అదిగో పులి!
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:59 AM
వాటిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. రాత్రి వేళలో కనిపిస్తే గుండే జల్లుమంటుంది.. చిరుత పులిలా ఒంటి నిండా చారలు.. కోర మీసాలు.. పులి తరహాలో కళ్లు..అమ్మో మీదకు వచ్చేస్తుందే మోనని భయపెడుతుంది..కానీ అది పులికాదు.. అచ్చం పులినే తలపించే ఆ తరహా జాతికి చెం దినదే..
కోరంగి అభయారణ్యం ఆవాసం
సరికొత్తగా ఫిషింగ్ క్యాట్‌ల లెక్క
మత్స్యసంపద వృద్ధిలో కీలకం
వైల్డ్‌లైఫ్ ఇన్సిస్టిట్యూట్ ప్రాజెక్టు
వీటి మెడకు రేడియో కాలర్ రింగ్
దేశంలోనే తొలిసారిగా కౌంటింగ్
అంతరించే జాతిలో ఈ క్యాట్‌లు
జియోట్యాగింగ్‌తో పరిశీలన
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
వాటిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. రాత్రి వేళలో కనిపిస్తే గుండే జల్లుమంటుంది.. చిరుత పులిలా ఒంటి నిండా చారలు.. కోర మీసాలు.. పులి తరహాలో కళ్లు..అమ్మో మీదకు వచ్చేస్తుందే మోనని భయపెడుతుంది..కానీ అది పులికాదు.. అచ్చం పులినే తలపించే ఆ తరహా జాతికి చెం దినదే.. ఎత్తు తక్కువే కాని పులినే పోలి ఉంటుంది.. నోరు తెరిస్తే భయంకరమైన పళ్లు... పొడవాటి నాలుక.. నిజంగా పులే అని భయపడేలా చేస్తుంది.. ఇంతకీ దీని పేరేమిటో తెలుసా.. ఫిషింగ్ క్యాట్..నిజమైన పులి జంతువులను వేటాడడంలో ఎంత నేర్పరో..ఈ ఫిషింగ్ క్యాట్ (బావురుపిల్లి, నీటి పిల్లి) నీటిలో చేపలను వేటాడి తినడంలో ఎంతో నేర్పరి.. ఇది తినే చేపలతో సముద్రంలో మత్స్య సంపద పెరగడానికి దోహదపడుతుంది.. ఇదేంటి చేపలను తినే పిల్లి వల్ల చేప సంపద ఎలా పెరుగుతుంది అంటారా.. నిజమే.. చేపలు పెట్టే గుడ్లను తినే చేప జాతులు ఎన్నో మడ అ డవుల్లో ఉన్నాయి..అలా గుడ్లను తింటూ మత్స్య సంపద పెరగకుండా చేసే చేపలనే ఈ ఫిషింగ్ క్యాట్‌లు తింటాయి..ఈ ఫిషింగ్ క్యాట్‌లు ఐ యూసీఎన్ జాబితాలో అంతరించిపోయే ప్రమా దం ఉన్న జాతిగా గుర్తించారు.ఈ ఫిషింగ్ క్యాట్ లకు కోరంగి అభయారణ్యం పెట్టింది పేరు.
నిరంతర పర్యవేక్షణ..
దేశంలోనే కోరంగి అభయారణ్యంలో వీటిని లెక్కించడానికి వైల్డ్ లైఫ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఆసక్తి కనబర్చింది. వాస్తవా నికి కోల్‌కతాలోని సుందర్‌బన్ అడవుల్లో వీటి జాడ ఎక్కువ.ఈ ఫిషింగ్ క్యాట్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధికారిక జంతువు కూడా. అయితే కోరం గిలోనే వీటి లెక్కింపునకు అనువైన వాతావర ణం ఉండడంతో దేశంలో తొలిసారి ఇక్కడే ఇటీ వల ప్రారంభించారు.ఈ ప్రాజెక్టును డెహ్రా డూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్సిస్టి ట్యూట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బిలాల్ హబీబ్ పర్యవేక్షిస్తుండగా కోరంగికి సైంటిస్ట్ షాహిర్‌ఖాన్, వెటర్నరీ ఆఫీ సర్ సనంత్ వచ్చారు. వీరిలో సనంత్ దేశంలో ఇప్పటి వరకు 100కుపైగా పులులకు నెక్ రేడి యోకాలరింగ్ అమర్చడంలో పేరు పొందారు. ఈ రేడియో కాల ర్ రింగ్‌కు జియో ట్యాగింగ్ చేసి నిత్యం వీటి కదలికలను పరిశీలిస్తున్నారు. అలాగే 90చోట్ల చెట్లకు ట్రాప్ కెమెరాలు అమర్చారు. త ద్వారా కోరం గిలో వీటి సంఖ్యను నిర్దారించనున్నారు.
ఈదేస్తాయి..వేటాడేస్తాయి..
అచ్చం పులిని తలపించే ఈ ఫిషింగ్ క్యాట్ లకు ఎంతో ప్రత్యేకత ఉంది. అసలు పులులు జంతువులను వేటాడడంలో ఎంత నేర్పరో ఇవి కూడా నీటి అడుగున ఉండే చేపలను తిన డంలో నేర్పరులు. వాస్తవానికి సముద్రం, గోదా వరి నీరు సంగమించే ప్రాంతంలో ఉప్పు, చప్ప టి నీరు ఉంటుంది. ఇది చేప సంతతి వృద్ధికి అనుకూలం.అందుకే ఎన్నో రకాల మత్స్య జా తులు మడఅడవుల్లోకి వచ్చి గుడ్లు పొదుగు తా యి.ఇవి పిల్లలుగా మారడానికి మడ అడవు ల్లోని చిత్తడి నేలలు అత్యంత అనుకూలం. ఈ గుడ్లను కొన్ని రకాల చేపలు తినేస్తాయి. తద్వా రా మత్స్య సంపద వృద్ధికి ఇవి హాని చేస్తాయి. ఇలా గుడ్లు తినేసే కొన్ని రకాల జాతి చేపలను ఈ ఫిషింగ్ క్యాట్‌లు తింటాయి. తద్వారా సముద్రంలో మత్స్య సంపద పెరగడానికి దోహ దపడతాయి. పులి తరహాలో కొంత దూకుడు స్వభావం ఉంటుంది. మనుషులకు హాని చేయ వు.ఇప్పుడు వీటి సంఖ్య లెక్కిస్తున్నామని కోరంగి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, డీఎఫ్‌వో రవీంద్ర నాథ్‌రెడ్డి వివరించారు.
కేరాఫ్ కోరంగి..
చూడ్డానికి అందంగా, గుబురుగా.. దట్టంగా కనిపించే మడ అడవులు దేశంలో కాకినాడకే ప్రత్యేకం. రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో 331.5 చదరపు కిలోమీటర్లలో ఇవి విస్తరించగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో 250 చదరపు కిలోమీటర్లు ఉన్నా యి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తాళ్లరేవు మండలం కోరంగి నుంచి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో 58 వేల ఎకరాల్లో ఉన్నాయి. మడ అడవుల్లో 80 రకాల వృక్షజాతులున్నాయి. ఏటా ఎనిమిది దేశాల నుంచి 120 జాతుల వలస పక్షులు వస్తాయి. వందల రకాల చేప జాతులు ఇక్కడకు వచ్చి గుడ్లు పొదుగుతాయి. ఎన్నో రకాల పక్షి, జంతుజాతులు ఉండగా వాటిలో ప్రత్యేకత సంతరించుకున్నవే ఫిషింగ్ క్యాట్‌లు. ప్రపంచంలో ఇవి పది వేల వరకు ఉండగా దేశంలో రెండు వేలలోపే ఉన్నాయి. ఇందులో 155 కోరంగిలోనే ఉన్నాయి. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత వీటి సంఖ్య లెక్కించడానికి అటవీ శాఖ రంగంలోకి దిగింది. దేశంలోనే తొలిసారిగా వీటి సంఖ్యను లెక్కించడానికి రేడియో కాలర్ రింగ్ విధా నం అమలు చేస్తున్నారు. ఈ ఫిషింగ్ క్యాట్‌ల మెడకు వీటిని బిగించి కొన్ని రోజుల పాటు అధ్యయనం చేయడానికి డెహ్రాడూన్ నుంచి నిపుణులు వచ్చి కోరంగిలో మకాం వేశారు. మూడింటికి వీటిని బిగించారు. త్వరలో మరో ఏడింటికి బిగించబోతున్నారు.