Share News

సరదా.. చంపేస్తోంది!

ABN , Publish Date - May 27 , 2025 | 01:06 AM

వేసవితాపం నుంచి ఉపశమనం పొందడానికో.. సరదాగా నదీస్నానం చేయాలనే ఆకాంక్షతోనో.. గోదావరి నదిలోకి వెళ్లి కొందరు యువకులు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సరదాగా స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం

సరదా.. చంపేస్తోంది!
సలాదివారిపాలెం వద్ద ఎనిమిది మంది యువకులు గల్లంతైన ప్రదేశం

గోదావరి నదిలో స్నానాలకు దిగి

గల్లంతవుతున్న యువకులు

గాలింపు చర్యల్లో విగతజీవులుగా

తేలుతున్న ఘటనలు

ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల వల్లే ఇంత అనర్థం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

వేసవితాపం నుంచి ఉపశమనం పొందడానికో.. సరదాగా నదీస్నానం చేయాలనే ఆకాంక్షతోనో.. గోదావరి నదిలోకి వెళ్లి కొందరు యువకులు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సరదాగా స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధి సలాదివారిపాలెం వద్ద గౌతమీ నదిలో ఎనిమిది మంది యువకులు సోమవారం గల్లంతయ్యారు. గత కొంతకాలం నుంచి కోనసీమ జిల్లాలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్థగౌతమీ నదీపాయల్లో తరచూ ఈ తరహా ఘటనల్లో అనేకమంది యువకులు, వ్యక్తులు గల్లంతై విగతజీవులుగా మారుతున్నారు. ముఖ్యంగా గోదావరి నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా తవ్వడం వల్ల ఎక్కడికక్కడే గోదావరి నదీ ప్రవాహ వేగాలు మారడం, లోతులు తెలియకపోవడం, ఎక్కడ గొయ్యి ఉందో తెలియని పరిస్థితుల్లో సరదాగా స్నానానికి వెళ్లేవారు విగతజీవులవుతున్నారు.

గతంలో జరిగిన సంఘటనలెన్నో...

సలాదివారిపాలెంలో ఎనిమిది గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పరిధిలో ఇటీవల, గతంలోను జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌ 5న కపిలేశ్వరపురం మండలంలోని కేదార్లంకలో స్నానానికి వెళ్లి కొత్తపేటకు చెందిన రొట్టా దుర్గాప్రసాద్‌ (21), ఈనెల 6న వీధివారిలంకలో మండపేటకు చెందిన దాసరి సాయిరామ్‌ (28), మొండెం రాంబాబు (30)లు గల్లంతై మృత్యువాత పడ్డారు. అలాగే గతంలో ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో కూడా నదిలో పలువురు యువకులు గల్లంతయ్యారు. అదేవిధంగా గతంలో రాజమహేంద్రవరం సమీపంలో దేవీపట్నం లో జరిగిన లాంచీ ప్రమాదంలో 46 మంది మృ త్యువాత పడిన సంఘటన కళ్లెదుట నుంచి చెరగకముందే 2018 జూలై 14న ఐ.పోలవరం మండలం పశువుల్లంక మొండివద్ద గోదావరిలో జరిగిన పడవ మునిగిన ఘటనలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారిలో ఐదుగురి ఆచూకీ లభ్యం కాగా ముగ్గురు ఆచూకీ అప్పటి నుంచి లభ్యం కాలేదు. అయితే వీరంతా కమిని శివారు సలాదివారిపాలేనికి చెందిన విద్యార్థులే. కాగా 1993 మధ్యకాలంలో ఐ.పోలవరం మండలం కేశనకుర్రు వద్ద ఇదే గోదావరిపాయలో పడవ మునిగి కొంతమంది మృత్యువాత పడిన విషయం విధితమే. ఆ తర్వాత పడవ దాటింపు విషయంలో కొంతకాలం జాగ్రత్తలు పాటించడం జరిగింది. ఆ సమయంలో పశువుల్లంక మొండి వద్ద జరిగిన పడవ ప్రమాదానికి పరిమితికి మించి వాహనాలు, సైకిళ్లు పెట్టడం వల్లే ఆనాడు ప్రమాదం జరగడానికి కారణంగా అధికారులు గుర్తించారు.

ఇటీవలే ఐదుగురు విగతజీవులై..

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో గోదావరిలో స్నానానికి దిగిన ఐ దుగురు యువకులు గల్లంతై విగతజీవులయ్యారు. ఇక్కడ కూడా వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల కారణంగా ఏర్ప డిన గోతుల్లో మునిగిపోయారు. గోదావరి నదుల్లో ఇష్టానుసారంగా ఎక్కడికక్కడే ఇసుక తవ్వకాలు అనుమతులతో సంబంధం లేకుండా లోతుగా తవ్వేయడం వల్ల నదీపాయలో ఎక్కడ అడుగు వేస్తే అక్కడ గల్లంతయ్యే పరిస్థితులు కోనసీమ జిల్లాలోని నదీపాయల్లో అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే వ్యక్తులకు అవగాహన లేకపోవడంతో స్నానాలకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Updated Date - May 27 , 2025 | 01:06 AM