Share News

దివాన్‌'చెరువు' వెలవెల

ABN , Publish Date - May 17 , 2025 | 01:06 AM

నిర్వహణ లేకపోవడం, ఆక్రమణలు కారణంగా దివాన్‌చెరువులోని ఊరచెరువు వెలవెలబోతోంది. దీనికి తోడు చెరువులో గుర్రపుడెక్క పెరిగిపోవడంతో చెరువు రూపు కోల్పోయింది. దీనితో తమ ఊరిపేరులోనే తప్ప ఊరిలో కనీసం ఒక్క చెరువు అయినా లేదంటూ పలువురు ఛలోక్తులు విసురుతున్నారు.

దివాన్‌'చెరువు' వెలవెల
గుర్రపుడెక్కతో నిండిన దివాన్‌చెరువు ఊరచెరువు

  • గ్రామ పాలకులు, అధికారుల నిర్వహణ లేమి

  • భారీగా పెరిగిన గుర్రపుడెక్క

  • ఊరచెరువు గర్భంలో ఆక్రమణలు

  • సుమారు రెండెకరాల విస్తీర్ణంలో చెరువు అన్యాక్రాంతం

  • పట్టించుకోని పాలక వర్గాలు, అధికార యంత్రాంగం

దివాన్‌చెరువు, మే 16(ఆంధ్రజ్యోతి): నిర్వహణ లేకపోవడం, ఆక్రమణలు కారణంగా దివాన్‌చెరువులోని ఊరచెరువు వెలవెలబోతోంది. దీనికి తోడు చెరువులో గుర్రపుడెక్క పెరిగిపోవడంతో చెరువు రూపు కోల్పోయింది. దీనితో తమ ఊరిపేరులోనే తప్ప ఊరిలో కనీసం ఒక్క చెరువు అయినా లేదంటూ పలువురు ఛలోక్తులు విసురుతున్నారు. చెరువును అభివృద్ది చేసి లీజుకు ఇవ్వడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ అధికార్లు గాని, పాలకులు గాని ఎందుచేతనో దానిని పట్టించుకోవడం లేదు. దివాన్‌చెరువులో జాతీయ రహదారిని ఆనుకుని పాలచర్ల వెళ్లే రోడ్డులో దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఊరచెరువు ఉంది. అందులో దాదాపు రెండు ఎకరాలు మేర వివిధ నిర్మాణాలతో ఆక్రమణలకు గురైంది. అయితే గతంలో గ్రామ ప్రజలకు, పశువులుకు నీటివనరుగా ఉపయోగపడిన ఈ చెరువును గతకొంతకాలంగా పాలకులు ఎందుచేతనో పట్టించుకోవడం మానివేశారు. దీంతో ఈ చెరువు గర్భంలో ఆక్రమణలు పెరిగిపోగా, చెరువు అంతా గుర్రపు డెక్క దట్టంగా పెరిగిపోయింది. దీంతో చెరువు కళ తప్పి నిరుపయోగంగా తయారైంది. గతంలో తమ చిన్నతనంలో ఈ చెరువు వద్ద ప్రత్యేకంగా కాపలాదారులు ఉండేవారని కనీసం కాళ్లు కడుక్కునేందుకు కూడా చెరువులో దిగనిచ్చే వారు కాదని కొంతమంది గ్రామస్థులు తెలిపారు. అనంతరం డ్రైనేజీ నీటిని చెరువులోకి మళ్లించడం, బోర్లు రావడం వంటి కారణాలతో ఈ చెరువు నిర్లక్ష్యానికి గురైందని వాపోయారు. ప్రస్తుతం గ్రామం అభివృద్ధి చెందుతోందని, దీనికి తోడు చాలామందికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెరుగుతోంది. ఈ క్రమంలో చెరువు లో పెరిగిన గుర్రపుడెక్కను తొలగించడంతో బాటు చెరువును ఆధునీకరించి పర్యాటకులను సైతం ఆకర్షించే విధంగా సుందరీకరణ చేయాలని స్థానిక సామాజిక కార్యకర్త సూరారపు డేవిడ్‌రాజు కోరారు. ఈ ఊర చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసి, పార్క్‌ నిర్మించి చెరువులో బోటుషికారు కూడా కల్పిస్తే ఎంతో బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - May 17 , 2025 | 01:10 AM