Share News

పండుగ దోపిడీ!

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:01 AM

పండుగ వస్తే చాలు ట్రావెల్స్‌ రేట్లు రికార్డులు బద్దలు కొడతాయి. జిల్లాకు చెందిన ప్రజలు అత్యధికంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో నివాసం ఉండడంతోపాటు సాఫ్ట్‌వేర్‌ రంగంలో యువత ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. పండుగ వస్తే ఇంటికి వెళ్లాలనే వారి ఆశలను ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు అడియాశలు చేస్తున్నాయి. రేట్లు ఇష్టానుసారంగా పెంచేసి నిలువు దోపిడీ చేస్తున్నాయి.

పండుగ దోపిడీ!

  • దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ స్పెషల్స్‌ నిల్‌

  • ప్రైవేటు ట్రావెల్స్‌ ఫుల్‌.. టిక్కెట్‌ ధరల దోపిడీ

  • అధిక చార్జీల వసూళ్లతో ప్రయాణాలంటేనే జనం బెంబేలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

దసరా వచ్చిందయ్య.. సరదా తెచ్చిందయ్య.. దశమి వచ్చిందయ్యా..’ దశనే మార్చిందయ్య.. అన్నట్టు ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు రేట్లు దారుణంగా పెంచేసి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. పండుగ వస్తే చాలు ట్రావెల్స్‌ రేట్లు రికార్డులు బద్దలు కొడతాయి. జిల్లాకు చెందిన ప్రజలు అత్యధికంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో నివాసం ఉండడంతోపాటు సాఫ్ట్‌వేర్‌ రంగంలో యువత ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. పండుగ వస్తే ఇంటికి వెళ్లాలనే వారి ఆశలను ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు అడియాశలు చేస్తున్నాయి. రేట్లు ఇష్టానుసారంగా పెంచేసి నిలువు దోపిడీ చేస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్ర్తీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులన్నీ వారికే కేటాయించడం వల్ల ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి బస్సుల కొరత ఉంది. దాంతో దసరా పండుగకు ఎప్పుడూ ఆర్టీసీ సంస్థ హైదరాబాద్‌, విజయవాడ వంటి ప్రాంతాలకు ప్రత్యేక స్పెషల్‌ సర్వీసులు గతంలో నడిపేవారు. దీనికి రేట్లు కూడా ప్రత్యేకంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో బస్సుల కొరత నేపథ్యంలో షెడ్యూల్డు సర్వీసులు మాత్రమే నడుపుతున్నారు. అయితే దసరాకు ఆర్టీసీ సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు టిక్కెట్‌ ధరలను అనూహ్యంగా పెంచేశాయి. నిత్యం 60కు పైనే సర్వీసులు యానాం నుంచి వయా అమలాపురం రావులపాలెం మీదుగా వివిధ సంస్థలకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు నడుపుతున్నారు. దసరా కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇతర రా ష్ట్రాల నుంచి వస్తున్నా, ఇక్కడి వారు అక్కడికి వెళుతున్నా ప్రస్తుతం ఏసీ కోచ్‌ల్లో స్లీపర్‌ బెర్తులైతే రూ.2 వేల నుంచి రూ.3వేలు దాటి ధర పలుకుతోంది. ఆర్టీసీ సర్వీసులు లేకపోవడంతో పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికులంతా ట్రావెల్స్‌ను ఆశ్రయించడం వల్ల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. డిమాండ్‌ను బట్టి రూ.3వేలు దాటిపైనే టిక్కెట్‌ ధరలు వసూ లు చేస్తున్నారు. సీట్లకైతే బస్సును బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఆన్‌లైన్‌లో ధర పలుకుతోంది. దసరాకు సెలవులు కావడంతో పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికులు అధికంగా ఉండడం, దీనికి తగ్గట్టు ఆర్టీసీ స్పెషల్స్‌ లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థల యాజమాన్యాలు పెట్టిందే రేటుగా ప్రయాణికుల నుంచి నిలువుదోపిడీ చేస్తున్నారు. పండుగలకు పెరుగుతున్న ట్రావెల్‌ రేట్లు చూసి టూరు వెళ్లాలనే ఆలోచనే మానుకుంటున్నారు. కొందరు ఎక్కువమంది ఉంటే కార్లు మాట్లాడుకుని వస్తుండగా, బైకుల మీద కూడా కొందరు తరలివస్తున్నారు. మొత్తానికి ప్రయాణికుల దసరా సరదా ఆశలపై నీళ్లు చల్లేలా ట్రావెలింగ్‌ రేట్లు పెరిగిపోయాయి.

  • అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: ఆర్టీవో

దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో అధిక చార్జీలు వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ సమయంలో బస్‌ డ్రైవర్లు మితిమీరిన వేగంతో బస్సులు నడపవద్దు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయవద్దు. అలసగా ఉంటే పార్కింగ్‌ ప్రదేశంలో బస్సులు నిలిపి చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. జిల్లాలో ఇప్పటివరకు 388 ప్రైవేటు బస్సులు తనిఖీచేసి రూ.33 లక్షలు అపరాధ రుసుముగా వసూలుచేశాం. నిరంతరం ఈ తనిఖీలు కొనసాగుతాయి. రహదారి భద్రత ఉల్లంఘనలు ఏవిధంగానూ ఉపేక్షించం.

Updated Date - Sep 24 , 2025 | 01:01 AM