డిప్యూటీ సీఎం ఇలాకా.. ఇన్‌చార్జిల జమానా
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:28 AM
కీలకమైన అధికారులకు అదనపు బాధ్యత లు.. ఆపై పనిఒత్తిడి.. భర్తీ కాని పోస్టులు ఇది డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పరిస్థితి. ఇన్‌చార్జిల ఏ లుబడిలో పాలనతో ఇబ్బందికరంగా మారింది.
అధికారులపై పని ఒత్తిడి
కీలక అధికారులకు అదనపు బాధ్యతలు
(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)
కీలకమైన అధికారులకు అదనపు బాధ్యత లు.. ఆపై పనిఒత్తిడి.. భర్తీ కాని పోస్టులు ఇది డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పరిస్థితి. ఇన్‌చార్జిల ఏ లుబడిలో పాలనతో ఇబ్బందికరంగా మారింది.
పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు మె రుగైన సేవలందించడంతోపాటు పేదరిక ని ర్మూలన, అభివృద్ధికార్యక్రమాలపై ప్రత్యక్ష పర్య వేక్షణ కోసం రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ని యోజకవర్గం కుప్పం తర్వాత ఇక్కడే పిఠాపు రం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పా టుచేశారు. దీనికోసం పలు ప్రాంతాల్లో ఆర్డీవో గా పనిచేసిన ఎ.చైత్రవర్షిణిని పాడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు. జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ చైర్మన్‌గా ఉన్నారు. 21శాఖలను పా డా పరిధిలోకి తీసుకురావడంతో అధికారులు, సిబ్బందిపై పూర్తి పర్యవేక్షణ వారికే అప్పగించారు.అధికారుల బదిలీలు, డిప్యూటేషన్లు కూ డా పాడా అంగీకారంతోనే జరపాలని, ప్రత్యామ్నాయ అధికారులు రాకుండా ఇక్కడ పనిచేస్తున్న వారిని రిలీవ్ చేయవద్దని ప్రభుత్వం పాడా ఏర్పాటు జీవోలో స్పష్టం చేసింది. ఇం తవరకూ బాగానే ఉన్నా పాడా ఏర్పాటు తర్వా త కూడా పలువురు అధికారుల బదిలీ, డిప్యూ టేషన్‌పై వెళ్లినా, ఉద్యోగ విరమణ చేసినా కొత్త అధికారులను నియమించలేదు. దీంతో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. పాడా పీడీగా ఉన్న చైత్రవర్షిణి కూడా జిల్లా పర్యాటక శాఖాధికారి ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్నారు.
రెండు చోట్ల ఒక్కరే..
నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలు ఉన్నాయి. గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనరుగా ఉన్న రవికుమార్ ఉద్యోగ విరమణ చేయడంతో నాలుగున్నర నెలల క్రి తం పిఠాపురం మునిసిపల్ కమిషనరు నామ కనకరావును ఇన్‌చార్జిగా నియమించారు. అ ప్పటినుంచే రెండుచోట్ల ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తున్న నేపథ్యంలో పనుల పర్యవేక్షణ, ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణ భారం ఆయనపై పడింది.
తహసీల్దారు.. ఎంపీడీవోలూ అంతే..
గొల్లప్రోలు తహసీల్దారుగా పనిచేసిన సత్యనారాయణ జూన్ నెలాఖరుకు ఉద్యోగ విరమ ణ చేయగా అప్పటినుంచి పిఠాపురం తహసీల్దారు గోపాలకృష్ణ ఇక్కడ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. పిఠాపురం ఎంపీడీవో చినబాబు బదిలీకాగా గొల్లప్రోలు ఎంపీడీవో కర్రి స్వ ప్న ను ఇన్‌చార్జిగా నియమించారు. కొత్తపల్లి డి ప్యూటీ ఎంపీడీవో సత్యకృష్ణారెడ్డికి ఎంపీడీవో గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన నాలుగు పదవుల్లో ఇన్‌చార్జిలే కొనసాగుతుండడంతో ఆ ప్రభావం పాలనపై పడింది.
ఎంఎస్‌వోలదీ అదే పరిస్థితి..
చౌకధరల దుకాణాల నిర్వహణ పర్యవేక్షించే పిఠాపురం ఎంఎస్‌వో శ్రీనివాస్ పాడా కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తుండ గా పెద్దాపురం ఎంఎస్‌వో భారతికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. గొల్లప్రోలు ఎంఈ వో-1 వెంకటేశ్వరరావుకు కాకినాడడివిజన్ ఉప విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వ ర్తిస్తున్నారు. పిఠాపురం ఎంఈవో-1 ఇన్‌చార్జిగా బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్లస్ హెచ్‌ఎం శ్యాంబాబు, చేబ్రోలు సెరీకల్చర్ ఆఫీసర్ ఇన్‌చార్జిగా ఏఎస్‌వో సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. పిఠాపురంలో ఇరిగేషన్ ఏఈ పోస్టు ఒకటి ఖాళీగా ఉంది.
వైద్యులదీ అంతే..
గొల్లప్రోలు మండలం చేబ్రోలు పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యాధికారులను బదిలీ చేశారు. ఏజెన్సీ నుంచి ఇద్దరిని నియమించినా వారు ఇంకా విధుల్లో చేరలేదు. దీనితో రెండు న్నర నెలలుగా వైద్యులు లేని పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాలనుంచి ఒక వైద్యుడిని పంపి సేవలందేలా చూస్తున్నారు. గొల్లప్రోలు రూర ల్ పీహెచ్‌సీలో ఒక వైద్యురాలే పనిచేస్తున్నా రు. ఇక్కడ మరో పోస్టు ఖాళీగా ఉంది. పిఠాపురం సీహెచ్‌సీలో వైద్యులు ఉన్నా అదనంగా స్టాఫ్‌నర్సులను నియమించాల్సిన అవసరం ఉంది. పిఠాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు ఒక ఎస్‌ఐ మాత్రమే ఉన్నారు. అదనపు ఎస్‌ఐ, ట్రాఫిక్ ఎస్‌ఐ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గొల్లప్రోలు, పిఠాపురం టౌన్, రూరల్, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగాఉండడంతో వారిపైనే భారంపడుతోంది.
కీలక పోస్టులు ఖాళీ
పిఠాపురం పురపాలక సంఘంలో కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అ త్యంత ప్రధానమైన పట్టణ ప్రణాళిక విభాగంలో టీపీవో మాత్రమే ఉన్నారు. రెండు టీపీఎస్, రెండు టీపీబీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పట్టణంలో అక్రమ కట్టడాలను నిరోధించలేని పరిస్థితి ఉంది. మరో కీలకమైన రెవెన్యూ విభాగంలో మునిసిపల్ రెవెన్యూ అధికారి, రెండు ఆర్‌ఐ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇన్‌చార్జిలతో నెటుకొస్తున్నారు. పారిశుధ్య విభాగంలో ఒక శానిటరీ సూపర్‌వైజరు, ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్ మాత్ర మే ఉన్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఏఈ పోస్టు ఖాళీగా ఉంది. గొల్లప్రోలు నగర పంచాయతీలో మేనేజరుగా పనిచేస్తున్న రామప్రసాద్ తెనాలి పురపాలక సంఘానికి డిప్యూటేషన్ పై వెళ్లగా అప్పటినుంచి పోస్టు ఖాళీగా ఉం ది. టీపీఎస్, టీపీబీవో పోస్టులతోపాటు రెవె న్యూ అధికారి, ఆర్‌ఐ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఎన్విరాన్‌మెంటల్ ఏఈ, ట్యాప్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని కీలకమైన పోస్టులు ఖాళీ ఉంటే ప్రజలకు పూర్తిస్థాయి లో సేవలు అందించడం, పాలన సజావుగా సాగడం ఎలాగనేది ప్రశ్నార్థకంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తోపాటు జిల్లా కలెక్టర్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలో కీలకమైన పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.