రోడ్డెక్కిన అన్నదాత
ABN , Publish Date - May 13 , 2025 | 01:09 AM
రైతులు రోడ్డెక్కారు.. పండించిన పంటను కొనుగోలు చేయాలంటూ భీష్మించారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకూ విరమించేదిలేదని సు మారు రెండున్నర గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు.కొవ్వూరు నియోజకవర్గంలో 1,13,090 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు 78,731 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకనూ 13,787 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయవలసి ఉంది. ఇప్పటికే లక్ష్యం పూర్తయిందని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడంలేదు.
జాతీయ రహదారిపై బైఠాయింపు
రెండున్నర గంటల పాటు నిరసన
అధికారుల హామీతో విరమణ
కొవ్వూరు, మే 12 (ఆంధ్రజ్యోతి) : రైతులు రోడ్డెక్కారు.. పండించిన పంటను కొనుగోలు చేయాలంటూ భీష్మించారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకూ విరమించేదిలేదని సు మారు రెండున్నర గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు.కొవ్వూరు నియోజకవర్గంలో 1,13,090 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు 78,731 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకనూ 13,787 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయవలసి ఉంది. ఇప్పటికే లక్ష్యం పూర్తయిందని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడంలేదు. ఒక పక్క పంట చేతికొచ్చినా మరో వైపు కొనుగోళ్లకు అవకాశం లేకపోవడంతో రైతులంతా కలిసి ఆం దోళనకు దిగారు.కొవ్వూరు, గుండుగొలను నేషనల్ హైవేపై గామన్‌బ్రిడ్జి టోల్‌ఫ్లాజా సమీపంలో దొమ్మేరు వైపు ధాన్యం బస్తాలు లోడ్‌చేసుకుని వచ్చిన ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. హైవేపై రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పట్టణ, రూరల్ సీఐలు పి.విశ్వం, కె. విజయబాబు, తహశీల్దార్ ఎం.దుర్గాప్రసాద్, ఏవో ఎ.గంగాధర్ సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. రైతులతో మాట్లాడి రోడ్డుకు అడ్డంగా పెట్టిన ధాన్యం ట్రాక్టర్లను తొలగించాలని కోరా రు. అయినా మాట వినకపోవడంతో పోలీసులు బలవంతంగా రైతులను తొలగించే ప్రయ త్నం చేశారు. అయినా రైతులు తగ్గలేదు. సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని పట్టుబట్టారు. రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో గత పంట కంటే 70 శాతం అధికంగా కొనుగోలు చేశారని, కొవ్వూరు డివిజన్‌లో తక్కువ టార్గెట్లు ఇచ్చారన్నారు. ప్రస్తుత పంటలో అధిక దిగుబడులు వచ్చాయని పాత లెక్కల ప్రకారం కొనుగోలు చేస్తే ఎలా అని ఆర్డీవోను ప్రశ్నించారు. వాడపల్లికి చెందిన రైతు స్వామి మాట్లాడుతూ వెంటనే టార్గెట్లను పెంపుదల చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన రైతు సుబ్బారావు మాట్లాడుతూ ఒక ప్రక్క వర్షాలు పడుతున్నాయి ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. నందమూరుకు చెందిన మారిన రామకృష్ణ మాట్లాడుతూ వెంటనే ఆర్‌ఎస్‌కేల టార్గెట్లు పెంచి పూర్తిస్తాయిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ రైతులను చూసి కారు దిగి వచ్చారు. విషయం తెలుసుకుని ఆర్డీవో రాణి సుస్మిత, జేసీ ఎస్.చిన్నరాముడు, సివిల్ సప్లయిస్ డిఎం రాధికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు.ఈ మేరకు రైతులు ఆందో ళన విరమించారు. ఆందోళనలో కొవ్వూరు, చాగల్లు మండలాల రైతులు పాల్గొన్నారు.