Share News

వచ్చేశాయ్‌ ఎగ్‌ కార్ట్‌లు!

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:40 AM

అమలాపురం రూరల్‌/మండపేట,ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గుడ్డు.. వెరీ గుడ్డు. నూరుశాతం కల్తీలేని అధిక పోషకాలు కలిగిన కోడిగడ్లు తినడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చునంటూ నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) విస్తృత ప్రచారం చేపట్టింది. కోడిగుడ్ల వినియోగాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమా

వచ్చేశాయ్‌ ఎగ్‌ కార్ట్‌లు!
అమలాపురం మండల మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళల పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎగ్‌ కార్ట్‌లు

గుడ్లతో విభిన్న రుచులతో వంటకాలు

డ్వాక్రా మహిళలకు ఉచితంగా ఎగ్‌కార్టులు

జిల్లావ్యాప్తంగా 40 ఎగ్‌కార్టులు మంజూరు

గ్రామీణ మహిళలకు ఉపాధే లక్ష్యం

అమలాపురం రూరల్‌/మండపేట,ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గుడ్డు.. వెరీ గుడ్డు. నూరుశాతం కల్తీలేని అధిక పోషకాలు కలిగిన కోడిగడ్లు తినడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చునంటూ నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) విస్తృత ప్రచారం చేపట్టింది. కోడిగుడ్ల వినియోగాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంతోపాటు డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌) ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా రూ.50 వేలు విలువైన ఎగ్‌కార్ట్‌లను డ్వాక్రా మహిళలకు ఉచితంగా అందించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కోనసీమ జిల్లాకు 40 ఎగ్‌కార్ట్‌లను అందించేందుకు నిర్ణయించారు. దీనిలో భాగం గా జిల్లాకు తొలివిడతలో ఎనిమిది ఎగ్‌ కార్ట్‌లు చేరుకున్నాయి. ఒక్కో యూనిట్‌ విలువ ఉండ గా, దీనిలో రూ.35 వేలు యూనిట్‌కాగా, మరో రూ.15 వేల విలువైన వంట సామగ్రి అందించనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా వ్యాపారం చేసే మహిళలు నెలకు రూ.20 వేల వరకు ఆదాయం పొందేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది.

డ్వాక్రా మహిళల ఆదాయ మార్గం

డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎగ్‌ కార్ట్‌ల వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. కోడిగుడ్లు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. డ్వాక్రా మహిళలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టగలవని చెబుతున్నారు. నిత్యం గుడ్ల వంటకాలతో పోషకాహారాన్ని అందిస్తూ మహిళలు రోజువారీ ఆదాయం పొందేందుకు ఎగ్‌కార్ట్‌లు దోహదపడతాయి. ఇటీవలకాలంలో పల్లె, పట్టణం అన్న బే ధం లేకుండా ఎక్కడ చూసినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లే. ఆయా సెంటర్లలో ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌, ఎగ్‌ నూడుల్స్‌, ఎగ్‌ బజ్జీ, ఆమ్లెట్లు వంటివి సర్వ సాధారణమైపోయాయి. దోసెలపై కోడిగుడ్లను ఆమ్లెట్‌గా వేయడం, పరోటా విత్‌ ఎగ్‌, ఎగ్‌65, గోం గూర విత్‌ ఎగ్‌ దోశ, ఎగ్‌ ఘీరోస్ట్‌ వంటి అనేక రకాల వంటకాలు మార్కెట్‌లో జోరుగా అందుబాటులో ఉన్నాయి. ప్రతీరోజు విభిన్న రుచులతో గుడ్లు తినే అలవాటును ప్రోత్సహించడంతోపాటు అన్ని రకాల గుడ్డు వంటకాలను ఒకేచోట అందించడం ఎగ్‌కార్ట్‌ల లక్ష్యం.

ఎగ్‌కార్ట్‌ యూనిట్‌లో..

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే ఎగ్‌కార్ట్‌ యూనిట్‌లో వ్యాపారం నిర్వహించుకునేందుకు అవసరమైన సదుపాయాలు ఉంటాయి. స్టాల్‌తోపాటు గ్యాస్‌ పొయ్యి, పెనం, కలాయి, కొన్ని గిన్నెలు, టబ్‌లు, గ్లాస్‌లు, కంచాలతోపాటు ఆహార పదార్థాలను వేడివేడిగా అందించేందుకు హాట్‌ ప్యాక్‌లను కూడా ఉంచారు. ఫుడ్‌ ప్యాకింగ్‌ మిషన్‌ ఉండనే ఉంది. డ్వాక్రా మహిళలు వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు అవసరమైన రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు. బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి, ఉన్నతి వంటి పథకాల కింద డ్వాక్రా మహిళలకు అవసరమైతే రుణాలు అందిస్తామని డీఆర్డీఏ ఏపీడీ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాకు తొలి విడతలో ఎనిమిది ఎగ్‌ కార్ట్‌లు వచ్చాయని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందిస్తామన్నారు. మలివిడతలో మరో 32 వస్తాయని చెప్పారు. మహిళలను ఆర్థిక తోడ్పాటు, ఆరోగ్యవంతమైన సమాజానికి ఎగ్‌కార్ట్‌లు దోహదపడతాయని నాగేశ్వరరావు తెలిపారు. రోజూ రెండు కోడిగుడ్లు తినండి. రోగాలకు దూరంగా ఉండండి. గుప్పెడు గుడ్డు గుండెకు బలం అంటూ నెక్‌, సెర్ప్‌ ఏపీ ఆధ్వర్యంలో ఎగ్‌ కార్ట్‌లపై విస్తృత ప్రచారం ఆకట్టుకుంటోంది

Updated Date - Aug 24 , 2025 | 01:40 AM