Share News

కొడుకులను కడతేర్చి.. తాను అంతమై..

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:27 AM

డాక్ట ర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున ఓ తండ్రి తన కుమారులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

కొడుకులను కడతేర్చి.. తాను అంతమై..
అభిరామ్‌, గౌతమ్‌ మృతదేహాలు

ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో కలకలం రేపిన సంఘటన

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

బంధువుల వేధింపులే కారణమని ప్రస్తావన

ఆలమూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): డాక్ట ర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున ఓ తండ్రి తన కుమారులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

అసలేం జరిగిందంటే...

చిలకలపాడుకు చెందిన పావులూరి కామరాజు అలియాస్‌ చంటి (36) సెలూన్‌ షాపు నిర్వహిస్తూ తన కుమారులు అభిరామ్‌(11), గౌతమ్‌ (8)తో కలసి జీవిస్తున్నాడు. అభిరామ్‌ ఐదో తరగతి, గౌతమ్‌ ఒకటో తరగతి మడికిలోని ఒక ప్రై వేట్‌ స్కూల్‌లో చదువుతున్నారు. అయితే నాలుగేళ్ల క్రితం కామరాజు భార్య పావులూరి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. బుధవారం తెల్లవారుజామున తన కుమారులు ఇద్దరికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చిన తదుపరి కామరాజు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని బంధువులు గుర్తించి ఆలమూరు పోలీసులకు సమాచా రం అందించారు. సంఘటనా స్థలానికి కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌.విద్యాసాగర్‌, ఆలమూరు ఎస్‌ఐ జి.నరేష్‌, సిబ్బంది చేరుకుని వివరాలు సేకరించారు. అయితే చిన్నారులు అభిరామ్‌, గౌతమ్‌ మృతిచెందిన విధానంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి నోటి నుంచి ఎటువంటి నురగలు రాకపోవడంతోపాటు ఎక్కడ పడుకున్నవారు అక్కడ ఉన్నా రు.. విషం తాగిస్తే అలా పడుకుని ఉండలేరని వాదన ఉండడంతో పూర్తిస్థాయి విచారణ చేయాలని క్లూస్‌ టీమ్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ టీమ్‌లను రప్పించి వివరాలు సేకరించారు. ఈ మేరకు ఆలమూరు ఎస్‌ ఐ జినరేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సెల్ఫీ వీడియో...

కామరాజు ఆత్మహత్య చేసుకునే ముందు చేసిన సెల్ఫీ వీడియో కీలకంగా మారనుంది. ‘‘నా కుమారులు, నేను ఆత్మహత్య చేసుకుని మృతి చెందుతున్నాం.. దీనికి ప్రధాన కారణం నా భార్య సమీప బంధువులైన ముగ్గురు వ్యక్తులు (పేర్లును ప్రస్తావిస్తూ). వారు తరచూ నన్ను వేధింపులకు గురి చేస్తుండడంతో పాటు నన్ను హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, బంధు వులను కూడా దూషిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు’’ అని కామరాజు ఆ వీడియోలో పేర్కొన్నాడు. కుమారుడు, మనవుల మృతి పట్ల కామరాజు తల్లితో పాటు బంధువులు విలపించారు.

నాలుగేళ్ల కిత్రం భార్య కూడా..

కామరాజు భార్య నాగలక్ష్మి నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. దీంతో మరణానికి కామరాజే కారణమని నాగలక్ష్మి బంధువులు ఆరోపించడంతో అతడిపై ఆలమూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం కామరాజు తన కుమారులకు చంపి, తాను ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందాడు. కుటుంబంలోని నలుగురు ఒకే రకంగా మృతిచెందడంతో సంచలనం కలిగించింది. నలుగురి మరణాలపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Oct 16 , 2025 | 12:27 AM