ఆయు..వేగం!
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:17 AM
చిన్నపాటి నిర్లక్ష్యం జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది.. కుటుంబాలను తీరని దుఃఖంలో ముంచేస్తోంది..

యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం
3 నెలల్లో 75 మంది వరకూ మృతి
అంతా 18 నుంచి 30 ఏళ్ల లోపువారే
రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు
ఎక్కువ సీసీ బైక్‌లే కారణం
తల్లిదండ్రులూ తగ్గించాల్సిందే మరి
అమలాపురం/రాజమహేంద్రవరం/పిఠాపురం, మార్చి 10(ఆంధ్రజ్యోతి) :చిన్నపాటి నిర్లక్ష్యం జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది.. కుటుంబాలను తీరని దుఃఖంలో ముంచేస్తోంది.. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే చూస్తే కనురెప్పల మాటున కన్నీటిని అదిమిపెట్టుకుని జీవచ్ఛవాల్లా బతుకుతున్న వారెందరో.. కష్టాలు తీరుస్తాడని.. తమకు అండగా ఉంటాడని.. తమను పున్నామి నరకం నుంచి తప్పిస్తాడని ఎదురుచూస్తుంటే.. చేతికందివచ్చిన కొడుకు లేడు.. ఇక తిరిగి రాడంటే ఎంత కష్టం.. ఆ బాధను ఆపడం ఎవరితరం.. అయితే ప్రస్తుత యువత మాత్రం ఇవేమీ ఆలోచించడం లేదు.. వాయువేగంగా వెళ్లిపోతున్నారు.. 18 నుంచి 30 ఏళ్ల మధ్యే ప్రాణాలను బలిపెడుతున్నారు.. ఈ మూడు నెలల్లోనే సుమారు 75 మంది యువత మృత్యువాతపడింది. ఈ ఆయువేగానికి కారణం ఎవరు.. ముందు తల్లిదండ్రులే. స్టేటస్ పేరుతో ఎక్కువ సీసీ బైక్‌లు కొనిచ్చేస్తున్నారు.. ఉడుకురక్తం.. ఆ బైక్‌పై రయ్ రయ్‌మంటూ వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. తల్లిదండ్రులూ యువతే కాదు.. మీ పిల్లలకు తెలియజెప్పాలి. అతివేగం ప్రమాదమని హెచ్చరించాలి.
రోడ్డు ప్రమాదం జరిగితే జీవితాలు గల్లంతే. ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అప్పటిదాకా సాఫీగా సాగిపోతున్న కుటుంబం ఒడిదుడుకులకు లోనవుతుంది. కానీ.. లేకలేక పుట్టిన కొడుకు, అల్లారుముద్దుగా పెంచుకొన్న కొడుకు, చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం జీవితాంతం దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని రోజులు వెళ్లదీయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అనేక రోడ్డు ప్రమాదాల్లో విద్యార్థులు, యువకులు అత్యధికంగా మృత్యువాతపడ్డారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలన్నీ ఆందోళన కలిగిస్తుండగా, వీరి కుటుంబాలు గర్భశోకంతో తల్లడిల్లిపోతున్నాయి. ఈ విషాద ఘటనల్లో ఎక్కువశాతం అతివేగం లేదంటే ఏమరుపాటు కారణాలవ్వడం గమనించాల్సిన విషయం. అలాగే అత్యధిక ప్రమాదాల్లో మరణిస్తున్న యువకులు హెల్మెట్ ధరించకపోవడమూ మరో కారణం. మద్యం లేదా గంజాయి మత్తులో కొందరు కుర్రాళ్లు రాత్రిళ్లు మితిమీరిన వేగంతో వెళ్లి ఆగి ఉన్న వాహనాలను ఢీకొనడంతో చనిపోతున్న వైనాలు జరుగుతున్నాయి. బైక్ రేసింగ్ మరో కారణంగా కనబడుతోంది. ఇలా అనేక రకాలుగా యువత రోడ్డు ప్రమాదాల్లో మరణించి ఆయా కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తుతున్నారు. దీనిపై అధికారుల పూర్తి పర్యవేక్షణ లేకపోవడం, కొన్నిచోట్ల హెచ్చరికలు చేస్తున్నా యువకులు లక్ష్యపెట్టకపోవడం వల్ల కూడా వారి ప్రాణాలను బలి తీసుకుంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి.
బైక్ ప్రమాదాలే అధికం
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ఉండేవి ద్విచక్ర వాహనాలే. గతేడాది ఒక్క తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పోలీసు రికార్డుల ప్రకారం మొత్తం ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల ఘటనలు 276 ఉండగా.. కార్లు 175, లారీలు 114, ఆటోలు 56, ఆర్టీసీ బస్సులు 24, ప్రైవేటు బస్సులు 17 ఉన్నాయి. జాతీయ రహదారులపై 288, ఇతర రోడ్లపై 243 ప్రమాదాలు జరిగాయి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల నడుమ 90 శాతం ప్రమా దాలు నమోదయ్యాయి. గడిచిన రెండు నెలల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో 35 ఏళ్లలోపు యువకులు 50 మందికి పైగానే మృత్యువాత పడ్డారు. ఇప్పుడు వస్తున్న బైక్‌ల సామర్థ్యానికి, మన రోడ్లకు పొంతన కుదరడం లేదు. ఏకంగా 610 సీసీ సామర్థ్యంతోనూ వస్తున్నాయి. అంటే సెకన్ల వ్యవధిలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇలాంటి బైక్‌లతో మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదం జరిగిన క్షణాల్లో మృత్యువాత పడు తున్నారు. తల్లిదండ్రులు స్టేటస్ పేరుతో అలాంటివే కొనిస్తున్నారు.. హెల్మెట్లు పెట్టుకోవడం లేదు. ఇద్దరికి మించి ప్రయాణిస్తున్నారు. వాహనంపై గర్ల్‌ఫ్రెండ్ ఉంటే మరీ రెచ్చిపోతున్నారు. ప్రమాదంలో ఇద్దరూ చనిపోయిన ఘటనలు ఉన్నాయి.
ఒకరి నిర్లక్ష్యం..మరొకరు బలి!
రోడ్డు ప్రమాదాల్లో విద్యార్థులు, యువకుల ప్రాణాలు బలైపోతున్న ఘటనల్లో ఎదుటి వాహనాల వేగం, నిర్లక్ష్యమూ శాపంగా మారుతోంది. కాలేజీకి వెళుతున్న విద్యార్థుల బైక్‌లను కార్లు, లారీలు, బస్సులు ఢీకొట్టి వెళ్లిపోతున్న ఉదంతాలూ అధికంగానే ఉన్నాయి. జాతీయ రహదారులపైనా, రాజానగరం- సామర్లకోట ఏడీబీ రోడ్డులోనూ జరిగిన ప్రమాదాల్లో పలువురు విద్యార్థులు మరణించారు.
ఒక్క జనవరిలోనే పోయిన ప్రాణాలు
జనవరి 2 : తూర్పుగోదావరి జిల్లా మోరంపూడికి చెందిన లింగం నవీన్(21), సంతోష్ (20) అన్నదమ్ముల బిడ్డలు. వీరు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలో తన స్నేహితుడిని బుధవారం అర్ధరాత్రి ఇంటివద్ద దింపి తిరిగి ఇంటికి వస్తుండగా గండేపల్లి మం డలం మురారి గ్రామ శివారున బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ మృతిచెందారు.
జనవరి 3 : అనపర్తి మండలం పులగుర్త వద్ద మండపేట-రామచంద్రపురం కెనాల్ రోడ్డు లో గురువారం అర్ధరాత్రి దాటాక కంటైనర్‌ను బైక్ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామానికి చెందిన పుచ్చకాయల నవనీత్(22) మృతిచెందాడు.
జనవరి 3 : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని గైట్ కళాశాల సమీపంలో హైవేపై లారీని ఓవర్ టేక్ చేయబోయి బైక్ అదుపుతప్పింది. ఈ ఘటనలో లారీకి హ్యాండిల్ తగిలి బైక్ జారిపడగా రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామానికి చెందిన మంగం భరత్‌చంద్ర(20) లారీ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
జనవరి 4 : కాకినాడ బీచ్‌రోడ్డు లో ఓ కళాశాల బస్సు ఢీకొని వలసపాకలకు చెందిన నిమ్మ మణికంఠ(22) మృతిచెందాడు.
జనవరి 5 : రంగంపేట మండలం వడిశలేరులో ఎదురుగా వస్తున్న వ్యాన్ బైక్‌ను బలంగా ఢీకొట్టిన ఘటనలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23),తోకాడ చరణ్(22) మృతి చెందారు.
జనవరి 11 : కాకినాడ ఘాటీ సెంటర్ చేపల మార్కెట్ వద్దకు ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టిన ఘటనలో కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డేగల రేణుక (18) మృతిచెందింది.
జనవరి 19 : ప్రత్తిపాడు మండలం ధర్మవరం పెట్రోల్ బంకు సమీపంలో బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన రాజమాణి శివ(22) అక్కడికక్కడే మృతి చెందాడు.
జనవరి 20 : రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సెంటర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు నక్క సాయికృష్ణ (23), అతడి మావయ్య కూడా మృతి చెందారు.
జనవరి 20 : కిర్లంపూడికి చెందిన ముక్తా నాగవీరభద్ర దుర్గ (20), పిఠాపురానికి చెందిన దాసరి నిమ్సి చంద్ర (21) సంక్రాంతి పండగకు వచ్చి బైక్‌పై హైదరాబాద్ తిరిగి వెళ్తున్నారు. కృష్ణా జిల్లా గురజాడ సమీపంలో హైవేపై ఫ్లైఓవర్ డివైడర్‌ను వీరి బైక్ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు.
జనవరి 26 : ముమ్మిడివరం బైపాస్ రోడ్డు వై.జంక్షన్‌లో ఎదురెదురుగా రెండు మోటారుసైకిళ్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యువకులు గాయపడగా అయివినల్లి మండలం యలకల్లంకకు చెందిన వడ్డి సిరాజ్(18), మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురానికి చెందిన గెద్దాడ మణికంఠ(20) మృతిచెందారు.
హెల్మెట్ మరవొద్దు మిత్రమా!
ముమ్మిడివరం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): హెల్మెట్ మరచిపోవొద్దు మిత్రమా అంటున్నారు.. ఈ స్నేహి తులు.. ఎందుకో తెలుసా.. మీరే చదవండి.. ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు పంచాయతీ పరిధి బూరుగపేటకు చెందిన మట్టా ఆకాష్‌రెడ్డి ముమ్మిడివరానికి చెందిన దొమ్మేటి జయఅభివన్ గత నెల 28వ తేదీన ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తమ స్నేహితుడు ఆకాశ్‌రెడ్డి హెల్మెట్ లేకపోవడం వల్లే తమకు దూరమయ్యాడని.. హెల్మెట్ ఉంటే బతికి ఉండేవాడని.. అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు పెట్టుకోవాలని చెబుతున్నారు. చెప్పడమే కాదండోయ్.. సోమవారం ముమ్మిడివరంలో 20 మంది కలిసి రూ.25 వేల విలువగల వంద హెల్మెట్లను ముమ్మిడివరం స్టేట్‌బ్యాంకు వద్ద వాహనచోదకులకు ఉచితంగా అందజేశారు.