ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే నూతన విద్యా విధానం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:26 AM
ప్రభుత్వ పాఠశాలలు వినూత్న రీతిలో విద్యార్థులను ఆకర్షించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు.
అమలాపురం టౌన్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు వినూత్న రీతిలో విద్యార్థులను ఆకర్షించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు మీకు ఆహ్వానం అంటూ నూతన పద్ధతిలో ప్రచారం చేపట్టారు. ఎక్కడికో ఎందుకు దండగ. ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగా.. ఫీజులు ఎందుకు దండగా ఇంగ్లీషు మీడియం మన ఊరిలో ఉండగా అంటూ నారాయణపేటలోని శ్రీలాల్‌బహుదూర్‌శాస్ర్తి మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బీవీఎస్‌సీ పోలిశెట్టి, చైర్మన్ పేకేటి సత్యవాణిల ఆధ్వర్యంలో కరపత్రాలతో ప్రచారం చేపట్టారు. మంగళవారం పాఠశాల ప్రాంగణంలో నిర్వహణ కమిటీ తల్లిదండ్రుల సమావేశం పోలిశెట్టి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉప విద్యాశాఖాధికారి గుబ్బల సూర్యప్రకాశం, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని డీవైఈవో పేర్కొన్నారు. నాణ్యమైన గుణాత్మక విద్య అర్హులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని కమిషనర్ రాజు పేర్కొన్నారు. అనంతరం పాఠశాల తరపున ముద్రించిన బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో సరెళ్ల దుర్గాదేవి, స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ పేకేటి సత్యవాణి, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.ప్రభాకర్, సీఆర్పీ ఎం.అనూష, ఉపాధ్యాయులు కె.విజయకోమలి, డి.దుర్గారావు, సరాగుల గోపీరాజు, డి.షర్మిళతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.