Share News

జై..భవానీ!

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:08 AM

దసరా వచ్చిందంటే అమ్మవార్ల ఆలయాలు ప్రత్యేకం.. భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి..

జై..భవానీ!

దసరా వచ్చిందంటే అమ్మవార్ల ఆలయాలు ప్రత్యేకం.. భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి.. మన జిల్లాలోనూ ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.. వాటి చరిత్రను ఒకసారి తెలుసుకుందాం.. వీలైతే ఒకసారి చూసొద్దాం..!

శక్తి పీఠం..పిఠాపురం

అష్టాదశ శక్తి పీఠాల్లో దశమ శక్తి పీఠం.. అధిష్ఠాన దేవతైన పుర్హుతికాదేవి కొలువై ఉన్న పిఠాపురం పాదగయ క్షేత్రం.. దక్షిణకాశీగా, శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. స్వయం భూగా వెలసిన కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి,ఆదిశంకరాచార్య స్వామి ప్రతిష్టింపబడిన రాజరాజేశ్వరీదేవి ఇక్కడే కొలువై ఉన్నారు. శక్తిపీఠం కావడంతో ఇక్కడ పుర్హుతికా అమ్మవారిని దర్శించుకుని కుంకుమపూజలు, చండీయాగం చేయించుకునేందుకు ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా,డిల్లీ, గోవా, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలు నుంచి భక్తులు వస్తారు. పరాశక్తి ఆజ్ఞ మేరకు మహావిష్ణువు సతీ మృతదేహాన్ని తన సుదర్శనచక్రంతో ఖం డించాడు. సతీ దేహభాగా లు భూమిపై పడి 108 శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అందులో 101 విశేషంగా, 52 పీఠాలు ముఖ్యమైనవిగా, అతి ముఖ్యమైన 18 భాగాలు పడిన చోట అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ముఖ్యమైన పీఠభాగం(పిరుదులు) పడిన చోటే పిఠాపురంగా విరాజిల్లుతోంది. పాదగయ క్షేత్రంలోని పుర్హుతికా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదిక్షణ చేస్తుంటే అష్టాదశ శక్తి పీఠాల నమూనా విగ్రహాలు కనిపిస్తాయి.

- (ఆంధ్రజ్యోతి-పిఠాపురం)

కొండల్లో తలుపులమ్మ

మహిమ గల అమ్మవారు తలుపులమ్మ తల్లి.. కాకినాడ జిల్లా లోవ గ్రామంలో వెలసింది. తూర్పు కనుమల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ధారకొండ, తీగ కొండల మధ్య ఒక గుహలో స్వయంభుగా వెలిసినట్టు ఆలయ పండితులు చెబుతుంటారు. క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఈ క్షేత్రంలో పూజలు చేస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటాయని భక్తుల నమ్మకం.ఈ నేపథ్యంలో నిత్యం కొత్త వాహనాలు, భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడుతూ ఉం టుంది. ఏటా రూ.20 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలతో పోటీ పడుతున్న ఈ దేవస్థా నం ప్రసిద్ది దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపఽథ్యంలో రూ.20 కోట్లు ఖర్చు చేసి ఆలయ పునః నిర్మాణ పనులు చేపడుతున్నారు.ఏటా ఆషాఢమాసంలో నెల రోజులు ఆల యంలో అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తారు.

- (తుని రూరల్‌-ఆంధ్రజ్యోతి)

భక్తుల పాలిట విజయదుర్గ

భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెదురుపాక విజయదుర్గా అమ్మవారు విరాజిల్లుతుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో గత 54 ఏళ్లుగా నవరాత్రి ఉత్స వాలు నిర్వహిస్తున్నారు. 1972లో పీఠాధిపతి గాడ్‌ విజయదుర్గా పీఠాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వెదురుపాక విజయదుర్గా పీఠం లో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1989లో ప్రస్తుత శృంగేరి పీఠాధిపతి భారతీయతీర్థ చేతులమీదుగా శంకుస్థాపన చేసి పీఠాన్ని నిర్మించారు. అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య ఆరాధనలు చేస్తున్నా రు.దసరా 10 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు స్వయంగా శ్రీచక్ర ఆర్చనలు చేసుకుని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. గత 54 సంవత్సరాలుగా పీఠంలో ఉచిత నిత్య అన్నదానం జరుగుతుంది.

- (రాయవరం -ఆంధ్రజ్యోతి)

ఏటా..భవానీ మాల

భవానీ మాల చాలా మందికి ఆన వాయితీ.. ప్రతి ఏటా వేస్తారు. దుర్గమ్మ అంటే నమ్మకం. అమలాపురం వెత్సావారి అగ్రహారానికి చెందిన ఆర్లపల్లి ముత్యం ఇప్పటికే పలు పర్యాయాలు భవానీ మాల ధరించి గురుభవానీగా మారారు. ఇప్పటి వరకు సుమారు 15 వేల మందికి భవానీ దీక్ష ఇచ్చారు. అమలాపురం రూరల్‌ మండలం నల్లమిల్లిలో శ్రీమురళీకృష్ణస్వామి ఆలయంలో శ్రీదుర్గా వీరభద్ర భవానీ పీఠం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు భవానీ మాలధారులతో కలిసి కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన రాచకొండ కామేశ్వరశర్మ తొలిసారిగా భవానీ దీక్షను కోనసీమకు పరిచయం చేశారు. ఆయన వద్దే దీక్ష తీసుకుని నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది పీఠం వద్ద దసరాకు 108 మంది భవానీ మాల ధరించారు. ఇక కార్తీక మాసంలో మండల దీక్షకు ఏటా 300 మందికి పైబడి భవానీ మాల ధరిస్తున్నారు. - (అమలాపురం రూరల్‌ - ఆంధ్రజ్యోతి)

నాటి లాంతర్ల సెంటరే..దేవిచౌక్‌!

బ్రిటీష్‌ హయాంలో మూడు లాం తర్ల సెంటరే.. రాజమహేంద్రవరం దేవిచౌక్‌.1933లో బత్తుల మల్లికార్జునరావు సోదరులు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో దేవిచౌక్‌గా మారింది. బ్రిటీష్‌ హయాంలో నాలుగు రోడ్ల కూ డలిలో మునిసిపాలిటీ వారు వీధిదీపాలుగా లాంతర్లను ఏర్పాటు చేసేవారు.ఇలా మూడు లాంతర్లను దేవిచౌక్‌లో సాయంత్రం 5:30 గంటలకే వెలిగించి వెళ్లేవారు.అప్పటి నుంచి మూడు లాంతర్ల కూడలిగా దేవిచౌక్‌ను పిలిచేవారు.శ్రీబాలాత్రిపుర సుందరిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించాక మూడు లాంతర్ల సెంటర్‌ దేవిచౌక్‌గా రూపా ంతరం చెందింది. నాలుగు స్తంభాలను నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలా ఆలయ ప్రస్తానం ప్రారంభమైంది. ఇక్కడ నవరాత్రులు 1933లో మొదలు పెట్టారు. ఈ ఏడాది 92వ దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. - (రాజమహేంద్రవరం సిటీ - ఆంధ్రజ్యోతి)

పెద్దాపురం పెద్దమ్మ మరిడమ్మ

17వ శతాబ్దం నుంచి పెద్దాపురం పెద్దమ్మగా మరిడమ్మ ఆలయం పేరెన్నికగన్నది. పసుపు పూసిన కర్ర గద్దెను అమ్మవారి ప్రతిరూపంగా పూజిస్తారు. మరిడమ్మ జాతర ప్రతీ ఏడాది జ్యేష్టమాసంలో అమావాస్య నుంచి ప్రారంభమై ఆషాఢ మాసంలో అమావాస్య వరకూ 37 రోజు ల పాటు జరుగుతాయి. పెద్దాపురం మానోజీ చెరువు సమీపంలో గ్రామదే వత గా మరిడమ్మ వెలిశారని స్థానికులు చెబుతారు. అడవిలో పశు వులు కాపరులకు 16 ఏళ్ల యువతి కనిపించి నేను చింతపల్లివారి ఆడబ డుచునని చెప్పి మాయమైనట్టు పురాణాలు చెబుతున్నాయి. మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించా లని ఆజ్ఞాపించడంతో అక్కడే తాటాకుపాక వేసి నాడు ఆలయ నిర్మాణం చేపట్టారు. నాటి నుంచి నేటి వరకూ ధూపదీప నైవేద్యాలను అమ్మవారు అందుకుంటున్నారు.ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమం ద్వారా పెద్దాపురంలో ఉన్న మరిడమ్మ ఆలయం గురించి ప్రస్తావించారు.

- (పెద్దాపురం -ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 28 , 2025 | 01:08 AM