Share News

రబీకి పూర్తిస్థాయిలో సాగునీరివ్వాలి

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:59 AM

ఇటీవల జరిగిన ఇరిగేషన్‌ సలహా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలుతీరుపై జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్సు హాలులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ఇరిగేషన్‌, డ్రెయిన్స్‌, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు సమన్వయంతో రానున్న రబీ సీజన్‌లో సాగు నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పూర్తిస్థాయిలో నీటిని అందించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు.

రబీకి పూర్తిస్థాయిలో సాగునీరివ్వాలి
కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, జేసీ నిషాంతి

  • సాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి

  • వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

  • అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన ఇరిగేషన్‌ సలహా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలుతీరుపై జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్సు హాలులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ఇరిగేషన్‌, డ్రెయిన్స్‌, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు సమన్వయంతో రానున్న రబీ సీజన్‌లో సాగు నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పూర్తిస్థాయిలో నీటిని అందించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. అలాగే ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, ఆక్వా రిజిస్ర్టేషన్లపై అధికారులతో సమీక్షించారు. రబీ సీజన్‌లో డెల్టా ప్రాంతంలో సాగునీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కాల్వల ద్వారా సరఫరా అవుతున్న నీటిని అంచనావేసి వారబందీ విధానంలో చిట్టచివరి ఆయకట్టు వరకు సాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. శివారు ప్రాంత భూములకు నీరు అందని పరిస్థితులు ఉంటే పంటకాల్వలు, డ్రెయిన్లు, చిన్నచిన్న కాల్వలపై క్రాస్‌ బండ్లువేయడంతోపాటు ఆయిల్‌ ఇంజన్ల సహకారంతో నీటిని అందించాలని ఆదేశించారు. గతంలో ఎదుర్కొన్న నీటి ఎద్దడి సమస్యలను ప్రస్తావిస్తూ మళ్లీ అవి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. పం టలు పొట్ట దశ పాలు పోసుకునే దశలో నీటి ప్రవాహాన్ని పెంచుతూ సీజన్‌ ఆద్యంతం కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్‌, డ్రైనేజీశాఖ అధికారులపై ఉందన్నారు. స్థానిక నీటి వినియోగదారుల సంఘాలు, ఇరిగేషన్‌, వ్యవసాయశాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ మండలస్థాయిలో వారానికి ఒకసారి, డివిజన్‌స్థాయిలో 15 రోజులకు ఒకసారి సాగునీటి సరఫరా అంశాలపై సమీక్షించి ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గతంలో ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన అంచనాల నివేదికలను రూపొందించి డిసెంబరు 2వ తేదీ నాటికి సమర్పిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. డెల్లా ప్రాంతంలో రబీ సీజన్‌లో సాగునీటి కొరతను అధిగమించేందుకు క్రాస్‌ బండ్లు, ఆయిల్‌ ఇంజను సంపులు, వారబందీ విధానం అనుసరించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణకు 3లక్షల 50వేల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని సూచించారు. తుఫాను నేపథ్యంలో రైతులు వర్షాల బారిన పడకుండా పంటలు ఒబ్బిడి చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు లక్షా 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు. ఆక్వా చెరువుల రిజిస్ర్టేషన్‌పై సమీక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా 47380 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు ఉన్నాయని, వీటిలో 10వేల ఎకరాల చెరువులకు రిజిస్ర్టేషన్‌ చేయడం జరిగిందని, 15వేల ఎకరాలు వివిధ కారణాల వల్ల నమోదుకు ఆస్కారం లేదని మత్స్యశాఖ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. జిల్లాలో మరో 19వేల ఎకరాల్లో రిజిస్ర్టేషన్‌కు గ్రామాల వారీగా లక్ష్యాలు నిర్దేశించి 15 రోజుల్లో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, డీఆర్వో కె.మాధవి, ఇరిగేషన్‌ అధికారి గోపీనాథ్‌, వ్యవసాయాధికారి బోసుబాబుతోపాటు ఇతర వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:59 AM