మహిళా..ఉచిత బస్.. వచ్చేస్తోంది!
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:59 AM
ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నారు.. మరో హామీ నెరవేర్చనున్నారు.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ అమలుకు సన్నద్ధమవుతున్నారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో ఉచితం?
ఆర్టీసీ డిపోల్లో చురుగ్గా పనులు
‘పల్లె వెలుగు’లకు మెరుగులు
యుద్ధప్రాతిపదికన బస్సులు సిద్ధం
రోజుకు రూ.30 లక్షల భారం
మహిళల ఆనందం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబునాయుడు
ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నారు.. మరో హామీ నెరవేర్చనున్నారు.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ అమలుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని సీఎం వెల్లడించారు. ఆ దిశగా తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో బస్‌లు సిద్ధం చేస్తున్నారు. మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15.. స్వాతంత్య్ర దినోత్సవం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ పథకం ఢిల్లీ, తెలంగాణ, కర్నాటకల్లో అమలవుతోంది. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ ప్రధానమైన వాగ్దానం. పథకం ప్రా రంభించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే అధ్యయనం చేయించి ఒక అంచనాకు వచ్చారు. విధివిధానాలను ఖరారు చేసే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ పథకం అమలు దాదాపు చివరి అంకంలో ఉంది. ఈ మేరకు అవసరమైన బస్సులను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు.
బస్‌లకు మరమ్మతులు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, నిడద వోలు, కొవ్వూరు, కాకినాడ, తుని, ఏలేశ్వరం, అమలాపురం, రాజోలు, రామచంద్రాపురం, రావులపాలెం డిపోల్లోని పల్లె వెలుగు బస్సులను పూర్తిగా పరీక్షించి ఆ మేరకు మరమ్మ తులు చేస్తున్నారు. పథకం ప్రారంభించిన తర్వాత బస్సుల సీటింగ్ కెపాసిటీకి మించి రద్దీగా ప్రయాణికులు ఉండే అవ కాశం ఉంది. ఈమేరకు కొన్ని డిపోలకు కొత్తగా సూపర్ లగ్జరీ బస్సులు ఇచ్చారు. బాగా పాతబడిన వాటి బాడీలను పల్లెవెలుగు బస్సులతో మార్పుచేస్తున్నారు. గణాంకాలు పరి శీలిస్తే మొత్తం ఒక రోజులో ప్రయాణించే వాళ్లలో పల్లె వెలు గు బస్సుల్లో 50 శాతం రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మా ర్పు పనులను ఆయా జిల్లాల జిల్లా ప్రజా రవాణా అధికా రులు (డీపీటీవోలు) ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు. ఈడీ విజయరత్నం ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాకు ఉచితమట!
ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన కల్పిస్తార నే చర్చ నడుస్తోంది. అంటే తూర్పుగోదావరి జిల్లా మహిళ లు కోనసీమ, కాకినాడ జిల్లాల వరకూ ప్రయాణించవచ్చు. వారికి జీరో టికెట్ ఇస్తారు. దీనిలో ఇబ్బందులు తలెత్తే అవ కాశం ఉంది. ఉదాహరణకు కొవ్వూరు ఉమ్మడి పశ్చిమ గోదా వరి పరిధిలోకి వస్తుంది. కానీ కొత్త జిల్లాల విభజనలో తూ ర్పులో కలిసింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాల పరిధి అమలు చేస్తే ఏలూరు నుంచి కొవ్వూరు వరకూ ఉచితంగా వచ్చేసి, అక్కడి నుంచి రాజమండ్రికి టికెట్ కొనుక్కోవాల్సి రావచ్చు. ఇంకో ఐదు కిలోమీటర్లే కదా అని టికెట్ తీసుకోని వారి సం ఖ్యా ఉంటుంది. వీళ్లను గుర్తించడం కష్టంగా మారొచ్చు. ఆ ర్టీసీ ఆవిధంగానూ ఆదాయం కోల్పోయే అవకాశం లేకపో లేదు. ఇక ఉచిత ప్రయాణం మొదలు పెట్టిన తొలి రోజుల్లో తెలంగాణ, కర్నాటక చాలా కష్టాలు ఎదుర్కొన్నాయి. ఆయా ఇబ్బందులను అధిగమించే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీంతో త్వరలోనే ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి రానుంది.
ఉమ్మడి జిల్లాలో 532 బస్సులు
తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 285 బస్సులు ఉండగా 165 పల్లెవెలుగు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 291కి 191, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 300కి 176 పల్లెవెలుగులు ఉన్నాయి. అంటే ఉమ్మడి తూర్పు గోదావరిలో మొత్తం అన్ని రకాల బస్సులు కలిపి 876 ఉండగా, వాటిలో 532 పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు ఉన్నాయి. వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరిలో 89 వేలు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 80 వేల చొప్పున కలుపుకొని రోజుకు సరాసరిన 2.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీలో పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగులో దాదాపు 50 శాతం మంది ప్రయాణిస్తున్నారు. మూడు జిల్లాల్లోని 11 ఆర్టీసీ డిపోల్లో రోజుకు రూ.1.20 కోట్ల ఆదాయం సమకూరుతోంది. వీటిలో పల్లె వెలుగు వాటా దాదాపు రూ.60లక్షల పైనే ఉంటుంది. మొత్తం ప్రయాణికుల్లో 50 శాతం మహిళల లెక్కన చూసినా రోజుకు రూ.30 లక్షల వరకూ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
బస్‌లు మెరుగుపరుస్తున్నాం..
మహిళలు ప్రయాణించే బస్సులు కాబట్టి బయలుదేరిన తర్వాత ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాకుండా మెరుగు పరుస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నారు. వాటికి తగినట్లుగా పనులు చేయిస్తున్నాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు రానీయకుండా బస్సులు తిప్పుతాం.
- సత్యనారాయణ మూర్తి, డీపీటీవో,తూర్పుగోదావరి