రాజోలు ఎంపీపీగా కడలి శ్రీదుర్గ
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:48 AM
రాజోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా పొన్నమండ-2 ఎంపీటీసీ కడలి శ్రీదుర్గ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిగా పి.బొజ్జిరాజు బుధవారం ప్రకటించారు.
రాజోలు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాజోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా పొన్నమండ-2 ఎంపీటీసీ కడలి శ్రీదుర్గ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిగా పి.బొజ్జిరాజు బుధవారం ప్రకటించారు. రాజోలు ఎంపీపీ కేతా శ్రీను ఆకస్మిక మృతితో రాజోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుని స్థానానికి ఖాళీ ఏర్పడినందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజోలు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎన్నికల అబ్జర్వర్ టి.నిషాంతి పర్యవేక్షణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 19 ఎంపీటీసీలకుగాను టీడీపీ 7, జనసేన 5, స్వతంత్ర 2, వైసీపీ 5 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీలు ఎన్నికల్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. కోరం పూర్తి అవడంతో ఎన్నికల ప్రక్రియ ఎన్నికల అధికారి బొజ్జిరాజు ప్రారంభించారు. ఎంపీపీ అభ్యర్థిగా పొన్నమండ-2 ఎంపీటీసీ కడలి శ్రీదుర్గ ఒక్కరే నామినేషన్ వేయడంతో వైస్‌ఎంపీపీ యింటిపల్లి ఆనందరాజు బలపరిచారు. పొన్నమండ-2 ఎంపీటీసీ శ్రీదుర్గ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి బొజ్జిరాజు ప్రకటించారు. నూతన ఎంపీపీగా ఎన్నికైన శ్రీదుర్గకు నియామక పత్రాన్ని అందజేసి ఎన్నికల అధికారి బొజ్జిరాజు ప్రమాణం చేయించారు. నూతనంగా ఎన్నికైన శ్రీదుర్గను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంలకు రాజోలు ఎంపీపీ కడలి శ్రీదుర్గ కృతజ్ఞతలు తెలిపారు. దివంగత ఎంపీపీ కేతా శ్రీను చిత్రపటానికి ఆమె పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎంపీపీగా ఎన్నికైన శ్రీదుర్గకు గోదావరి సెంట్రల్‌డెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాజోలు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు చిటికెల రామ్మోహనరావు, చాగంటి స్వామి, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకటరమణ, వైస్‌ఎంపీపీలు పొలమూరి శ్యామ్‌బాబు, యింటిపల్లి ఆనందరాజు, మంగెన నాని, అడబాల విజయ్, మొల్లేటి శ్రీనివాస్ తదితరులు అభినందించారు.