తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతు గుండెపోటుతో మృతి
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:41 AM
అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలయ్యాడు. తమ పొలానికి సంబంధించి ఆన్‌లైన్‌లో తప్పు పేరు రావడంతో మార్పుకోసం తిరు గుతూ తహశీల్దార్ కార్యాలయం వద్దే గుండెపోటుకు గురై మరణించాడు.

దేవరపల్లి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలయ్యాడు. తమ పొలానికి సంబంధించి ఆన్‌లైన్‌లో తప్పు పేరు రావడంతో మార్పుకోసం తిరు గుతూ తహశీల్దార్ కార్యాలయం వద్దే గుండెపోటుకు గురై మరణించాడు. కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెం దిన దెయ్యాల వెంకట్రావు (44) తన అత్త పాటెమ్మ వాటా కు రావాల్సిన 60 సెంట్ల భూమిని అత్త మేనల్లుడు అయిన పోలిమాటి రమేష్ పేరుపై ఆన్‌లైన్‌లోకి ఎక్కించడంతో 20 రోజులుగా ఆ పేరు మార్పు కోసం గ్రామ సర్వేయర్ దుర్గారావు చుట్టూ తిరుగుతున్నారు. బుధవారం సాయంత్రం సర్వేయర్ దుర్గారావు మృతుడు వెంకట్రావుకు తహశీల్దార్ కార్యాలయానికి రావాలని తెలియజేయడంతో వెంకట్రావు తన భార్య రత్నకుమారిని తీసుకుని తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తన అత్త పాటెమ్మ పేరుమీద ఉన్న 60 సెంట్లు భూమిని తన అత్త పేరు మీద ఆన్‌లైన్ చేయాలని అధికారులను కోరాడు. ఈ క్రమంలో గ్రామ సర్వేయర్ దుర్గారావు, మండల సర్వేయర్ డిల్లేశ్వరరావులకు రైతుకి మధ్య వాగ్వాదం జరిగింది. వెంకట్రావు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆటోలో మృతదేహాన్ని తహశీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి మృతుని బంధువులు ఆం దోళన చేపట్టారు. మృతుని భార్య రత్నకుమారి విలపిస్తూ తన భర్త మృతికి కారణం రెవెన్యూ అధికారులేనని ఆరోపించారు. మృతుని భార్య ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ వి.సుబ్రహ్మ ణ్యం అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.