Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:22 AM

రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

  రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటుచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వన్నెచింతలపూడిలో పశువైద్యాధికారిణి డాక్టర్‌ పూర్ణిమానాగలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన లేగదూడల అందాల పోటీని ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్‌ నక్కా రాజారత్ననాగవాణి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్‌ కె.వెంకట్రావు మాట్లాడుతూ పెయ్యదూడల ఉత్పత్తి పథకం ద్వారా లింగ నిర్థారిత వీర్యాన్ని ఉపయోగించడంతో రైతులకు మేలైన పెయ్యదూడలను 90శాతం ఖచ్చితంగా అందించవచ్చునని తెలిపారు. తద్వారా పాల దిగుబడి పెరగడంతో పాటు రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. మూడేళ్ల కాలపరిమితికి రూ.288 ప్రీమియం చెల్లిస్తే పశువులకు రూ.30వేల బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని వివరించారు. లేగదూడల అందాల పోటీల్లో ప్రథమ బహుమతి నక్కా శేషగిరిరావు (పుంగనూరు ఆవుదూడ), ద్వితీయ బహుమతి నడింపల్లి కాశీవిశ్వనాథరాజు (గిర్‌ ఆవుదూడ), తృతీయ బహుమతి మామిడిపల్లి బాబు (పుంగనూరు ఆవుదూడ) స్థానాలు సాధించాయి. పెయ్యదూడల రైతులకు ఎమ్మెల్యే ఆనందరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పశు సంవర్థకశాఖ ఉప సంచాలకుడు డాక్టర్‌ కర్నీడి మూర్తి, సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.విజయారెడ్డి, డాక్టర్‌ చీకట్ల వెంకటనారాయణ, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, చిందాడగరువు సర్పంచ్‌ పొణకల గణేష్‌, ఎంపీటీసీ పరమట నాగమణి, పశువైద్యులు డాక్టర్‌ మాధురి, డాక్టర్‌ నారాయణరావు, డాక్టర్‌ హెబ్సిబా, పశువైద్య సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:22 AM