రైతులకు మేలు జరగాలి
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:17 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవసాయ మార్కెట్ కమిటీలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి నూతన పాలక మండలి చర్యలు తీసుకోవాలని, ఆదాయం పెంచుకోవడంతోపాటు చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.
మార్కెట్‌యార్డు ఆదాయం పెంచాలి
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం
రాజమహేంద్రవరం అర్బన్/కడియం/ధవళేశ్వరం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవసాయ మార్కెట్ కమిటీలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి నూతన పాలక మండలి చర్యలు తీసుకోవాలని, ఆదాయం పెంచుకోవడంతోపాటు చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోరుకొండ రోడ్డులోని మార్కెట్‌యార్డు ఆవరణలో నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మార్ని వాసుదేవ్, ఉపాధ్యక్షుడిగా నర్సరీ సంఘం ఉపాధ్యక్షుడు బోడపాటి గోపాలకృష్ణ(గోపి), డైరెక్టర్లుగా జనసేన నాయకుడు జంగా వినోద్ (వేమగిరిగట్టు), మురమండ టీడీపీ అధ్యక్షుడు దేవళ్ల రామ్మోహనరావు, గ్రంధి విజయలక్ష్మి(దుళ్ల) తదితర పాలక మండలి సభ్యులతో ఎమ్మెల్యే గోరంట్ల ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ మార్కెట్‌యార్డు ఆస్తులను పరిరక్షించాలని, మార్కెట్ యార్డు ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఏటా ఆదాయం రూ.6 కోట్లకు పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మార్ని వాసుదేవ్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆర్గానిక్ వ్యవసాయం చేయడంతో పాటు ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, అధికారులు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. కాగా, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, సిటీలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు, రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ కార్యదర్శి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున కూటమి నాయకులు, నర్సరీ రైతులు కడియపులంక అంబికా నర్సరీకి చేరుకుని అక్కడ నుంచి, ధవళేశ్వరం నుంచి డైరెక్టర్లుగా నియమితులైన టీడీపీకి చెందిన బండి శ్రీజ్యోతి, జనసేనకు చెందిన కొప్పిశెట్టి గాంఽధీ, బీజేపీకి చెందిన పన్నాల లక్ష్మీసంతోషి కూటమి నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలికి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, గట్టి సుబ్బారావు, వరగోగుల వెంకటేశ్వరరావు, చిట్టూరి అమ్మిరాజు, గట్టి నర్సయ్య, పీవీవీ సత్యనారాయణ, గుర్రపు సత్యనారాయణ, నర్సరీసంఘం అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, డైరెక్టర్లు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు.