Share News

కనకపు..సింహాసనం!

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:02 AM

పెళ్లంటే.. పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు..తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. ఇదంతా ఒకప్పుడు.. ఈ కాలంలో పెళ్లంటే.. కాసులు.. గ్రాములు.. కిలోలు.

కనకపు..సింహాసనం!

రికార్డు స్థాయిలో బంగారం ధరలు

పెళ్లింట పెట్టలేక సతమతం

చదివింపుల్లోనూ కనుమరుగు

సామాన్య,మధ్యతరగతికి భారం

కొనుగోళ్లకు దూరంగా జనం

ఏడాదిలో రూ.50 వేల వరకూ తేడా

(కాకినాడ/రాజమహేంద్రవరం/ మండపేట /పిఠాపురం,ఆంధ్రజ్యోతి)

రావులపాలెంనకు చెందిన అబ్బాయికి నల్లజర్లకు చెందిన యువతితో పెళ్లి చూపులు జరిగాయి.. ఒకరికొకరు నచ్చారు.. కట్నం రూ.3 లక్షలు ఇస్తామని చెప్పడంతో ఓకే అనుకున్నారు.. మరి బంగారం ఏం పెడతారని ఇరు తరుపు బంధువులు రంగంలోకి దిగారు. అమ్మాయికి 3 కాసులు పెడతామని వధువు తరపువారు చెప్పా రు.. 3 కాసులకు ఏం వస్తుంది.. 10 కాసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 10 కాసుల బంగా రానికి 10 లక్షలు అవుతుందని అంత పెట్టలేమని 3 కాసులే పెడతామని వధువు తరపు వారు చెప్పారు.. మళ్లీ కబురుపెడతామంటూ వరుడి తరపు వారు వచ్చేశారు..

పిఠాపురానికి చెందిన యువతీయువకులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు.. ఇద్దరు దగ్గర బంధువులే కావడంతో వివాహం నిశ్చయించారు. అయినప్పటికి బంగారం ఎంత పెట్టాలనే విషయంలో మాత్రం ఎవరు వెనక్కి తగ్గలేదు. మాకు కట్నం ఎంతిచ్చినా పర్వాలేదు. బంగారం మాత్రం మేము అడిగినంత పెట్టాల్సిందే అంటూ పట్టుబట్టారు. పెళ్లికూతురికి అమ్మాయి తరపు వారు 20 కాసులు, పెళ్లి కొడుకు తరపు 10 కాసుల బంగారు ఆభరణాలు పెట్టేలా ఒప్పందం కుదిరింది. పెళ్లికొడుక్కి ఐదు కాసులు పెట్టాలని షరతు పెట్టారు. బంగారం విషయంలో అంగీకారానికి వచ్చి కట్నం మాత్రం అమ్మాయి తరపు వాళ్ల ఇష్టాఇష్టాలకు వదిలేశారు.

రాజమహేంద్రవరానికి చెందిన అమ్మాయికి పాలకొల్లుకు చెందిన అబ్బాయితో పెళ్లి మాటలు జరిగాయి.. వరుడు తరపు వాళ్లు బంగారం ఎంత పెడతారని వధువు తరపు వారిని అడిగారు.. 10 కాసులు పెడతామని చెప్పారు.. మీరెంత పెడతారని వరుడు తరపు వారిని అడిగితే 8 కాసులు అన్నారు.. ఇరు పక్షాల వారు 18 కాసులు వధువుకి పెట్టేలా అంగీకరించారు. అయితే వరుడికి 5 కాసులు బంగారం అడిగారు. అంత పెట్టలేమని 3 కాసులు పెడతామని వధువు తరపు వారు చెప్పారు.. 2 కాసులు పెట్టకపోతే సంబంధం వదిలేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి వధువు తరపు వారు తగ్గి 5 కాసులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయడంతో పెళ్లి ఓకే అయ్యింది..

పెళ్లంటే..

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు..తప్పెట్లు..

తాళాలు.. తలంబ్రాలు.. ఇదంతా ఒకప్పుడు..

ఈ కాలంలో పెళ్లంటే.. కాసులు.. గ్రాములు.. కిలోలు..అంటే బంగారం ఎన్ని కాసులు పెడతారు దగ్గర ఆరంభమై ఎన్ని కిలోల వెండి పెడతారు దగ్గర కథ ముగిస్తున్నారు.. ఎందుకంటే ప్రస్తుతం బంగారం 10 గ్రాములు అక్షరాలా రూ.లక్ష దాటేసింది.. 10 కాసులు బంగారం పెట్టాలంటే రూ.10 లక్షలే.. బంగారం రాకెట్‌ వేగంతో పరుగులు తీస్తోన్న తరుణంలో వివాహాల్లో బంగారం పెట్టి పోతలు చుక్కలు చూపిస్తున్నా యి. పెళ్లి ఖర్చును మించి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ.. అందరికీ అందకుండా పోయింది.

ఇంట్లో చిన్న వేడుకైనా పిసరంతైనా పసిడి కొనితీరాల్సిందే. పెద్ద పండుగలకు, వివాహాలకు బంగారం లేని వేడుకను ఊహించడం కష్టం. అంతలా మన జీవితాల్లో సువర్ణం ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కొంది. ఎంత పేద వారి పెళ్లయినా కనీసం 10 గ్రాముల బంగారం కొలువుదీరాల్సిందే. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు బంగారం కంటే ఎక్కువగా మెరుస్తున్నాయి. ఒకవైపు ఈనెల 23 నుంచి వివాహ ముహూర్తాలు ఉన్నాయి. బంగారం ధర గారం చేస్తూ దిగిరానంటోంది. దీంతో ఇంట్లో పెద్ద వాళ్లకు పెళ్లి తంతు, ఖర్చు కంటే పసిడి చింత ఎక్కు వైపోయింది. పందిట్లో పడతుల ఒంటిపై పసిడి మెరుపు లొలుకుతూ ఉంటే ఆ కళే వేరు కదా మరి!

కనకం..చదివింపుల్లేవ్‌..

కొంతకాలం కిందట వేడుకల్లో బంగారం చదివించే వారు.. పెరిగిన ధరలతో ఇవన్నీ కనుమరుగవు తున్నాయి. ప్రస్తుతం నగదు చదివింపులతో సరిపెట్టేస్తున్నారు.. ప్రస్తుతం ఆభరణాల చదివింపులు మాయమైపోతున్నాయి.. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు పెళ్లి కోసం మూడు నాలుగు తులాల బంగారం కోనుగోలు చేసేవారు ఇప్పుడు ధర పెరగడంతో సగం అంటే రెండు తులాలకు పరిమితమవుతున్నారు. వెండి ధర భారీగా పెరగడంతో అటు వైపు సామాన్యులెవరు వెళ్లడం లేదు.కేవలం కాళ్లకు పట్టీలు, తప్ప వెండివైపు చూడడం లేదు.

కొనగలమా!

బంగారం ధర అడ్డుఅదుపు లేకుండా పరుగులు తీస్తోంది. రికార్డు స్థాయిలో అందనంతగా పెరిగిపోతోంది.ఒక్క ఏడాది ధరలు డబులు పెరిగాయి. గతేడాది ఇదే సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69 వేలు ఉండగా ప్రస్తుతం రూ.1,11,160లు ఉంది. 22 క్యారెట్లు 101900 ఉంది.గతేడాది కిలో వెండి రూ.50 వేల వరకు ఉండగా ప్రస్తుతం కిలో రూ.1,31,600 ఉంది.

బంగారంలా!

వేడుకల్లో వధూవరుల అలంకారంలో కాకి బంగారాన్ని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అంటే నాణ్యత తక్కువ కలిగిన లేదా బంగారం మాదిరిగా కనబడే లోహాలతో ఆభరణాలు ఉంటున్నాయి. వేడుకలకు వచ్చే మహిళలు ఎక్కువ శాతం రోల్డు గోల్డు, వన్‌ గ్రామ్‌ గోల్డు ఆభరణాలు ధరిస్తున్నారు.చెవిదిద్దుల నుంచీ వడ్డాణం వరకూ రోల్డు గోల్డు నగలు అందుబాటులో ఉండడంతో వాటినే ఎక్కువ శాతం వినియోగిస్తున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 01:02 AM