోతి): పౌరులకు ప్రభుత్వ సేవలు అందించడంలో సంతృప్తి స్థాయిల్లో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. మంగళవారం అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలనా ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, మరో కార్యదర్శి ప్రభాకరరెడ్డి వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం జేసీ నిషాంతి మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు శ్మశానవాటిక లేని గ్రామాల్లో వాటి నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సేకరిస్తున్న సంతృప్తి స్థాయిలో తక్కువగా నమోదవుతున్నాయన్నారు. పీజీఆర్ సమస్యల పరిష్కారానికి మెరుగైన పనితీరు అవసరమని సూచించారు. విశ్రాంత తహశీల్దార్లు, ఉపతహశీల్దార్లను నియమించుకుని వారికి ఉన్న అనుభవాలు, సలహాలు, సూచనలతో అర్జీలపై విచారిస్తూ నూరుశాతం సంతృప్తిస్థాయిలు పొందాలని కోరారు. తల్లికి వందనం పథకం అమలులో తిరస్కరణకు గురైన లబ్ధిదారులకు మళ్లీ దరఖాస్తులను విచారించి విభజన చేసి అర్హులకు అవకాశమివ్వాలన్నారు. భూసర్వే ప్రక్రియ 2027, డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ ట్రూథింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్, గ్రామసభల నిర్వహణ చేపట్టాలన్నారు. త్వరలో డిజిటల్ పాస్ పుస్తకాలు వస్తాయని, పాత పుస్తకాలను ఇచ్చి కొత్త పుస్తకాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూయాజమాన్యాలకు అందించాల్సి ఉంటుందన్నారు. భూపరిపాలనా, రీసర్వే అంశాలపై మండలస్థాయి నుంచి సమీక్షిస్తూ ఆశించిన పురోగతిని తీసుకురావాలన్నారు. 706 లేఅవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి అర్హులకు అందించాలని ఆదేశించారు. డీఆర్వో రాజకుమారి, ఆర్డీవోలు మాధవి, శ్రీఖర్, అఖిల పాల్గొన్నారు.