ఆగ్రహా‘వేషాలు’
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:28 AM
కాకినాడ/కాకినాడ సిటీ, జులై 2 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా జడ్పీ సమావేశంలో సాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆఽధునీకరణపై ప్రధానంగా చర్చ సాగింది. డ్రైనేజీ బోర్డు పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం చేశారు. రైతులకు ధాన్యం సొమ్ము చెల్లించాలంటూ సభ్యులు
వాకౌట్ పేరుతో వైసీపీ జడ్పీటీసీల హంగామా
ఐదు నిమిషాల్లోనే తిరిగి సమావేశానికి హాజరు
వైసీపీ జెడ్పీటీసీల మధ్య బయటపడిన విభేదాలు
వైస్ చైర్మన్ అనుబాబుతో
సొంత పార్టీ జడ్పీటీసీల వాగ్వాదం
జడ్పీ సమావేశంలో సమస్యల
వాణి వినిపించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆఽధునికీకరణపై చర్చ
డ్రైనేజీ బోర్డు పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం
ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలపై అధికారుల నిలదీత
కాకినాడ/కాకినాడ సిటీ, జులై 2 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా జడ్పీ సమావేశంలో సాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆఽధునీకరణపై ప్రధానంగా చర్చ సాగింది. డ్రైనేజీ బోర్డు పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం చేశారు. రైతులకు ధాన్యం సొమ్ము చెల్లించాలంటూ సభ్యులు కొద్దిసేపు వాకౌట్ చేశారు. కాకినాడ జడ్పీ కార్యాలయంలోని జీఎంసీ బాలయోగి సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌సగిలి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ విచ్చేశారు.
పరిశ్రమల కాలుష్యంపై..
రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కుడుపూడి సూర్యనారాయణ, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. జడ్పీ సమావేశంలో పలు అంశాలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల వాణి వినిపించారు. పరిశ్రమల కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వీర్రాజు మండిపడ్డారు. పరిశ్రమల కాలుష్య నివారణ చర్యలు కచ్చితంగా అ మలు చేయాలని పట్టుబట్టారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాం తి మాట్లాడుతూ తుల్యభాగ కాలుష్యం సమస్యపై పొల్యూషన్ బోర్డు పరిశీలి స్తోందని, కాలుష్య నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. కూనవరం డ్రెయిన్లో చల్లపల్లి- చింతలపూడి లాకుల వరకూ ఉప్పునీరు వెనుకకు తన్నుకురావడం వల్ల వందలాది ఎకరాల్లో సేద్యం దెబ్బతింటోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సభ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను పరిశీలించి పరిష్కారానికి ప్రతిపాదనలు సమర్పించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ ఆ జిల్లా అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, డ్రైనేజీ బోర్డు అవసరమని పలువురు సభ్యులు ప్రస్తావించగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరదామని జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
వాకౌట్ అంటూ వెళ్లి.. వెంటనే తిరిగొచ్చి..
సభ ప్రారంభంలోనే ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రైతులకు ధాన్యానికి సంబంధించిన సొమ్ములు అందలేదని, దానికి నిరసనగా సభ్యులందరూ వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. దీంతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్.. ముందు సమస్యలపై చర్చిద్దామని చెప్పినా.. సభ్యులు వినిపించుకోకుండా వాకౌట్ చేశారు. దీంతో చేసేదేమీ లేక ఎంపీ బోస్ కూడా వారిని అనుసరించాల్సి వచ్చింది. అదే కొంతసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక తిరిగి సమావేశానికి హాజరై వారి సీట్లలో ఆశీనులయ్యారు. ఈ సమయంలోనే వైసీపీ జడ్పీటీసీలు, జడ్పీ వైఎస్ చైర్మన్ బుర్రా అనుబాబు మధ్య వాగ్వాదం జరిగిం ది. సొంత పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తున్నా. ఆయన పట్టించుకోకుండా సభలో ఉండిపోవడంపై కొంతమంది జడ్పీటీసీలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై వైసీపీ అధిష్టానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
నీటి విడుదలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిలదీత..
గోదావరి డెల్టాలకు విడుదల చేసినట్టే మెట్ట ప్రాంతంలోని ఏలేరు, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్‌ల కింద ఉన్న రెండు లక్షల ఆయకట్టుకు జూన్ ఒకటో తేదీ నుంచి ఎందుకు నీరు విడుదల చేయలేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులను నిలదీశారు. ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బం దులు పడుతున్నారని, దీనికి పరిష్కారంగా మెట్టప్రాంతంలో ప్రత్యేక ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటు అవసరమన్నారు. కాలువలో మానవ విసర్జితాలను వదులుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని కుడుపూడి సూర్యానారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ వివరణ ఇస్తూ జూన్ ఒకటో తేదీ నాటికి పురుషోత్త పట్నం వద్ద కనీస నీటిమట్టం స్థాయి 14 అడుగులకు దిగువన ఉన్నందున ఎత్తిపోతల ద్వారా మెట్టప్రాంతానికి నీటి విడుదల సాధ్యపడలేదని, ప్రస్తుతం 14.5 స్థాయికి జలాలు ఉన్నందున పుష్కర ద్వారా రేపటి నుంచి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. అలా గే మిగిలిన ప్రాజెక్టుల నుంచి జూలై 15 నుంచి నీరు విడుదల చేస్తారన్నారు. ఇరిగేషన్, పంచాయతీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో కాలువలో మానవ విసర్జితాలు కలవకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
పలు సమస్యల ప్రస్తావన
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, డ్రైనేజీ బోర్డు అవసరమని పలువురు ప్రస్తావించగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరదామని జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకే ఆధార్ నం బరుతో 3 కరెంటు మీటర్లు ఉండడం వల్ల కొంతమందికి తల్లికి వందనం మంజూరు కావడం లేదని, పంచాయతీలకు 2023 నుంచి స్టాంపు డ్యూటీ జమకాక జనరల్ ఫం డ్ ఉండడం లేదని, రైతులకు ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని, గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్ వ్యాధులను నివారించాలని, మండలాల్లో చేసిన వివిధ పనులకు చెల్లింపులు జరపాలని జడ్పీటీసీలు కోరారు. రౌతులపూడి మండలంలోని గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్యపరిరక్షణకు రెండువారాలు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కాకినాడ కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాఖాధికారులు పాల్గొన్నారు. తొలుత రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలుపుతూ 2నిమిషాలు మౌనంపాటించారు.