రూ.788 కోట్లు.. ఏమయ్యాయి!
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:44 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబం ధించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రానురాను తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. బోగస్ రుణాలు.. ఆర్థిక అవకతవకలు డీసీసీబీకి తలనొప్పిగా మారాయి.
మొండిబాకీల బెంగ
23 భారీ కుంభకోణాలు
రూ.600 కోట్ల బకాయిలు
రుణ డాక్యుమెంట్లు బోగస్
అక్రమాలకు సహకారం
గాలికొదిలేస్తున్న అధికారులు
అప్పులు రూ.4250 కోట్లు
వార్షిక వడ్డీ రూ.250 కోట్లు
సొసైటీల కంప్యూటరీకరణ
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబం ధించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రానురాను తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. బోగస్ రుణాలు.. ఆర్థిక అవకతవకలు డీసీసీబీకి తలనొప్పిగా మారాయి. బ్యాంకును ఆర్థికంగా పటిష్టంగా ఉంచడంలో కీలకపాత్ర వహించా ల్సి న సొసైటీలు అనేక అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.బ్యాంకు సొమ్ములను దిగమిం గే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నాయి. దీంతో డీసీసీబీ సొమ్ము చాలా వరకు దొం గల పాలవుతోంది.అప్పుల రూపంలో ఇచ్చిన సొమ్ము వెనక్కు తిరిగి రావడం కలగానే మారుతోంది. ఇప్పటి వరకూ రూ.788 కోట్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తంలో 23 కుంభకోణాలకు సంబంధించిన రూ.188 కోట్ల అవినీతి జరగ్గా.. వీటికి అనుసంధానంగా రూ.600 కోట్ల రుణాలు వసూలు కాకుంగా గుదిబండలా మారాయి. అయితే ఇందులో వసూలు చేద్దామన్నా అసలు తీసుకున్న రుణ గ్రహీతలెవరో తెలియనంతగా దొంగ రుణాలు జారీచేసేశారు. ఈ తరహా అక్రమాలకు చెక్ పెట్టడం కోసం తాజాగా డీసీసీబీ పరిధిలోని అన్ని సొసైటీల రికార్డులను రూ.5.21 కోట్లతో డిజిటల్ విధానంలో ఆధునికీకరించారు.
ఉమ్మడి జిల్లాలో 298 సొసైటీలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కాకి నాడలో డీసీసీబీ ఉంది. దీని కింద కాకినాడ జిల్లాలో 72 సొసైటీలు, తూర్పుగోదావరి జిల్లా లో 49, కోనసీమ జిల్లాలో 166, అల్లూరి జిల్లాలో 11 కలిపి మొత్తం 298 సొసైటీలు ఉన్నాయి. వీటి ద్వారా రైతులకు కావాల్సిన రకరకాల పం ట రుణాలందిస్తారు. ఇప్పటి వరకు కేవలం కాగితాల ఆధారంగానే సొసైటీ రుణాలు జారీ చేసేవారు. ఈ క్రమంలో అనేక కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. అనేక జిల్లాల్లో డీసీ సీబీల ఎన్‌పీఏలు రూ.150 కోట్ల వరకే ఉంటే ఉమ్మడి జిల్లా డీసీసీబీకి మాత్రం రూ.788 కోట్ల వరకు ఉండడంతో ఏ స్థాయిలో డీసీసీబీని అక్ర మార్కులు పిండేశారో అర్ధం చేసుకోవచ్చు. ఈ మొండిబాకీలు ఎప్పటికీ రావనే ఆలోచనతో అధికారులు ఆశలు వదిలేసుకున్నారు.
23 కుంభకోణాలు..
డీసీసీబీ ద్వారా జారీ చేసే రుణాల్లో అసలు రైతులకు ప్రయోజనం చేకూరేది పిసరంత.. కొందరు నేతలు, అక్రమార్కులకు డీసీసీబీ బం గారుబాతులా మారింది. తమ పలుకుబడి, అధికారాలతో అనేక మంది నేతలు డీసీసీబీ రుణాలను బోగస్ వ్యక్తులకు ఇప్పించి వాటిని స్వాహా చేసేశారు. ఇప్పటి వరకు 23 రకాల కుంభకోణాలు జరగ్గా అందులో కాకినాడ జిల్లా లోని కిర్లంపూడి, ఏలేశ్వరం సహకార సొసైటీల పరిధిలోని స్కాంలే రూ.150 కోట్ల వరకు ఉన్నాయి.కిర్లంపూడి సొసైటీలో అవినీతే రూ.104 కోట్లు. సొసైటీ అధికారులు కొందరు అక్రమా ర్కులతో కుమ్మక్కై రుణాలు జారీ చేసి డబ్బు నొక్కేశారు. అటు ఏలేశ్వరం సొసైటీకి సంబంఽ దించి రూ.46 కోట్ల అవినీతి జరిగింది. జగ్గం పేట,గండేపల్లి సొసైటీల్లోను ఇదే తీరు. కోన సీమ జిల్లా అల్లవరం మండలం డి.రావుల పా లెం, మల్కిపురం మండలం లక్కవరం, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరం గపట్నం, సీతానగరం మండలం వెదుళ్లపల్లి, తాళ్లపూడి మండలం రాగోలపల్లి తదితర సొసై టీల్లోను అవకతవకలు జరిగాయి. ఈ అవినీతి కారణంగా రూ.600 కోట్లు నిరర్ధక ఆస్తులుగా మారినట్టు అధికారులు ఇటీవల గుర్తించారు. కుంభకోణాలకు తోడు ఆయా ప్రాంతాల్లో రైతుల పేరుతో జారీ చేసిన రుణాలు బోగస్‌గా ఉన్నట్టు గుర్తించారు. రికార్డుల్లో ఉన్న పేర్ల ఆధారంగా రికవరీకి ప్రయత్నిస్తుంటే అసలు ఆ పేరుతో ఉన్న రైతులే లేరు. దీంతో ఇప్పుడు ఏంచేయాలో అధికారులకు అర్ధం కావడం లేదు. మొత్తం రూ.788 కోట్లు నిరర్ధకంగా మారడంతో అసలు అవి వస్తాయన్న నమ్మకం కూడా డీసీసీబీ అధి కారులకు సడలిపోయింది. రూ.188 కోట్ల అవి నీతికి సంబంధించి డబ్బులు మొక్కేసిన వారిని గుర్తించి ఆస్తుల రికవరీకి ప్రయత్నిస్తుంటే చాలా మంది న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు తేవడంతో అధికారులు మొండి బాకీల జోలికి వెళ్లడం లేదు. దీంతో డీసీసీబీ ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది.
ఇకనైనా ఒడ్డున పడేనా..
ఉమ్మడి జిల్లా డీసీసీబీ పరిధిలో 298 సొసై టీలు ఉన్నాయి. ఇప్పటికీ పాతపద్ధతిలోనే పుస్త కాలపై లావాదేవీలు సాగుతున్నాయి. దీంతో బోగస్ రుణాల జారీ,నిధుల దుర్వినియోగం భారీగా ఉంటోంది. తద్వారా అనేక అక్రమాలకు తావిస్తోంది.ఈ నేపథ్యంలో సొసైటీల రికార్డు ల ను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేశారు. ఒక్కో సొసైటీకి రూ.1.75 లక్షల చొప్పున రూ.5.21 కోట్ల తో ఆధునీకీకరించారు.ప్రతి లావా దేవీ కంప్యూ టరీకరణ జరిగేలా చేశారు. దీంతో అక్రమాలకు ఏ మేరకు అడ్డుకట్టపడుతుందో చూడాలి.
అప్పుల కుప్ప...
రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో వ్యసాయ రుణా లు అధికంగా ఇవ్వడంలో ఒకప్పుడు డీసీసీబీకి పేరు.కానీ ఇప్పుడు బోగస్ రుణాలు, మొండిబాకీలతో అష్టకష్టాలు పడుతోంది. ఇచ్చిన రుణాల వసూళ్లలో అలసత్వంతో బ్యాంకు మనుగడే కష్టంగా మారింది. ఇటీవల గుర్తించిన లెక్కల ప్రకారం డీసీసీబీకి మొత్తం అప్పులు రూ.4250 కోట్లుగా తేలాయి. వీటికి సంబంధించి ఏటా వడ్డీని డీసీసీబీ రూ.250 కోట్లు చెల్లిస్తుం దంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
రాగోలపల్లి సొసైటీపై ఫిర్యాదు
తాళ్లపూడి, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం రాగోల పల్లి సొసైటీ పరిధిలోని పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు. సొసైటీలో తమకు ఎటువంటి బకాయిలు లేనప్పటికీ తమ పేరుమీ బాకీలు ఉన్నట్టుగా చూపుతున్నారని పలువురు సోమవారం కలెక్టర్ ప్రశాంతి, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితను కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు. సొసైటీలో ఖాతాదారులైన ఖండవల్లి మాణిక్యం, కాకర్ల మంగాయమ్మ, ఈరోతు లక్ష్మి తదితరులు రాజమహేంద్రవరం కలెక్టరు కార్యా లయంలో ఫిర్యాదు చేశారు.అవకతవకలపై పూర్తి విచారణ జరపాలని కోరినట్టు తెలిపారు.