ఆసుపత్రులక్యూ!
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:33 AM
సీజన్ మారింది. చలిగాలుల తాకిడి అధికమైంది. తుఫాన్ ప్రభావంతో ఒక వైపు వానలు కురుస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు అధికంగా జ్వరాల బారిన పడుతున్నారు.
ఆసుపత్రులకు క్యూకడుతున్న బాధితులు
వైరల్, డెంగీ జ్వరాలతో ఇక్కట్లు
కాకినాడలో స్క్రబ్ టైఫస్ కేసులు
తూర్పు, కోనసీమల్లో డెంగీ
కాకినాడ/ అమలాపురం/రాజమహేంద్రవరం అర్బన్(ఆంధ్రజ్యోతి)
సీజన్ మారింది. చలిగాలుల తాకిడి అధికమైంది. తుఫాన్ ప్రభావంతో ఒక వైపు వానలు కురుస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు అధికంగా జ్వరాల బారిన పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో వైరస్ కారణంగా చికెన్ ఫాక్స్, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పు లు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో క్యూ కడుతున్నారు. కొన్ని నెలలుగా డెంగీ, మలేరియా కేసులు నమోదవుతుండగా స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఫీవర్స్.. వైరల్!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జ్వర పీడితులు పెరుగుతున్నారు. చిన్న,పెద్ద, తేడా లేకుండా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సాధారణంగా కాకినాడ జీజీహెచ్‌కు ప్రతిరోజూ 2 వేలకు పైగా ఓపీ ఉంటుంది.వీరిలో జ్వర పీడితులే అధికంగా ఉంటున్నారు. రాజ మహేంద్రవరం జీజీహెచ్‌లో ప్రతిరోజూ సుమారు వెయ్యి నుంచి 1200ల వరకూ ఓపీ ఉంటే వీరిలో ఎక్కువ మంది సీజనల్ వ్యాఽఽధులతోనే ఆసుపత్రికి వస్తున్నట్టు జనరల్ మెడిసిన్ వైద్యులు చెబుతున్నారు. కోనసీమలోనూ ఇదే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు విషజ్వరాల బారిన పడుతున్నారు. ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో నీరసించి పోతున్నా రు.జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు మాత్రం తగ్గడం లేదని మళ్లీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.అసలే జ్వరంతో రోగులు బాధపడుతుంటే రకరకాల టెస్టులతో ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు మరింత నీరసించేలా చేస్తున్నారు.రక్త, బీపీ, షుగర్ టెస్టులతో పిండేస్తు న్నారు. పలువురు ఆసుపత్రులకు వెళ్లేం దుకే భయపడుతున్నారు.
కాకినాడలో స్క్రబ్ టైఫస్..
ఈ ఏడాది జనవరి నుంచి పరిశీలిస్తే కాకినాడలో ఐదు వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 200కిపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలలుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు కలవరపెడుతున్నాయి. నల్లి లాంటి ఓ కీటకం కుట్టడం ద్వారా కుట్టినచోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడడం, జ్వరం, వాంతులు, తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు లక్షణాలతో ఆస్పత్రికి వచ్చేవారు అధికమయ్యారు. లాలాజలంతో ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్టు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. కాకినాడ జిల్లాలోనే అత్యధికంగా 1452 మందికి పరీక్షలు చేయగా 148 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం తుని, ప్రత్తిపాడు ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు వచ్చాయి. మిగతా మండలాల్లోను ఈ వ్యాధి బాధితులు ఉన్నారు. గత నెల నవంబర్‌లో 251 మందిని పరీక్షించగా 47మంది ఈ వ్యాధికి గురయ్యారు.
కోనసీమలో డెంగీ
కోనసీమ జిల్లాలోనూ జ్వరపీడితులు ఉన్నా రు. గతేడాది జిల్లాలో 292 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 34 కేసులు నమోదయ్యాయి. వైరల్ జ్వరాల బారిన పడినవారు గతంలో రోజువారీ నివేదికల్లో 250 మంది ఉండేవారు. ప్రస్తుతం రోజుకు 170 నుంచి 180 మంది ఉంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు మలేరియా కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు వెల్లడించారు. నవంబరులో అమలాపురం ఏరియా ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో 61మందిని జ్వర పీడితులుగా గుర్తించారు. మరో 15 మంది ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకున్నారు. ప్రస్తుతం రోజుకు ఇద్దరు, ముగ్గురు మాత్రమే వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. ఒక డెంగీ కేసుకు ఆస్పత్రిలో వైద్యం చేయగా ఇద్దరు ఓపీ విభాగంలో డెంగీ పాజిటివ్‌గా గుర్తించామని అమలాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు వెల్లడించారు. జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులేమీ నమోదుకాలేదని డీఎంహెచ్‌వో దుర్గారావురావు వెల్లడించారు.
‘తూర్పు’న ఇలా..
తూర్పుగోదావరి జిల్లాలో మలేరియా, న్యుమోనియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఇన్‌పేషెంట్ కేసులు తక్కువగానే ఉన్నా అవుట్‌పేషెంట్లు ఎక్కువ మంది ఉంటున్నారు. పిడియాట్రిక్ విభాగంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చిన్నారులు వైద్యానికి వస్తున్నారు. జ్వరకేసులు నమోదవుతున్నాయి. పక్కనున్న ఏఎస్‌ఆర్ జిల్లా నుంచి మలేరియా కేసులు వస్తున్నాయని.. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం జీరో అని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో గోకవరం, నామవరం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జ్వరపీడితుల్లో కొందరికి ఇక్కడి వైద్యులు ప్రాథమికంగా మలేరియాగా నిర్ధారించినట్టు తెలిసింది. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లలో డెంగీ కేసులు మాత్రం 32 నమోదైనట్టు లెక్కలు చెబుతున్నారు.
స్క్రబ్ టైఫస్ సోకితే ఐదు రోజులు వైద్యం
స్క్రబ్ టైఫస్ సోకడానికి పరిసరాల అపరిశుభ్రతే కారణం. ఇంటి పరిసరాలు, పనిచేసే ప్రాంతాలు శుభ్రంగా ఉంచు కోవాలి. తుప్పల వద్ద జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి సోకితే నివారణకు ఐదు రోజుల పాటు వైద్యం తీసుకోవాలి.
- డాక్టర్ ప్రభాకర్, కాకినాడ మలేరియా అధికారి
ప్రత్యేక వైద్యం అందిస్తున్నాం
స్క్రబ్ టైఫస్‌పై ప్రత్యేక దృష్టిసారించాం. గ్రామాల్లో అవగాహన కల్పి స్తున్నాం. జిల్లాలో జ్వర బాధితులకు ప్రత్యేక వైద్యం అందిస్తు న్నాం. సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో నిత్యం వైద్యపరీక్షలు జరుగుతున్నాయి. అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ మందులను అందుబాటులో ఉంచాం. ఎక్కడైనా జ్వరపీడితులు పెరిగితే సమాచారం ఇవ్వాలి. - నరసింహనాయక్,
డీఎంహెచ్‌వో, కాకినాడ జిల్లా