సూచించిన ప్రదేశాల్లోనే గణేష్ నిమజ్జనం
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:55 PM
అంతర్వేది, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): సూచిం చిన ప్రదేశాల్లోనే గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాలు చేపట్టాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ స్పష్టంచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీసుస్టేషన్‌కు బుధవారం ఆయన విచ్చేశారు. తొలుత పోలీసుస్టేషన్
మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి : ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్
అంతర్వేది, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): సూచిం చిన ప్రదేశాల్లోనే గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాలు చేపట్టాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ స్పష్టంచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీసుస్టేషన్‌కు బుధవారం ఆయన విచ్చేశారు. తొలుత పోలీసుస్టేషన్ వద్ద గౌరవ వందనం స్వీకరించగా జిల్లా ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ మురళీమోహన్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. లాకప్, స్టేషన్‌ను పరిశీలించి ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న గణేష్ నవరాత్రులను ప్రతీ ఒక్కరు భక్తిశ్రద్ధలతో బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మండపాల వద్ద భక్తి గీతాలు ఆలపిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్రమ విద్యుత్ సరఫరాలు లేకుండా మండపాల వద్ద ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పోలీసు, కలెక్టర్‌ల ఆదేశాల మేరకు సూచించిన ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ నిమజ్జన కార్యక్రమాలు చేపట్టకుండా ప్రమాదాలకు చెక్ పెట్టాలన్నారు. అలాగే కోనసీమ జిల్లాలో కూడా అన్ని స్టేషన్లలో ఉద్యోగాల భర్తీకి సన్నద్ధం చేశామన్నారు. ప్రధానంగా గంజాయి సేవించడం, రవాణా పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకు లావాదేవీలు జరిపేటప్పుడు అనుమానితులకు సమాచారం ఇవ్వకుండా ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల వద్ద దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గ్రామాల రక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ నరేష్, ఎస్‌ఐ కె.దుర్గాశ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.