మహా విషాదం
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:32 AM
కళ్లెదుట ఎగసిపడుతున్న మంటలు.. ఎటు చూసినా కాలిపోయి నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలు.. మరోవైపు సగం కాలిన క్షతగాత్రుల ఆర్తనాదాలు.. ఇంకోవైపు బాధిత కుటుంబీకుల ఏడుపులు.. చెల్లాచెదురుగా కాలి బూడిదైన బాణసంచా.. ఎటు చూసినా భీతావహ దృశ్యాలు... ఇదీ రాయవరం మండలం కొమరిపాలెంలో బుధవారం జరిగిన మహా విషాదం.. బాణసంచా తయారీకేంద్రంలో మంటలు ఎగసిపడి ఏడుగురు మృత్యువాతపడ్డారు..
తయారీకేంద్రంలో అగ్నికీలలు
ఉలిక్కిపడ్డ రాయవరం
భోజన సమయంలో ప్రమాదం
పేదల బతుకులపై ఫైర్
అక్కడికక్కడే ఆరుగురి మృతి
చెల్లాచెదురుగా మృతదేహాలు
ఆసుపత్రిలో మరొకరు
హృదయ విదారకంగా కేంద్రం
హోం మంత్రి అనిత పరామర్శ
కళ్లెదుట ఎగసిపడుతున్న మంటలు.. ఎటు చూసినా కాలిపోయి నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలు.. మరోవైపు సగం కాలిన క్షతగాత్రుల ఆర్తనాదాలు.. ఇంకోవైపు బాధిత కుటుంబీకుల ఏడుపులు.. చెల్లాచెదురుగా కాలి బూడిదైన బాణసంచా.. ఎటు చూసినా భీతావహ దృశ్యాలు... ఇదీ రాయవరం మండలం కొమరిపాలెంలో బుధవారం జరిగిన మహా విషాదం.. బాణసంచా తయారీకేంద్రంలో మంటలు ఎగసిపడి ఏడుగురు మృత్యువాతపడ్డారు.. మరో ముగ్గురు ఒళ్లంతా కాలిన గాయాలతో క్షతగాత్రులుగా మారిపోయారు. ఉదయం వెళ్లొస్తాం అంటూ ఇంటి నుంచి పనికి వెళ్లినవాళ్లు అటు నుంచే తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు.. చివరి చూపు కూడా దక్కనంతగా మృతదేహాలు కాలిపోయాయి.. అవి చూసిన కుటుంబీకుల కన్నీళ్లు మిన్నంటాయి.. వెళ్లొస్తాం అన్నారు.. ఇలా చేశారేంటి.. ఇక మాకు దిక్కెవరంటూ మృతదేహాలను చూస్తూ బోరున విలపిస్తున్నారు.. క్షతగాత్రుల బంధువుల మా వాళ్లను కాపాడండంటూ వైద్యులను వేడుకుంటున్నారు.
అమలాపురం/మండపేట/రాయవరం,అనపర్తి/బిక్కవోలు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వెలుగులు విరజిమ్మాల్సిన బాణసంచా.. కొందరి కుటుంబాల్లో చీకటిని నింపింది. బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన ఘోర విస్ఫోటనంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. వారిలో నలుగురు మహిళలు, బాణసంచా కర్మాగారానికి చెందిన యజమాని ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం-కొమరపాలెం ప్రధాన రహదారిని ఆనుకుని రాయవరం శివారు ప్రాంతంలో ఉన్న శ్రీలక్ష్మీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ ఈ విస్ఫోటనం సంభవించినట్టు సమాచారం. ఈ విస్ఫోటనం సమీప ప్రాంతాల్లోని ఇళ్లల్లో సైతం ప్రకంపనలు సృష్టించింది. బాణసంచా కర్మాగారం నుంచి భారీగా శబ్దాలతో పాటు దట్టమైన పొగలు ఆకాశాన్నంటాయి. దాంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు.
అంతటా ఆర్తనాదాలే...
శ్రీలక్ష్మీ గణపతి బాణసంచా గ్రాండ్ ఫైర్‌వర్క్స్ లో రోజుకు 40 మంది వరకు పనిచేస్తారు. ఈ సంస్థ 93 ఏళ్ల నుంచి బాణసంచా తయారీలో పేరొందింది. ప్రతి ఏడాది దీపావళికి పెద్ద ఎత్తున బాణసంచా తయారుచేస్తారు. ఈ ఏడాది అదే విధంగా భారీఎత్తున బాణసంచా తయారీ చేస్తుండగా బుధవారం భారీ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. భోజన సమయంలో పది మంది బయటకువెళ్లగా, మరో 10 మంది తయా రీ కేంద్రంలో యజమానితో సహా ఉన్నారు. భారీ పేలుడు, మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో మందుగుండు తయారీ చేసే కేంద్రం పైకప్పుకూలిపోయింది. ఈ పేలుడు ధాటికి మందుగుండు సామగ్రి స్టాక్ పాయింట్ కూడా నేలకూలింది. కూలీలను రక్షించే ప్రయత్నంలో యజమాని వెలుగబంట్ల సత్యనారాయణ మూర్తి అలియాస్ సత్తిబాబు మంటల్లో చిక్కుకుని కూలీలతో సహా సజీవదహనం అయ్యాడని చెబుతున్నారు. మృతుడు చేతికి ఉన్న ఉంగరాన్ని బట్టి మృతదేహాన్ని సత్తిబాబుగా గుర్తించారు. సంఘటనా స్థలంలో నేల కూలిన షెడ్డు, చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. సంఘటనా జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయ త్నం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. సంస్థ యజమాని సత్తిబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నిబంధనలు పాటించే సత్తిబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల బాణసంచా తయారీ కేంద్రాల గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు.ఇదే వృత్తిలో కొనసాగుతూ మం దుగుండుకు బలికావడంతో సత్తిబాబు కుటుం బీకులు స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మృతులు వీరే...
ప్రమాదంలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు మరణించారు.బిక్కవోలు మండలం కొమరిపాలెంనకు చెందిన ఫైర్స్ వర్క్స్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (68) అలియాస్ సత్తిబాబు ఉన్నారు. కార్మికులు పాకా అరుణ (33)(సోమేశ్వరం), అనపర్తి సావరానికి చెందిన చిట్టూరి శ్యామల (38), కుడుపూడి జ్యోతి (38), పెంకే శేషారత్నం(35), ఒడిశాకు చెందిన కె.సదానందం (50) ఘటనా స్థలంలోనే గుర్తు పట్టలేని రీతిలో సజీవదహన మయ్యారు. బిక్కవోలు మండలం కొమరపాలేనికి చెందిన పట్నూరి వెంకటరమణ (50) కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విస్ఫోటనం జరిగిన ప్రదేశంలో 12 మంది ఉండగా, 10 మంది మంటల్లో చిక్కుకుపోగా ఇద్దరు మాత్రం పక్కనే ఉన్న పంట పొలంలోకి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మూడు పశువులు గాయపడగా స్థానిక పశువుల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చంద్రబాబు, పవన, లోకేశ దిగ్ర్భాంతి
బాణసంచా విస్ఫోటన ఘటన తెలిసిన వెం టనే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇక్కడకు చేరుకున్నారు. ఏడుగురి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
అటెనషన ప్లీజ్..2వది!
అమలాపురం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది రోజుల్లో రెండో ప్రమాదమిది. గత నెల 30వ తేదీ మంగళవారం రాత్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలసలో బాణసంచా పేలుడు జరిగింది. కిరాణా వ్యాపారం నిర్వహించే ఇక ఇంటి వద్ద నిల్వ ఉన్న బాణసంచాను అటకపై నుంచి దించుతుండగా ప్రమాదశాత్తూ పేలి దంపతులు కంచర్ల శ్రీనివాస్ (50), భార్య సీతామహలక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందారు. భవనమంతా ఛిద్రమై నేలమట్టమైంది. ఇప్పుడిది.
10 మందిని కాపాడిన ఫంక్షన
అనపర్తి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): బిక్కవోలు మండలం రాయవరం- కొమరిపాలెం శివారులో ఉన్న ఈ బాణసంచా కర్మాగారంలో పనిచేసేందుకు గత మూడు నెలలుగా 16 మంది మహిళలు అనపర్తి, అనపర్తి సావరం నుంచి రోజువారీ వెళుతున్నారు. బుధవారం కూడా 16 మంది పనికి వెళ్లాల్సి ఉండగా, వీరిలో పదిమంది సావరంలో శుభకార్యంలో పాల్గొనాల్సి రావడంతో ఆరుగురు మాత్రమే పనికి వెళ్లారు. దాంతో మిగిలిన వారంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నటైంది. మూడు నెలలుగా ఒకేచోట పనిచేస్తూ కలిసి వెళ్లి వచ్చే వారిలో ముగ్గురు లేరన్న వార్తతో విషాదంలో మునిగిపోయారు.
వందేళ్ల నుంచి తయారీ
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మం డలం కొమరిపాలెం, బిక్కవోలు సామ ర్లకోట మండలం జి.మేడపాడు పరిసర ప్రాంతాల్లో బాణసంచా తయారీ శతాబ్ది కాలంగా కొన్ని కుటుంబాలకు ఆనవాయితీగా వస్తోంది. కొమరిపాలెం గ్రామానికి చెందిన వెలుగుబంట్ల కుటుంబానికి బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి నుంచి బాణసంచా ఉమ్మడి తెలుగు రాషా్ట్రల్లోని ప్రధాన నగరాలకే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాషా్ట్రలకు ఇక్కడి నుంచే ఎగుమతి జరిగేవి. రాజకీయ పార్టీల విజయోత్సవాలకు, టీడీపీ మహానాడుకూ ఇక్కడ నుంచే మందుగుండు సామగ్రిని తరలించేవారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు వీరికి అనేక పర్యాయాలు సత్కారం చేశారు.
ఎమ్మెల్యే తనయుడి వాహనంలో తరలించినా..
ప్రమాద సమాచారం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్న కొమరిపాలెం గ్రామానికి చెందిన పొట్నూరి వెంకటరమణను మనోజ్‌రెడ్డి వాహనంలో అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంకట రమణ అనపర్తిలో ఒక ఫైనాన్స వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తాడు. ఖాళీ సమయాల్లో కేంద్రానికి వస్తుంటాడు.. బుధవారం కూడా అలాగే వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. కాకినాడలో చికిత్స పొందుతూ మరణించాడు. ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రమాద స్థలం నుంచే సీఎం చంద్రబాబుకు ఇక్కడి పరిస్థితిని ఫోన్ ద్వారా వివరించారు.
చిచ్చుబుడ్లలో మందు ఫిల్లింగ్ చేస్తుండగా ఘటన : ఐజీ
చిచ్చుబుడ్లలో మందు ఫిల్లింగ్ చేస్తుండగా ఫ్రెజర్ పెరిగి నిప్పు రవ్వలు ఎగసిపడడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా భావిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. రాయవరం శ్రీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌కు 2026 మార్చి వరకు బాణసంచా తయారీ అనుమతి ఉందన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
భయపడి పరుగు తీశాం..
బాణసంచా తయా రు చేసే కేంద్రంలో తరచూ తయారీ దారులు మందుగుండు కాల్చడం ట్రైల్ రన్ వేస్తుం టారు. అలాంటిదే బుధవారం రాయవరంలో జరిగి ఉండొచ్చు. భోజన సమయంలో చూస్తుండగానే భారీ శబ్దాలతో కూడిన మంటలు వ్యాపించాయి. మా ఇంటి వద్ద భోజనం చేసే సమయంలో ఈ సంఘటన జరగడంతో కుటుంబమంతా పరుగులు తీశాం.
- గులిపే కృష్ణవేణి, ప్రత్యక్ష సాక్షి