Share News

ఊరికే.. తిరిగేస్తున్నారు!

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:33 AM

ఊరికే వస్తుంటే ఊరుకుంటా రా.. అందుకే మహిళలు ఊరూరా తిరిగేస్తున్నా రు. ప్రస్తుతం ఏ బస్‌ చూసినా మహిళలతో కిటకిటలాడుతోంది.

ఊరికే.. తిరిగేస్తున్నారు!

నెల రోజులు..రూ.14 కోట్లు

గతంలో 71 శాతం ఆక్యుపెన్సీ

84 శాతానికి పెరిగిన వైనం

రద్దీగా పలు రూట్లు

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఊరికే వస్తుంటే ఊరుకుంటా రా.. అందుకే మహిళలు ఊరూరా తిరిగేస్తున్నా రు. ప్రస్తుతం ఏ బస్‌ చూసినా మహిళలతో కిటకిటలాడుతోంది. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం వినియోగించుకోవడం ద్వారా జిల్లా మహిళలు ఒక్కనెలలోనే దాదాపు రూ.14 కోట్లకు పైగా ఆర్థిక లబ్ధి పొందారంటే ఏ స్థాయిలో ప్రయాణిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. గత నెల 15వ తేదీన ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ 32 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు రాకపోకలు సాగించారు. జిల్లా ఆర్టీసీ మొత్తం 96 రూట్లలో బస్సులు తిప్పుతుంటే వీటిలో 72 రూట్లను ప్రత్యేకంగా స్ర్తీ శక్తి పథకానికే కేటాయించారు. ఇది మొత్తం రూట్లలో 75 శాతం. గత నెల 14వ తేదీకి ముందు వరకూ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 71 శాతంగా ఉండేది. ఇప్పుడది 84 శాతానికి పెరిగింది. వీరిలో ప్రత్యేకంగా ఆడవాళ్ల శాతం 68.72 శాతం ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రూట్లలో విపరీతమైన రద్దీ పెరిగింది. రాజమహేంద్రరం - తుని, రాజమహేంద్రవరం-కాకినాడ వయా రాజానగరం, వయా బిక్కవోలు, కొవ్వూరు - ఏలూరు, కొవ్వూరు - జంగారెడ్డిగూడెం రూట్లలో రష్‌ ఎక్కువగా ఉంది.బస్సులకు డిమాండ్‌ పెరిగినా కొత్త రూట్లు ఆపరేట్‌ చేసే పరిస్థితి లేదు. జిల్లావ్యాప్తంగా గతంలో కొన్ని రూట్లలో బస్సు సర్వీసులు క్యాన్సిల్‌ చేశారు. వీటిని పునరుద్ధరించాలని డిమాండ్‌ ప్రధానంగా వస్తున్నా కొత్త సర్వీసులు నడిపేందుకు ప్రస్తుతం అవకాశం లేదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉన్న బస్సులతోటే నడపమనే ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఆర్టీసీ అధికారులు షెడ్యూళ్లు నిర్వహిస్తున్నారు.

ప్రయాణ ఖర్చు రూ.13.82 కోట్లు

ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నెల రోజుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగింది. మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.ఈనెల 12వ తేదీ వరకూ లెక్కలు పరిశీలిస్తే 31.73 లక్షల మంది మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ట్రావెల్‌ చేశారు. రూ.13.82 కోట్లు లబ్ధిపొందారు.

- మూర్తి, జిల్లా ప్రజారవాణా అధికారి

Updated Date - Sep 15 , 2025 | 12:33 AM