Share News

సాగిపోండి... సాఫీగా

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:40 AM

ప్రతిసారీ ఫాస్టాగ్‌ రీచార్జి చేసుకునే చింత ఉండదు. ఏడాది కాలానికి ఒకేసారి రూ.3వేలు చెల్లిస్తే దేశంలో ఏ టోల్‌ప్లాజా ద్వారానైనా వెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో వాహనదారుల ప్రయాణం ఇక సాఫీగా సాగిపోతుంది.

సాగిపోండి... సాఫీగా

ఏడాదికి రూ.3 వేలు చెల్లిస్తే చాలు

టోల్‌ప్లాజాల ద్వారా 200 సార్లు లేదా ఏడాది కాలానికి

ప్రతిసారీ రీచార్జి చేసుకునే బాధ ఉండదు

కార్లు, వేన్‌లు, జీపులకే పరిమితం

ఉమ్మడి జిల్లాలో వాహనదారులకు ఆర్థిక వెసులుబాటు

(పిఠాపురం-ఆంధ్రజ్యోతి)

ప్రతిసారీ ఫాస్టాగ్‌ రీచార్జి చేసుకునే చింత ఉండదు. ఏడాది కాలానికి ఒకేసారి రూ.3వేలు చెల్లిస్తే దేశంలో ఏ టోల్‌ప్లాజా ద్వారానైనా వెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో వాహనదారుల ప్రయాణం ఇక సాఫీగా సాగిపోతుంది. అయితే దీన్ని కార్లు, వేన్‌లు, జీపులకే పరిమితం చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభు త్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారి 16పై తుని-రాజమహేంద్రవరం మధ్యలోని కాకినాడ జిల్లా కృష్ణవరం, దివాన్‌చెరువు-సిద్ధాంతం మధ్యలోని డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా ఈతకోట వద్ద టోల్‌ప్లాజాలు ఉండగా, 216వ జాతీయ రహదారిపై కత్తిపూడి-కాకినాడ బైపాస్‌ మధ్యలో గొల్లప్రోలు వద్ద, గురజనాపల్లి-పాశర్లపూడి మధ్య గల కోనసీమ జిల్లా అన్నంపల్లి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఇవన్నీ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధీనంలో ఉన్నాయి. వీటితోపాటు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు వద్ద మరో టోల్‌ప్లాజా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఆర్‌డీసీ ఆధీనంలో ఉంది. వీటి ద్వారా ప్రయాణాలు సాగించే అన్ని రకాల కార్లు, వేన్‌లు, ఫోర్‌వీల్‌ ఆటోలు, లారీలు, బస్పులు, ట్రాలీలు, ఇతర భారీ వాహనాలు ఆయా టోల్‌గేట్ల వద్ద నిర్ణీత రుసుమును ఫాస్టాగ్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. టోల్‌ప్లాజా ద్వారా వెళ్లే ప్రతి వాహనానికి అక్కడ అమల్లో ఉన్న టోల్‌ఫీని వాహనానికి ఉన్న ఫాస్టాగ్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. టోల్‌ప్లాజా దాటే సమయంలో ఆటోమెటిక్‌గా వాహనానికి చెందిన ఫాస్టాగ్‌ ద్వారా ఈ రుసుము కట్‌ అవుతుంది. ఒకవేళ ఫా స్టాగ్‌ సొమ్ములు లేకున్నా, వాహనానికి అసలు ఫాస్టాగ్‌ లేకున్నా నిర్ణీత రుసుము కంటే 100శాతం అదనంగా చెల్లించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద ఇదే విధానం అమలవుతోంది. ఇకపై ఫాస్టాగ్‌ రీచార్జి తరచూ చేసుకునే ఇబ్బం ది లేకుండా ఏడాది రుసుము చెల్లించే విధానాన్ని అమలుల్లోకి తెచ్చింది. జాతీయ రహదారి ఫీ చట్టం 2008 కింద దీనిని అమల్లోకి తీసుకువస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే నూతన విధానం ప్రకారం ఏడాది కాలానికి రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫా స్టాగ్‌ రీచార్జి ఏడాది కాలానికి అమలులో ఉంటుంది. ఈ రీచార్జి చేయించిన వాహనం దేశంలోని జాతీయ రహదారులపై ఏ టోల్‌ప్ల్లాజా ద్వారానైనా 200 సార్లు ప్రయాణించే వీలుంది. ఏడాది లేదా 200 సార్లు ఏది ముందైతే దానిని పరిగణలోకి తీసుకుంటారు. ఏడాది కాలానికి ఫాస్టాగ్‌ తీసుకుంటే ప్రతి ఏటా ఏప్రిల్‌ 1వ తేదీన రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది.

వీటికి వర్తిస్తుంది..

ఏడాది ఫాస్టాగ్‌ రూ.3వేల రీచార్జిని కార్లు, జీపులు, వేన్‌లకు పరిమితం చేశారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం తిరిగే వాహనాలకే వీటిని వర్తింపజేశారు. వాణిజ్య అవసరాలకు తిరిగే వాహనాలకు ఇది వినియోగించుకునే అవకాశం ఉండదు. ముందుగా కార్లు, జీపులు, వేన్‌లకు దీనిని అమలుచేయడం ద్వారా పరిశీలన జరిపి దశలవారీగా అన్ని వాహనాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

వాహనదారులకు లాభమే..

ఏడాది లేదా 200సార్లు తిరిగేందుకు వీలుగా ఫా స్టాగ్‌ తీసుకోవడం వల్ల వాహనదారులకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుంది. గొల్లప్రోలు టోల్‌ప్లాజా ద్వారా కారు, జీపు వేన్‌లకు ఒకవైపు రూ.50 రుసుముగా ఉంది. దీని ప్రకారం 200 సార్లు ఇవి తిరిగితే పాత పద్ధతిలో రూ.10వేలు అవుతుంది. అదే నూతన విధానంలో రూ.3వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద 200 ట్రిప్పులకు రూ. 22 వేలు, ఈతకోట వద్ద టోల్‌ప్లాజా వద్ద 25 వేలు వ్యయం అవుతుంది. రాష్ట్రంలోని ఇతర టోల్‌ప్లాజాల వద్ద ఇంతకంటే అధిక రుసుమలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల సాధారణ పద్ధతుల్లో అయ్యే ఫాస్టాగ్‌ రుసుములో కేవలం 15 శాతం నుంచి 33 శాతం లోపుగా ఒకేసారి చెల్లిస్తే ఏడాదిపాటు లేదా 200 సార్లు ప్రయాణించే వీలుకలుగుతుంది. ఫాస్టాగ్‌ రీచార్జి విధానంపై ఆయా కేటగిరీల వాహనదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ టోల్‌ఫీ అన్ని రకాలుగా తమకు లాభదాయకమేనని చెబుతున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 01:40 AM