ధవళేశ్వరం-బొబ్బర్లంక మత్స్యకార సంఘాల వివాదంపై కీలక సమావేశం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:47 AM
అమలాపురం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రొయ్య పిల్లల సీడు సేకరణ విషయంలో రెండు జిల్లాల సరిహద్దుల్లో మత్స్యకార సంఘాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమక్షంలో మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో కీలక సమావేశం జరిగింది. బొబ్బర్లంక, ధ
పరిష్కార దిశగా ఇరు జిల్లాల జేసీలు సూచనలు
అమలాపురం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రొయ్య పిల్లల సీడు సేకరణ విషయంలో రెండు జిల్లాల సరిహద్దుల్లో మత్స్యకార సంఘాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమక్షంలో మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో కీలక సమావేశం జరిగింది. బొబ్బర్లంక, ధవళేశ్వరం మత్స్యకార సంఘాల మధ్య రొయ్య పిల్లల సీడు సేకరణ సరిహద్దుల పరంగా నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఇరు జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. అమలాపురంలో కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతిలు జలవనరులు, మత్స్యశాఖ, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు.
రెండు దశాబ్దాలుగా...
గత రెండు దశాబ్దాలుగా నెలకొన్న బొబ్బర్లంక, ధవళేశ్వరం మత్స్యకారుల మధ్య రొయ్యల పిల్లల సేకరణ సరిహద్దు వివాదంపై పూర్వోపరాలను శాఖల వారీగా సమీక్షించారు. ప్రస్తుతం ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధుల లీజు దరఖాస్తు అంశంపై కోర్టును ఆశ్రయించడం జరిగిందని, కోర్టు ఆదేశాల మేరకు సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కమిటీ నుంచి నివేదికను కోరడం జరిగిందని బొబ్బర్లంక మత్స్యకార సహకార సంఘంగా ఏర్పడి ఉండలేదని, కేవలం ధవళేశ్వరం మత్స్యకారుల సహకార సంఘం రెండు రకాల రొయ్య సీడును బ్యారేజీ నుంచి లీకయ్యే వాటరు ద్వారా గోడలు, గేట్లపై నుంచి మత్స్యకారులు సేకరించడం జరుగుతుందన్నారు. ఈ రొయ్య సీడును చెరువులో అభివృద్ధి చేస్తూ తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకు రొయ్యల పెంపంకం కోసం విక్రయించడం జరుగుతుందన్నారు. ధవళేశ్వరం వద్ద 70 గేట్లను ధవళేశ్వరం మత్స్యకార సంఘం, బొబ్బర్లంక వద్ద 43 గేట్లను బొబ్బర్లంక మత్స్యకారుల సంఘానికి గతంలో లీజుకు ఇవ్వడం జరిగిందని, అయితే నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు బ్యారేజీ వద్ద రొయ్య సీడును వీరు సేకరిస్తుంటారు. అయితే ఈ ఏడాది బొబ్బర్లంక మత్స్యకారులు సంఘాలుగా ఏర్పడాలనిసూచించి లీజు వివాదం పరిష్కారమయ్యే వరకు లీజు నిలుపుదల చేయాలన్న జిల్లా కలెక్టర్ సూచనల మేరకు లీజు ఇవ్వలేదని, మత్స్యకారులు జీవనోపాధుల మనుగడ ప్రశ్నార్థకమవడంతో ధవళేశ్వరం మత్స్యకారులు కోర్టును ఆశ్రయించడంతో ఈ సమావేశం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
సరిహద్దులు నిర్ధారించాలి...
కాటన్ బ్యారేజీ వద్ద ఏ ప్రాంతం జిల్లా పరిధిలో ఉందో సరిహద్దులు కచ్చితంగా నిర్ధారించాలని.. బ్యారేజీ గేట్లు, గోడలు వద్ద రొయ్యల పిల్లల సేకరణ వల్ల ఆనకట్టుకు, పర్యావరణపరంగా డ్యామేజీ ఉన్నటయితే ఇరిగేషన్‌శాఖ శాస్ర్తీయమైన అధ్యయనం ద్వారి నివేదిక సమర్పించాలని సూచించారు. మత్స్యకారులు రొయ్య పిల్లల సేకరణ, ఆనకట్ట వద్ద లేదా డౌన్‌స్ర్టీమ్‌లో సేకరించడం లాభదాయమా, నష్టమా అనే కోణంలో అధ్యయనంచేసి నివేదిక సమర్పించాలని జేసీకి సూచించారు. డిసెంబరు 30 నాటికి 3 శాఖలు తమ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల వారు ఇరు జిల్లాల సరిహద్దులను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కేసు ఇరు జిల్లాల పరిధిలో మత్స్యకార సంఘాల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పరిష్కరించాల్సి ఉందని సూచించారు. జనవరి 22న మరోసారి ఈ వివాదాస్పద అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని జేసీ ప్రకటించారు. మత్స్యశాఖ అధికారులు పీవీ శ్రీనివాసరావు, టి.సుమలత, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కె.ప్రభాకర్, మత్స్యశాఖ, జలనవరులశాఖ అధికారులు పాల్గొన్నారు.