ఉరకలేస్తోంది
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:22 AM
గోదావరి నది ఉరకలేస్తోంది. వరద ఉధృతంగా పెరుగుతోంది. దీంతో జిల్లాలోని గౌతమీ, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ట నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లోకి వరదనీరు చేరుతుండడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఉధృతంగా పెరుగుతున్న గోదావరి వరద
సముద్రంలోకి 11.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
సఖినేటిపల్లి-నర్సాపురం సహా అన్ని రేవుల్లోను పంటు ప్రయాణాలు నిలుపుదల
దిండి-చించినాడ మధ్య వారధి మరమ్మతులు మూడురోజులపాటు వాయిదా
అప్పనపల్లిలో పర్యటించిన కలెక్టర్ మహేష్‌కుమార్
లంకల్లో వరద ప్రభావం.. నీటమునుగుతున్న పంటలు
గోదావరి నది ఉరకలేస్తోంది. వరద ఉధృతంగా పెరుగుతోంది. దీంతో జిల్లాలోని గౌతమీ, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ట నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లోకి వరదనీరు చేరుతుండడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
జిల్లావ్యాప్తంగా ప్రధాన రేవులతో సహా వివిధ ప్రాంతాల్లో పంట్లు, పడవలపై ప్రయాణాలను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సమీక్షించారు. నియోజకవర్గ స్థాయిలో నియమితులైన ప్రత్యేకాధికారులు, ఆర్డీవోలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మూడురోజులపాటు దిండి, చించినాడ మధ్య వారధిపై మరమ్మతుల పనులను వాయిదా వేసినట్టు కలెక్టర్ ప్రకటించడంతో చిన్న వాహనదారులు ప్రయాణించడానికి మార్గం సుగమమైంది.
భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసి కోనసీమ జిల్లాలోని నదీపరివాహక గ్రామాలకు అలెర్ట్ ప్రకటించారు. సుమారు 11.50లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడంతో కోనసీమలోని నదీ పరివాహక గ్రామాల్లో వరద ముంపు అనూహ్యంగా పెరిగింది. తొగరపాయ, చాకలిపాలెం వద్దకాజ్‌వేలపై వరదనీరు చేరడంతో అక్కడ పరిస్థితులను అధికారులు సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 40కుపైగా లంకగ్రామాలు జలదిగ్భందానికి గురి కావచ్చని సమాచారం. కాగా వశిష్ట నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున ఉమ్మడి గోదావరి జిల్లా ప్రాంతమైన సఖినేటిపల్లి-నర్సాపురం మధ్య పంటు ప్రయాణాలను గురువారం నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈనెల 21నుంచి మూడురోజులపాటు దిండి-చించినాడవంతెన మరమ్మతుల దృష్ట్యా రాకపోకలు బంద్ చేసినట్టు ప్రకటించిన కలెక్టర్ వరద ఉధృతి దృష్ట్యా రేవుల్లో ప్రయాణాలు నిలిపివేయాలని ఆదేశించారు. అప్పనపల్లి కాజ్‌వే వద్ద వరద పరిస్థితులను కలెక్టర్ మహేష్‌కుమార్ గురువారం స్వయంగా పరిశీలించి అక్కడ అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వరద ఉధృతంగా పెరుగుతున్న దృష్ట్యా నదీపరివాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తతతో ఉండాలని పిలుపునిచ్చారు. పి.గన్నవరం మండలం జి.పెదపూడి వద్ద తాత్కాలిక గట్టు తెగిపోవడంతో నాలుగు లంక గ్రామాల ప్రజలకు పడవలపై లైఫ్ జాకెట్ల సహాయంతో దాటింపు చర్యలు కొనసాగిస్తున్నారు. శుక్ర, శనివారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగితే చేపట్టాల్సిన జాగ్రత్తలపై అధికారులు నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముందుజాగ్రత్తగా లంకప్రాంతాల్లో ఉన్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే పనిలో రైతులు ఉన్నారు. మహారాష్ట్రలో వర్షాల దృష్ట్యా వరద మరింత పెరిగొచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లంక ప్రాంతాల్లోని కొబ్బరితోటల్లో దింపులు తీసి సురక్షిత ప్రాంతాలకు తరలించుకుంటున్నారు.