Share News

దసరా.. సరదా!

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:37 AM

అమలాపురం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): సంబరం అంబరాన్నం టింది.. ఆనందం ఉరకలేసింది.. వీధులన్నీ ఒక్కటయ్యాయి.. దసరా శోభను సంతరించుకున్నాయి.. పోటాపోటీగా ఉత్సవాలను నిర్వహిం చారు. అమలాపురం అంతా ఆనందంతో నిండిపోయింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం అమలాపురం లో జరిగిన చెడీ తాలింఖానా ఉత్సవ ఊరేగింపులు కనుల పండువగా జరిగాయి. వేలాది మంది ప్రజలు ఉత్సవాలను తి

దసరా.. సరదా!
అమలాపురంలోని ఓ వీధిలో విన్యాసాల దృశ్యం

అంబరాన్నంటిన అమలాపురం దసరా ఉత్సవాలు

ఉభయ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు

డీఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ మీనా ఆధ్వర్యంలో బందోబస్తు

ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

అమలాపురం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): సంబరం అంబరాన్నం టింది.. ఆనందం ఉరకలేసింది.. వీధులన్నీ ఒక్కటయ్యాయి.. దసరా శోభను సంతరించుకున్నాయి.. పోటాపోటీగా ఉత్సవాలను నిర్వహిం చారు. అమలాపురం అంతా ఆనందంతో నిండిపోయింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం అమలాపురం లో జరిగిన చెడీ తాలింఖానా ఉత్సవ ఊరేగింపులు కనుల పండువగా జరిగాయి. వేలాది మంది ప్రజలు ఉత్సవాలను తిలకించారు. భారీ బందోబస్తు నడుమ అమలాపురంలోని వివిధ ప్రాంతాల్లోని ఏడు వీధులకు చెందిన ఉత్సవ ఊరేగింపుల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చెడి తాలింఖానా ప్రదర్శనలు చూపరులను కనువిందు చేశాయి. ఒక్కో వీధికి ఒక్కో వాహనాన్ని ఊరేగింపుగా పురవీధుల గుండా తీసుకువచ్చారు. అమలాపురం పట్టణం చెడీతాలింఖానా జాతరతో గురువారం రాత్రి కిక్కిరిపోయింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా వారే దగ్గరుండి పర్యవేక్షించారు. ఏటా మాదిరిగానే ఉభయ రాష్ట్రాల నుంచి వేలాదిగా ప్రజలు అమలాపురంలో చెడీ తాలింఖానా ఉత్సవాలను చూసేందుకు తరలివచ్చారు. ముఖ్యంగా పట్టణంలోని గండువీధి, రవణంవీధి, రవణం మల్లయ్యవీది, నల్లా వీధి, మహిపాలవీధి, కొంకాపల్లి, శ్రీరామపురంలకు చెందిన ఊరేగింపుల్లోని కొన్నిటిలో చెడీ తాలింఖానా విన్యాసాలు అలరించాయి. కళ్లకు గంతలు కట్టుకుని పొట్టపై కొబ్బరికాయలు, కూరగాయలు ఉంచి కత్తితో నరికేందుకు చేసే అద్భుత విన్యాసం చెడీ తాలింఖానాల్లో ప్రత్యేక సంతరించుకుంది. కర్రసాములు, కత్తిసాము, అగ్గి బరాటా విన్యాసాలతో ఉత్సవాలను రక్తికట్టించారు.

సందడి చేసిన ప్రజాప్రతినిధులు

అమలాపురంలో జరిగిన చెడీ తాలింఖానా ఉత్సవాలను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సందర్శించారు. ఆయా ఉత్సవ కమిటీల ఆహ్వానం మేరకు ఆయా వీధుల్లో తిరిగి పటాకత్తులు చేతబట్టి విన్యాసాలు చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, అమలాపురం ఎంపీ గంటి హరీష్‌బాలయోగి, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడుతో పాటు బీజేపీ నాయకుడు నల్లా పవన్‌కుమార్‌, అడబాల సత్యనారాయణ, యాళ్ల దొరబాబు, జనసేనకు చెందిన అనేకమంది నాయకులు ఆయా పురవీధుల్లో తిరుగుతూ ఊర్రూతలూగించారు.

డీఐజీ పర్యవేక్షణ..

అమలాపురంలో జరిగిన చెడీ తాలింఖానా ఉత్సవాల్లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. డ్రోన్లు, బాడీ టచ్‌ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా, అడ్మిన్‌ ఎస్పీ ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు రాత్రి ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత పరిస్థితుల నడుమ దసరా ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో అటు పోలీసు యంత్రాంగం, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Oct 04 , 2025 | 01:37 AM