విద్యతోనే సమాజంలోని అసమానతలు దూరం
ABN , Publish Date - May 05 , 2025 | 12:30 AM
సమాజంలో అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పరితపించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని గీతం యూనివర్శిటీ ప్రొఫెసర్ సి.ప్రజ్ఞ పేర్కొన్నారు.
ముమ్మిడివరం, మే 4(ఆంధ్రజ్యోతి): సమాజంలో అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పరితపించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని గీతం యూనివర్శిటీ ప్రొఫెసర్ సి.ప్రజ్ఞ పేర్కొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ సోమిదేవరపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన అంబేడ్కర్ 134వ జయంతి వేడకల్లో భాగంగా అక్కడ ఏర్పాటుచేసిన అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రొఫెసర్ ప్రజ్ఞ ఆవిష్కరించారు. అంబేడ్కర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉన్నత చదువులు అభ్యసించడం ద్వారా సమాజంలోని అసమానతలు తొలగించవచ్చునన్నారు. అంబేడ్కర్ మానవహక్కుల ఉద్యమనేతగా దళిత వర్గాలకు కాకుండా మహిళలు, శ్రామికులు, కర్షకుల కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. మరో ముఖ్య అతిథి బోరుగడ్డ సుబ్బయ్య మాట్లాడుతూ యువత చదువుపై దృష్టి సారించి శాస్ర్తీయ జీవన విధానం అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో చెల్లి అశోక్, అడబాల సతీష్‌కుమార్, చెల్లి సురేష్, కాశి వెంకటాచార్య, యువజన సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.