మేలో ముహూర్తం!
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:30 AM
సామర్లకోట-అచ్చంపేట- కాకినాడ పోర్టు మధ్య ఏడీబీ రోడ్డు త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.
సామర్లకోట-కాకినాడపోర్టు నాలుగు వరుసల రహదారి ప్రారంభం ఖరారు
మే నాటికి మొత్తం పనులన్నీ పూర్తికి హైవే అథారిటీ కసరత్తు
ఈ ఆగస్టుకే పనులన్నీ పూర్తికావలసి ఉన్నా ఫ్లైయాష్ సమస్యతో జాప్యం
ఇప్పటికే సామర్లకోట, అచ్చంపేటలో మూడు చోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తి
రూ.548 కోట్లతో 26 కిలోమీటర్లమేర 2023 ఆగస్టులో మొదలైన పనులు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
సామర్లకోట-అచ్చంపేట- కాకినాడ పోర్టు మధ్య ఏడీబీ రోడ్డు త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఏడాది మేనాటికి దీనిని ప్రారంభించేందుకు అధికారులు ము హూర్తం ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు లేన్ల లో భాగంగా స్ట్రక్చర్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయిపోయింది. నాలుగులైన్ల రోడ్లు నిర్మాణమే చకచకా కదలాల్సి ఉంది. 2023లో రూ.548కోట్లతో కేంద్రం 26కిలోమీటర్ల మేర ఏడీబీ రహదారిని నాలుగులేన్ల విస్తరణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది.
కీలక నిర్మాణాలన్నీ చకచకా...
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజానగరం వద్ద ఎన్‌హెచ్ 16 నుంచి కాకినాడ పోర్టు వరకు ఏడీబీ రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారి మీదు కాకినాడ యాంకరేజ్,డీప్‌వాటర్ పోర్టులకు ఆంధ్ర, తెలంగాణ, ఒడిషా, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వందలాది లారీలు బియ్యం, గ్రానైట్, ఎరువులతోపాటు రకరకాల కార్గో ఎగుమతి, దిగుమతుల కోసం నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో రాజానగరం ఏడీబీ రోడ్డు నుంచి సామర్లకోటకు చేరుకోగానే అక్కడి నుంచి పోర్టు వరకు రహదారి నరకప్రాయంగా మారింది. దీంతో పోర్టు కు రాకపోకలు సాగించే వాహనాలతోపాటు కాకినాడ నగరం లోకి వచ్చిపోయే వాహనదారులకూ తీవ్ర ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. రాత్రయితే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో భారతమాల ప్రాజెక్టులో భాగంగా సామర్లకోట నుంచి కాకినాడ పోర్టు వరకు ప్రస్తుతం ఉన్న ఇరుకు రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించడానికి హైవే అథారిటీ 2023లో ప్రతి పాదనలు సిద్ధం చేయగా, దీనికి కేంద్రం ఆమోదం తెలిపి టెం డర్లు పిలిచింది. ప్యాకేజీ-1 కింద సామర్లకోట నుంచి అచ్చంపేట వరకు 12.5 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి కాంట్రా క్టును రూ.408కోట్లకు భారతీయ రైల్వేకు చెందిన రైల్ వికాస్ నిగం (ఆర్‌వీఎన్‌ఎల్) సంస్థ దక్కించుకుంది. ఈసంస్థ 2023 ఆగస్టులో హైవే అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పనులు మొదలుపెట్టడానికి రంగంలోకి దిగగా, పాత అలైన్‌మెంట్ ప్రకా రం సామర్లకోటలో వందలాది ఇళ్లను కూల్చాల్సి వస్తోంది. పక్క నే రైల్వే ట్రాకులు, ఆర్వోబీ అడ్డం వస్తున్నాయి. వీటన్నింటిని తొలగిస్తే ఖర్చు పెరిగిపోతుందనే భయంతో హైవే అధికారులు అలైన్‌మెంట్ మార్చి కొత్త బైపాస్ రహదారి ఖరారు చేశారు. రాక్‌సిరామిక్ నుంచి ఎఫ్‌సీఐ గోదాము అక్కడి నుంచి షుగర్ ఫ్యాక్టరీ వెనుక నుంచి కొత్తగా నాలుగు వరుసల రహదారి ప్రతిపాదించారు. రైల్వేస్టేషన్ ఆర్వోబీ దాటిన తర్వాత గోదావరి కాలువ మీదుగా సామర్లకోట ప్రస్తుత రోడ్డుకు కొత్త హైవే కలు పుతున్నారు. అక్కడి నుంచి ఉండూరు మీదుగా అచ్చంపేట వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తున్న్తారు.మొత్తం 12.5కి.మీ. నాలుగు లేన్లలో రాక్‌సిరామిక్ నుంచి ఉండూరు వరకు పూర్తిగా ఆరు కిలోమీటర్లు కొత్తగా రహదారి నిర్మిస్తుండగా, అక్కడి నుం చి అచ్చంపేట వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసలకు విస్తరిస్తున్నారు. ఈ అలైన్‌మెంట్‌మెంట్ మార్పుతో రహదారి పనులు చాలాకాలం ఆగిపోయాయి. మార్చిన అలైన్‌మెంట్ కోసం 54 హెక్టార్లు భూమి సేకరించాల్సి వచ్చింది. ఇందులో 21 హెక్టార్లు ప్రభుత్వ భూమి, ఆరు గ్రామాల్లో 33 హెక్టార్లు ప్రైవేటు భూమి తీసుకున్నారు. ఇందుకోసం పరిహారం కింద హైవే అధి కారులు రూ.240కోట్లు చెల్లించారు. ఈ చిక్కుముళ్లన్నీ తొలగించి ఏడాదిన్నర కిందట పనులు ముమ్మరం చేయగా, ప్రస్తుతం 70శాతం పూర్తయ్యాయి. నాలుగు వరుసల్లో అత్యంత కీలకమైన సామర్లకోట రాక్‌సిరామిక్, అచ్చంపేటవైపు వెళ్లే పాత ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి, అచ్చంపేటలో మరో ఫ్లైఓవర్ అన్నీ పూర్తయిపోయాయి. ఇవికాకుండా 23చోట్ల కల్వర్టుల నిర్మా ణం కూడా పూర్తయింది. అనేకచోట్ల నాలుగు వరుసల కోసం ఉన్న రోడ్డును ఇరువైపులా తవ్వి నిర్మాణంకోసం సిద్ధమయ్యారు. మిగిలిన 30శాతం పనుల కింద రహదారి నిర్మాణమే జర గాల్సి ఉంది. అయితే నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి, ఆర్వోబీలు,ఫ్లైఓవర్ల అను సంధానానికి అత్యంత కీలకమైన ఫ్లైయాష్ సరిపడా లభ్యత లేక పనులు కొంతకాలంగా నిలిచిపోయాయి. డిసెంబరు నాటికే మొత్తం పనులు పూర్తికావలసి ఉండగా, ఈ సమస్యతో పనులు కదలడం లేదు. ఈ పనులకు మొదటినుంచీ విశాఖలోని ఎన్టీపీసీ ఽథర్మల్ విద్యుత్ కేంద్రం ఫ్లైయాష్ సరఫరా చేస్తోంది. కానీ ఉన్నట్టుండి కొరత పేరుతో సరఫరా నిలిపివేసింది. దీంతో తాజాగా అధికారులు విశాఖలోని హిందూజాను సంప్రదిం చగా, సరఫరా విషయమై చర్చలు కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి ఫ్లైయాష్ రాగానే రహదారి పనులు వేగ వంతం చేయనున్నట్లు అధికారులు వివరించారు. ప్యాకేజీ -2 కింద అచ్చంపేట జంక్షన్ కాకినాడ యాంకరేజ్ పోర్టు వరకు 13.2 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి సైతం చివరి దశకు వచ్చింది. ఆర్‌కే ఇన్‌ఫ్రా అనే కంపెనీ ఈ కాంట్రాక్టు దక్కించుకగా, ఆచివర నుంచి ఈచివరి వర కు కొత్త రహదారి కోసం ఇరువైపులా తవ్వి తారుమినహా అంతా సిద్ధం చేశారు. అయితే అక్కడక్కడా డ్రైన్ల అను సంధానం, రహదారికి ఇతర రోడ్లను కలిపే చోట్ల నావికా దళానికి చెందిన భూములు తగులుతున్నాయి. నేవీ అధికారులతోను ఎన్‌హెచ్ సంప్రదింపులు జరుపుతోంది.