కన్నీటి గోదారై..
ABN , Publish Date - May 28 , 2025 | 01:09 AM
ఎటు చూసినా ఆర్తనాదాలే.. పిల్లల కోసం ఎదురుచూపులే.. క్షేమంగా బయట పడాలని మొక్కుబడులే.. ఇవేమీ ఫలించలేదు.. గల్లంతైన ఎనిమిది మందిలో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ ఆశలు సమాధి చేసిన బిడ్డలను గుండెలకు హత్తుకుని.. దేవుడా ఇక మాకు దిక్కెవరు.. మేం ఎందుకు బతకాలంటూ రోదించారు.. వారిని ఆపడం ఎవరితరం కాలేదు.. ఒక్కసారిగా కన్నీరు.. గోదారైంది..!
ఆరు కుటుంబాల్లో అంతులేని విషాదం
ఏడుగురి మృతదేహాలు లభ్యం
కానరాని క్రాంతి మాన్యువల్ ఆచూకీ
నేడు గాలింపు కొనసాగింపు
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
మాకు దిక్కెవరంటూ రోదనలు
అమ్మా వెళ్లొస్తానన్నావు.. లే నాన్నా ఇంటికెళ్లిపోదాం.. నిర్జీవంగా పడి ఉన్న కొడుకును పట్టుకుని ఒక తల్లి పిలుస్తూనే ఉంది.. నాన్నా ఊరెళ్లొస్తానన్నావు.. ఎప్పుడొస్తావురా.. నీ కోసం నిన్న రాత్రి నుంచి చూస్తూనే ఉన్నా.. రారా వెళ్లిపోదాం! ఇదీ ఒక తండ్రి వేదన.. అన్నయ్యా.. ఇక నాకు దిక్కెవరు.. నువ్వు లేకుండా నేనుండలేను.. అమ్మా నాన్నా లేరు.. నేను నీ దగ్గరికే వచ్చేస్తా.. ఇదీ ఒక చెల్లి వేదన.. ఎటు చూసినా ఆర్తనాదాలే.. పిల్లల కోసం ఎదురుచూపులే.. క్షేమంగా బయట పడాలని మొక్కుబడులే.. ఇవేమీ ఫలించలేదు.. గల్లంతైన ఎనిమిది మందిలో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ ఆశలు సమాధి చేసిన బిడ్డలను గుండెలకు హత్తుకుని.. దేవుడా ఇక మాకు దిక్కెవరు.. మేం ఎందుకు బతకాలంటూ రోదించారు.. వారిని ఆపడం ఎవరితరం కాలేదు.. ఒక్కసారిగా కన్నీరు.. గోదారైంది..!
(అమలాపురం/ముమ్మిడివరం -ఆంధ్రజ్యోతి)
నిన్నటి వరకూ తమ కళ్లెదుటే ఆడుతూ పాడుతూ తిరి గారు..ఆనందంగా వారి మధ్యనే గడిపారు.. అంతలోనే మృ త్యువు ముంచుకొచ్చింది.. 8 మందిని ముంచేసింది.. గోదారమ్మ సాక్షిగా తరలిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఏడు మృతదేహాలు సోమవారం లభ్యం కాగా గౌతమి గోదావరి తీరం మృతుఘోషతో మార్మోగింది. కుటుంబీకుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. బాధిత కుటుంబీకుల కన్నీళ్లు గోదావరి ప్రవాహంలా మారాయి. కె.గంగవరం మండలం శేరిలంకలో ఒక ఫంక్షన్‌కు 14 నుంచి 20 సంవత్సరాలు వయసు కలిగిన 11 మంది హాజరయ్యారు. భోజన విరామం అనంతరం సాయంత్రం వేళ ముమ్మిడివరం మండలం కమిని శివారు సలాదివారిపాలెం వద్ద ఉన్న గౌతమి నదిలో సరదాగా స్నానాలకు దిగారు. కాకినాడ, మండపేట, ఐ.పోలవరం ప్రాంతానికి చెందినవారు స్నానం కోసం నదిలో దిగి ఒక్కొక్కరిగా మొత్తం ఎనిమిది మంది కొట్టుకుపోయారు. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమె సోమవారం రాత్రి నుంచి 11 గంటల వరకు పడవలపై గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభ్యంకాలేదు. మంగళవారం ఉదయం నుంచే 35 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ సభ్యుల బృందం, 10 మందితో కూడిన క్విక్ టీమ్, రెండు బృందాలు అగ్నిమాపకదళ సిబ్బంది, రెండు స్పీడ్‌బోట్లు, రెండు హైస్పీడ్‌బోట్లు, ఐదు ఇంజను బోట్లతో పాటు స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఐ.పోలవరం, కాట్రేనికోన ఎస్‌ఐలు ఎం.రవీంద్రబాబు, ఐ.అవినాష్, ముమ్మిడివరం తహశీల్దార్ ఎంవీ సుబ్బలక్ష్మి సమక్షంలో వైద్యులు నిఖిత, పృథ్వి, కౌశిక్, సాయిశృతి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను ఒక్కొక్కటిగా బంధువులకు అప్పగించారు. మృతదేహాల గాలింపు సహాయక చర్యలను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. అమలాపురం, రామచంద్రపురం ఆర్డీవోలు కె.మాధవి, డి.అఖిల, రామచంద్రపురం, అమలాపురం డీఎస్పీలు బి.రఘువీర్, టీఎస్‌ఆర్కే ప్రసాద్, రామచంద్రపురం, ముమ్మిడివరం సీఐలు వెంకటనారాయణ, ఎం.మోహన్‌కుమార్, ముమ్మిడివరం ఎస్‌ఐ డి.జ్వాలాసాగర్, కె.గంగవరం ఎస్‌ఐ జానీబాషా సంఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డ్రోన్ల సాయంతో గోదావరి తీరంలో మారుమూల సైతం శోధించారు. ఇలా సాయంత్రానికి ఏడు మృతదేహాలను వెలికితీసి ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తరువాత బంధువులకు అప్పగించారు. ఇక కాకినాడకు చెందిన సబ్బతి క్రాంతిమాన్యువల్ (19) ఆచూకీ కోసం గాలింపు చర్యలు సాయంత్రం వరకు కొనసాగాయి. చీకటి పడడంతో మంగళవారం రాత్రి గౌతమీ నదిలో గాలింపు చర్యలను నిలిపివేశామని తిరిగి బుధవారం ఉదయం గాలింపు కొనసాగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ఏ మృతదేహం.. ఎక్కడ..
గోదావరిలో సోమవారం 8 మంది గల్లం తవ్వగా మంగళవారం ఉదయం 11గంటల వరకూ ఒక్క మృతదేహం లభ్యం కాలేదు.. రెస్క్యూ సిబ్బందికి ఏం చేయాలో పాలు పోలేదు. చివరకు స్పీడ్ బోటు తెచ్చి గోదా వరిలో పోనివ్వడంతో ఒక్కొక్కటిగా ఏడు మృతదేహాలు బయటపడ్డాయి. ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15) మృతదేహం సంఘటనా స్థలానికి 600 మీటర్ల దూరంలో పశువుల్లంక-సలాదివారిపాలెం వారధి సమీపంలో లభ్యమైంది. సబ్బతి పాల్‌అభిషేక్ (18) మృతదేహం గేదెల్లంక ఉత్తరవాహిని పుష్కరరేవు సమీపంలో లభించింది. ఎలిపే మహేష్ అలియాస్ బాబు (15) మృతదేహం గేదెల్లంకవైపు లభ్యమైంది. ఎలుమర్తి సాయిమహేష్ (20) మృతదేహం గేదెల్లంక ఉత్తరవాహినికి దగ్గరలో లభించింది. కులపాక మల్లేశ్వరవీరవెంకటరోహిత్ (19) మృతదేహం సంఘటనా స్థలానికి 500 మీటర్ల దూరంలో సలాదివారిపాలెం సమీపంలో లభ్యమైంది. తాతపూడి నితీష్‌కుమార్ (18) మృత దేహం సలాదివారిపాలెం వంతెన సమీపంలో లభ్యమైంది. వడ్డి రాజేష్ (13) మృతదేహం దగ్గరలోనే గేదెల్లంక వైపు లభ్యమైంది.
నాకు ధైర్యం నా కొడుకే.. ఇప్పుడేం చేయాలి..
నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక్కగానొక్క కుమారుడు. ఆటో జీవనాధారం. అమ్మాయిలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో.. కుమారుడిని ప్రైవేటు కళాశాలలో చదివిస్తున్నా. ఎందుకంటే వాడే నాకు ఆధారం. బీఎస్సీ యానిమేషన్ కోర్సు చేస్తున్నాడు. త్వరలోనే యానిమేషన్ ఎడిటింగ్‌కు వెళ్లి లక్షల్లో సంపాదిస్తా.. చెల్లెళ్ల పెళ్లి చేస్తా.. అధైర్య పడొద్దని ధైర్యం చెప్పి అనంతలోకాలకు వెళ్లిపోయాడంటూ తండ్రి రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. కొడుకు లేకుండా ఇంటికెళితేనా భార్యకు నేను ఏం సమాధానం చెప్పాలంటూ రాజు గుండెలు అవిసేలా విలపిస్తున్నాడు.
- మృతుడు తాతపూడి నితీష్‌కుమార్ తండ్రి రాజు, కాకినాడ
ఇక.. ఆ చెల్లికి దిక్కెవరు!
చిన్నతనంలోనే రోహిత్ తల్లిదండ్రులను కోల్పోయాడు. మేమే పెంచి పెద్ద చేస్తున్నాం. రోహిత్, అతని చెల్లి బిందుమాధవిని చదివిస్తున్నాం. ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండేవారు.. చెల్లి బిందు మాధవికి ఎవరు దిక్కెవరంటూ పెంచి పెద్దచేసిన దంపతులు.. అన్నయ్య ఏడంటూ బిందుమాధవి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
- మృతుడు రోహిత్ పెద్దమ్మ పెదనాన్న, మండపేట
అన్నదమ్ములిద్దరూ ఒకేసారి..
ముమ్మిడివరం/ఐ.పోలవరం, మే 27 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు కావడంతో ఐ.పోలవరం మండలం ఎర్రగరువు నుంచి అమ్మమ్మ కొండేపూడి బాలమ్మ ఊరైన శేరిలంకకు వెళ్లిన అన్నదమ్ములిద్దరినీ గోదారమ్మ మింగేసింది. భీమనపల్లి హాస్టల్‌లో ఉంటూ పది, ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరి తల్లి భవానీ గల్ఫ్‌లో ఉండగా తండ్రి భైరవస్వామి జి.మూలపొలంలో ఉంటున్నాడు. బిడ్డలిద్దరూ గోదావరి పాలు కావడంతో కుటుంబం రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.తల్లి భవాని ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉండగా వీసా లభించకరావడం లేదని తెలిసింది. మృతదేహాలను ఎర్రగరువు తరలించారు.
-వడ్డి మహేష్, రాజేష్‌ల అమ్మమ్మ బాలమ్మ,తండ్రి భైరవస్వామి
పెద్దోడు డబ్బులడిగాడు.. అదే చివరి మాట..
బిడ్డలిద్దరినీ ఎంతో గారాబంగా పెంచాం. స్నేహితుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళుతున్నామని పెద్దోడు క్రాంతి మాన్యుయల్ అంటే ఫోన్‌పే చేశా. అదే చివరి మాట.. చిన్నోడు పాల్ అభిషేక్‌తో కనీసం మాట్లాడలేకపోయా. ఎంతో ఆనందంగా వేడుకకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు. నా బిడ్డలు లేకుండా నేను ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్లగలను అంటూ తండ్రి రమేష్ బోరున విలపిస్తున్నాడు. చిన్నోడు అభిషేక్ మృతదేహం లభ్యంకాగా పెద్దోడు క్రాంతి ఆచూకీ లభ్యంకాక తండ్రి రమేష్ పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.
- మృతుడు సబ్బిత పాల్ అభిషేక్ తండ్రి రఘుఏలు, పాస్టర్, కాకినాడ
చేతికందకుండాపోయాడు..
నాకు ఇద్దరు కుమా రులు.. చిన్నోడు సాయి మహేష్ ఒంగోలులో ఫిజియోథెరపీ చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. స్నేహితులతో కలిసి శేరిలంకలో జరిగిన వేడుకకు వెళ్లాడు. ఇలా విగతజీవిగా మారాడని ప్రసాద్ దుఃఖంతో కుమిలిపోతున్నాడు. - మృతుడు ఎలుమర్తి సాయిమహేష్ తండ్రి ప్రసాద్, కాకినాడ
అమ్మ గల్ఫ్‌లో..తండ్రి పట్టించుకోడు..
ఉపాధి నిమిత్తం తల్లి వెంకటలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటుంది. తండ్రి రమేష్ కుటుంబాన్ని ఎప్పటి నుంచో పట్టించుకోవడం లేదు. మహేష్ కె.గంగవరం మండలం శేరిలంకలో అమ్మమ్మ కొండేపూడి మర్లమ్మ వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మిత్రులతో కలిసి సరదాగా వెళ్లిన మహేష్ అనంత లోకాలకు వెళ్లిపోవడం తట్టుకోలేకపోతున్నామని పెదనాన్న గెడ్డం నాగరాజు ప్రభుత్వాసుపత్రి వద్ద బోరున విలపిస్తున్నాడు.
-మృతుడు ఎలిపే మహేష్ పెదనాన్న గెడ్డం నాగరాజు