Share News

తీగలాగితే.. డ్రగ్స్‌ లింక్‌లు!

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:46 AM

ఏ మూల మాదక ద్రవ్యాలు దొరికినా మూలా లు తూర్పున కనిపిన్నాయి. ఎక్కడో పట్టుబడిన గంజాయి వాసనకు జిల్లా కేంద్ర బిందువుగా మా రుతోంది. చివరికి డ్రగ్స్‌లోనూ అదే తీరు కనిపి స్తోంది.

 తీగలాగితే.. డ్రగ్స్‌ లింక్‌లు!
హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌తో పట్టుబడిన యువత (ఫైల్‌)

గంజాయి,డ్రగ్స్‌ కేరాఫ్‌గా తూర్పు

క్లాసుగా తిరుగుతూ దందాలు

క్లాసులతో సరిపెడుతున్న పోలీస్‌

సర్వనాశనమవుతున్న యువత

పరారీలో డీటీ మణిదీప్‌..

బెయిల్‌కి ముందస్తు ప్రయత్నం

పసిగట్టడంలో నిఘా పడక

మామూళ్ల మత్తులో పోలీస్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఏ మూల మాదక ద్రవ్యాలు దొరికినా మూలా లు తూర్పున కనిపిన్నాయి. ఎక్కడో పట్టుబడిన గంజాయి వాసనకు జిల్లా కేంద్ర బిందువుగా మా రుతోంది. చివరికి డ్రగ్స్‌లోనూ అదే తీరు కనిపి స్తోంది. తాజాగా హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్స్‌ కేసులో కీలక వ్యక్తిగా రాజమహేంద్రవరానికి చెం దిన డిప్యూటీ తహశీల్దార్‌ మణిదీప్‌ వ్యవహారం మరింత చర్చకు తెరలేపింది. వైసీపీ ప్రభు త్వం లో గంజాయి, డ్రగ్స్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మూలన చర్యలు ఆరంభిం చింది. ఈగిల్‌ టీంను సిద్ధం చేసింది. దీంతో డ్రగ్స్‌ డొంకలు కదులుతున్నాయి. డిప్యూటీ తహశీల్దార్‌ డ్రగ్స్‌ వ్యవహారం కలకలం రేపుతోంది.

డీటీ..ఇదేంటి?

ఏపీ నుంచి వెళ్లి డ్రగ్స్‌తో రేవ్‌ పార్టీ చేసుకుంటున్న ఆరుగురిని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ వింగ్‌, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు రావుపాలెం, ఆలమూరు, రాజమహేంద్రవరానికి చెందిన వాళ్లే.. వీళ్లను పట్టుకుని తీగ లాగితే ధవళేశ్వరం పోలవరం భూసేకరణ పరిపాలనా కార్యాలయంలో చింతూరు యూనిట్‌ స్పెషల్‌ డిప్యూటీ తహశీ ల్దార్‌గా పనిచేస్తున్న మణిదీప్‌ డొంక కదిలింది. 2012లో కారుణ్య నియామకం కింద రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసి స్టెంట్‌గా జాయినైన మణిదీప్‌.. ఆర్‌ఐగా ఉన్న సమయంలో లంచం ఆరోపణలతో సస్పెన్షన్‌కి గురయ్యాడు. అనంతరం డ్రగ్స్‌ ముఠాలతో పరిచయాలు పెంచుకున్నాడు. ఏడాదికి మూడొంతులు హైదరాబాద్‌, ఊటిలోనే ఉంటాడు. విలాసవం తమైన పార్టీలను ప్యాకేజ్‌గా ఒప్పుకోవడం ప్రవృత్తిగా చేసుకు న్నాడు. హైదరాబాద్‌లోని రేవ్‌ పార్టీ పెట్టిన గెస్ట్‌హౌస్‌ కూడా ఇతనే రాజమహేంద్రవరం నుంచి బుక్‌ చేశాడని ప్రచారం జరిగింది. అలాగే మణిదీప్‌ తరచుగా నామవరం రోడ్‌లోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో పార్టీలు పెట్టేవాడు. రాజానగరం తదితరచోట్ల ఉన్న రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లు ఇతడి చేతిలోనే పెట్టుకున్నాడని కూడా చెబుతారు. అలాగే రాజమహేంద్రవరం కేంద్రంగా గంజాయి లోకల్‌గా సమకూరుస్తూ ఖరీదైన డ్రగ్స్‌ కొకైన్‌, ఎండీఎంఎ వంటి వాటిని ముంబై, బెంగళూరు నుంచి తీసుకువస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇక రాజమ హేంద్రవరం సమీపంలోను, రాజానగరం ప్రాంతంలోను మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలు ఎక్కువ. సుమారు 4 వేల మందిపైనే విద్యార్థులుంటారు. వీరిని లక్ష్యంగా చేసుకుని మధ్యవర్తుల ద్వారా డ్రగ్స్‌ని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. మణిదీప్‌ తన రేవ్‌ పార్టీల సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. మణిదీప్‌ రకరకాల నిషేధిత డ్రగ్స్‌ని పరిచయం చేసి కుర్రా ళ్లను నాశనం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మణిదీప్‌ పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్‌ ప్రయత్నిస్తున్నాడని చెబుతు న్నారు. తెలంగాణ పోలీసుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే మణిదీప్‌ వద్దకు వెళ్లిన స్పెషల్‌ బ్రాంచి పోలీసులు అతడు చెప్పింది విని వెనుదిరగడం ఆరోపణలకు తావిస్తోంది. మణిదీప్‌కి ఎంతటి వారినైనా డబ్బుతో లొంగదీసుకోవడం అల వాటు కాబట్టి ఇప్పుడూ అదే జరిగి ఉంటుందనే విమర్శలున్నా యి. ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ తన స్నేహి తులకు మణిదీప్‌ సోమవారం రాత్రి ఒంటి గంట సమయం లో వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టడంపై వాళ్లే విస్తుపోతున్నారు.

కమ్మేస్తున్న గంజాయి పొగ

ఎక్కడ పోలీసులు మాదక ద్రవ్యాలు పట్టుకు న్నా ఉమ్మడి తూర్పుగోదావరితో ఏదొక లింకు ఉంటోంది. ఈనెల 16న నెల్లూరు బాలాజీనగర్‌ పీఎస్‌ పరిధిలో కారులో గంజాయి తరలిస్తున్న ట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో రం గంలోకి దిగారు. కారు డ్రైవరు పోలీసులను ఢీకొట్టి కారుతో పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంబడిం చిన పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి ఒక వ్యక్తిని, 22 కిలోల గంజాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి రాజమహేంద్రవరానికి చెం దిన బీరక ప్రకాశ్‌ అలియాస్‌ సూర్యప్రకాశ్‌ అని గుర్తించారు. ఈనెల 8న ధవళేశ్వరం ఐవో సీఎల్‌ కాలనీకి చెందిన సతీశ్‌ అదృశ్యమయ్యాడు. అతని తోపాటు రైళ్లలో సమోసాలు విక్రయించే స్నేహితు లు గంజాయి తాగిన మైకంలో చంపేశారు. కుళ్లిన స్థితిలో ఆ యువకుడి శవం లభ్యమైంది. సుమారు రెండేళ్ల కిందట రాజమండ్రికి చెందిన ఓ యాంకర్‌ హైదరాబాద్‌లోని గంజాయి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పోలీసులు ఏమీలేదని తీసి పారే స్తున్నా జరుగుతున్న ఘటనలు నిజమని రుజువు చేస్తున్నాయి. రాజమహేంద్రవరంతోపాటు గ్రామా లకు సైతం గంజాయి పాకేసింది. సిగరెట్లలో పొ గాకు తీసేసి అందులోకి నేరుగా గంజాయి నింపి పెద్దఎత్తున విక్రయాలు జరుపుతున్నారు.

చుక్‌చుక్‌లో గప్‌చుప్‌గా

స్టూడెంట్స్‌ మాదిరిగా బ్యాగులు తగిలించుకొని రైళ్లలో గంజాయి ఆకు, పొడి, లిక్విడ్‌ రూపాల్లో హైదరాబాద్‌ పబ్‌లకు సరఫరా చేస్తున్నారు. దీనికి రాజమండ్రి, సామర్లకోట, తుని, అన్నవరం, అనకాపల్లి రైల్వే స్టేషన్లను ఎంచుకుంటున్నారు. విశాఖ వైపు నుంచే వచ్చే బొకారో, కోణార్క్‌, గువాహటి తదితర రైళ్లు గంజాయి రవాణాకు అనువుగా మారాయని ఇప్పటికే రైల్వే పోలీసులు గుర్తించారు. ఆ రైళ్లలో బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి. దీంతో తనిఖీలు చేయడం అ సాధ్యం. గంజాయి తీసుకెళ్తున్నవాళ్లు హైదరాబా ద్‌, బెంగళూరు వైపు వెళ్తారు. కొందరు విజయ వాడలో దిగిపోయి చెన్నై లేదా చెన్నై వెళ్ల కుండా కాట్పాడి జంక్షన్‌ మీదుగా నేరుగా వెళ్లే రైళ్లను ఎంచుకొని సేలం, ఈరోడ్‌కు చేరుస్తున్నారు.

నిద్దరోతున్న నిఘా

జిల్లాలోని పోలీస్‌, ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌ వంటి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల్లో నిఘా నిద్దరోతున్న ట్టుగా పరిస్థితులు చెబుతున్నాయి. ముఖ్యంగా పోలీస్‌కి సంబంధించి ప్రతి స్టేషన్‌లో ఒక నిఘా విభాగ పోలీస్‌ ఉంటారు. ఆ పీఎస్‌ పరిధిలోని అనుపానువులు పసిగట్టి స్పెషల్‌ బ్రాంచి అధికా రులకు తెలియజేస్తే నేరుగా ఎస్పీ చెవికి చేర తాయి. అయితే పోలీస్‌ నిఘా వృత్తేతర కార్యక్ర మాలకు ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలున్నాయి. ఈగిల్‌ టీం, నిఘా విభాగం ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నాయి. కనీసం నగరాలను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోని రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లలో జరుగుతున్న అసాంఘిక పార్టీలపై కూడా నిఘా ఉండడం లేదంటే.. ఆ పరిస్థితులే మణిదీప్‌ వంటి వారి దందాలకు ఊతంగా మారాయని చెప్పక తప్పదు. మరోవైపు ఎక్సైజ్‌ పోలీసులు మద్యం వ్యా పార ప్రక్రియలో బిజీగా ఉంటున్నారు.

Updated Date - Aug 27 , 2025 | 12:46 AM