Share News

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే యోగాంధ్ర లక్ష్యం

ABN , Publish Date - May 31 , 2025 | 12:31 AM

ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే యోగాంధ్ర లక్ష్యమని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు.

  ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే యోగాంధ్ర లక్ష్యం

అమలాపురం, మే 30(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే యోగాంధ్ర లక్ష్యమని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఎంపీడీవోలతో ఆమె సమావేశం నిర్వహించారు. గ్రామ, మండల స్థాయిలో యోగాంధ్రకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ శిక్షణలు, యోగా పోటీలు, గ్రాండ్‌ ఈవెంట్ల నిర్వహణపై ఆమె సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఎనిమిది లక్షల మందిని నమోదుచేసి యోగాభ్యాసం కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ప్రతీ మండలంలో 40వేల మంది చొప్పున నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. మతాలతో సంబంధం లేకుండా ఆరోగ్యమే పరమావధిగా యోగాభ్యాసనం కార్యక్రమాల్లో ప్రభుత్వ ఆశయ సాధన దిశకు అందరూ కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించకుండా సచివాలయాల్లో కూర్చుని నమోదు ప్రక్రియ చేపడితే పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తమ పేర్లు తమకు తెలియకుండానే నమోదు చేశారని ఆర్టీజీఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదులు అందితే సంబంధిత సిబ్బంది పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జూన్‌ 2 నుంచి 7వరకు మండలస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్‌ 3న అంతర్వేదిలో బీచ్‌లో 2వేల మందితో మెగా ఈవెంట్‌, యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించాలన్నారు. జూన్‌ 9న ద్రాక్షారామ భీమేశ్వరశ్వరస్వామి ఆలయం వద్ద, 16న వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించాలన్నారు. ఈవెంట్ల నిర్వహణపై జన సమీకరణపై విశ్వహిందూ పరిషత్‌, ఓంశాంతి, బ్రహ్మకుమారీలు, ఇస్కాన్‌, వివిధ స్వచ్ఛంధ సంస్థలు, కళాశాలల సహకారం కోరాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్‌ రాజకుమారి, డీఎల్డీవో రాజేశ్వరరావు, డ్వామా పీడీ ఎస్‌.మధుసూన్‌, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 12:31 AM