మత్స్యకార భరోసా.. రూ.22.24 కోట్లు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:18 AM
ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులు వేట విరామ సమయంలో ఇచ్చే పరిహారాన్ని రెట్టింపు చేసి ఒక్కో కుటుంబానికి రూ.20వేల వంతున అందిస్తున్న చంద్రబాబు కృషి అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
మత్స్యకార భరోసా.. రూ.22.24 కోట్లు
అమలాపురం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులు వేట విరామ సమయంలో ఇచ్చే పరిహారాన్ని రెట్టింపు చేసి ఒక్కో కుటుంబానికి రూ.20వేల వంతున అందిస్తున్న చంద్రబాబు కృషి అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో శనివారం 11,123 మంది మత్స్యకారులకు రూ. 22 కోట్ల 24 లక్షల 60 వేల పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమలాపురంలోని గోదావరి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు సహా పలువురు మత్స్యకార నేతలు మత్స్యకార భరోసా పంపిణీలో పాల్గొన్నారు. గతంలో ఉన్న రూ.10 వేల సాయాన్ని ఎన్నికల హామీ మేరకు రూ.20 వేలకు పెంచి మత్స్యకార భరోసాను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. కొన్ని సాంకేతికపరమైన సమస్యల వల్ల అనర్హులుగా గుర్తించబడిన వారికి కూడా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు కోరారు. లబ్ధిదారుల ఎంపికలో ఎదురైన సమస్యలు పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 344 మందిని అనర్హులుగా గుర్తించారని, డేటా ఎంట్రీలో సాంకేతికలోపం వల్ల ఏర్పడ్డ ఈ పరిస్థితిని పరిష్కరించాలని బుచ్చిబాబు కోరారు. కాట్రేనికోన మండలంలో 5583 మంది, మామిడికుదురులో 2070, ఐ.పోలవరం 1393, సఖినేటిపల్లిలో 1356, అల్లవరం 704, ఉప్పలగుప్తం మండలం 17 మంది వెరసి 11,123 మందికి రూ.22.24 కోట్ల చెక్కులను అందించారు. ఏటా మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇచ్చే పరిహారాన్ని రెట్టింపుచేసి ఇవ్వడం మత్స్యకారులకు ఎంతో మేలు చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లకు మత్స్యకార నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను కొందరు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో జేసీ టి.నిషాంతి, ఆర్డీవో కె.మాధవి, మత్స్యశాఖ జేడీ పీవీ శ్రీనివాసరావు, మత్స్యకార నాయకుడు నాగిడి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అశోక్, ఎఫ్‌ఈవో గోపాలకృష్ణ పాల్గొన్నారు.