Share News

గ్రామీణ రహదారులకు నిధుల వరద

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:46 AM

గ్రామీణ ప్రాంతాల రహదారులకు నిధుల వరద పారింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని వివిధ పథకాల గ్రాంట్లను కలుపుకుని ఏపీ రూరల్‌ రోడ్స్‌ స్ట్రెంథనింగ్‌ ప్రాజెక్టు కింద నిధులు కేటాయింపు జరపడంతో అధ్వానంగా ఉన్న రహదారులకు మోక్షం లభించనుంది. ప్రజల కష్టాలు తీరనున్నాయి.

గ్రామీణ రహదారులకు నిధుల వరద
రూ.8కోట్లతో సుద్దగడ్డ కాలువపై బ్రిడ్జి నిర్మించనున్న గొల్లప్రోలు-తాటిపర్తి రహదారి ప్రాంతం

ఉమ్మడి జిల్లాలో 241 రోడ్లకు

రూ.363.33 కోట్లు మంజూరు

ఏపీ రూరల్‌ రోడ్స్‌ స్ట్రెంథనింగ్‌ ప్రాజెక్టు కింద కేటాయింపు

ఒకేసారి ఈ స్థాయిలో

నిధుల విడుదల ఇదే ప్రథమం

బాగుపడనున్న

అధ్వాన రహదారులు

గ్రామీణ ప్రాంతాల రహదారులకు నిధుల వరద పారింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని వివిధ పథకాల గ్రాంట్లను కలుపుకుని ఏపీ రూరల్‌ రోడ్స్‌ స్ట్రెంథనింగ్‌ ప్రాజెక్టు కింద నిధులు కేటాయింపు జరపడంతో అధ్వానంగా ఉన్న రహదారులకు మోక్షం లభించనుంది. ప్రజల కష్టాలు తీరనున్నాయి.

(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)

గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారడంతో కొంతకాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రామీణ రహదారుల నిర్వహణను పట్టించుకోకపోవడంతో రోడ్లన్నీ గోతులమయంగా మారాయి. కనీస మరమ్మతులు చేపట్టక అన్నీ అధ్వానస్థితికి చేరాయి. పలు గ్రామాలను కలిపే ముఖ్యమైన రహదారుల అభివృద్ధిని విస్మరించారు. దీంతో పంచాయతీరాజ్‌శాఖ అధీనంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న రహదారుల్లో 80శాతం వరకూ రోడ్లను అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల దుస్థితిపై దృష్టిసారించింది. సీఎం చంద్రబాబుతోపాటు పంచాయతీరాజ్‌ శాఖా మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిఽదులను వినియోగించుకుని పల్లె పండుగ కార్యక్రమంలో పలు రహదారులను అభివృద్ధి చేశారు. గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇంకా 50శాతానికి పైగా రహదారులను అభివృద్ధి చేయాలని గుర్తించారు.

భారీగా కేటాయింపులు

గ్రామీణ రహదారులను ఏపీ రూరల్‌ రోడ్స్‌ స్ట్రెంథనింగ్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫేజ్‌-1 కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.2,123కోట్లను విడుదల చేయగా అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే రూ.363.33కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 547.62కిలోమీటర్ల పొడవునా ఉన్న 241 రహదారులను అభివృద్ధి చేస్తారు. కాకినాడ జిల్లాలో 106 రోడ్లను 236.48 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.160.15కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 57 రోడ్లను 125.016 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.72.39కోట్లు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 78 రోడ్లను 186.123 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.130.79కోట్లు విడుదల చేశారు.

కాకినాడ జిల్లాలో కేటాయింపులు ఇలా..

కాకినాడ జిల్లా పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గంలో 4 రోడ్ల అభివృద్ధికి రూ.7.44కోట్లు, కాకినాడ రూరల్‌లో 13రోడ్లకు రూ.12.08కోట్లు, పెద్దాపురంలో 4రోడ్లకు రూ.9.74కోట్లు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 4రోడ్లకు రూ.10.01కోట్లు, పిఠాపురం నియోజకవర్గంలో 68 రోడ్ల అభివృద్ధికి రూ.94.43కోట్లు, రామచంద్రపురం(కాజులూరు మండలం)లో 9రోడ్లకు రూ.15.97 కోట్లు, తునిలో 4రోడ్లకు రూ.10.48కోట్లు కేటాయించారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో 7 రహదారుల అభివృద్ధికి రూ.8.5కోట్లు, జగ్గంపేట నియోజకవర్గం (గోకవరం మండలం)లో ఒక రహదారికి రూ.55లక్షలు, కొవ్వూరులో 6 రహదారులకు రూ.9.57కోట్లు, నిడదవోలు నియోజకవర్గంలో 21 రహదారుల అభివృద్ధికి రూ.28.89కోట్లు, రాజమహేంద్రవరం రూరల్‌లో 15 రహదారులకు రూ.9.17కోట్లు, రాజానగరం నియోజకవర్గంలో 7 రహదారుల అభివృద్ధికి రూ.15.66కోట్లు కేటాయించారు.

కోనసీమ జిల్లాలో..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో 13 రోడ్ల అభివృద్ధికి రూ.17.58కోట్లు కేటాయించగా, గన్నవరంలో 18రోడ్లకు రూ.20.63కోట్లు, కొత్తపేట నియోజకవర్గంలో 9 రోడ్లకు రూ14.93కోట్లు, మండపేట నియోజకవర్గంలో 13 రహదారుల అభివృద్ధికి రూ.22.76కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గంలో 4రోడ్ల అభివృద్ధికి 24.86కోట్లు, రామచంద్రపురంలో 4రోడ్లకు రూ.6.25కోట్లు, రాజోలు నియోజకవర్గంలో 17 రోడ్ల అభివృద్ధికి రూ.23.78కోట్లు కేటాయించారు.

Updated Date - Dec 16 , 2025 | 12:46 AM