Share News

చీకటి నుంచి వెలుగులోకి..

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:47 AM

పొట్టకూటి కోసం వలస వచ్చిన ఆదివాసీలు వాళ్లు.. దట్టమైన అడవుల్లో తలదాచుకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్లే కూనవరం మండలం రామచంద్రపురానికి చెందిన వలస అడవిబిడ్డలు. వలస వచ్చి 28 ఏళ్లు కాగా నిన్నటి వరకు వారివి చీకటి బతుకులే. రాత్రి అయితే అడవి జంతువులకు, విషసర్పాలకు భయపడుతూ నిద్రలోకి వెళ్లాల్సిందే.

చీకటి నుంచి వెలుగులోకి..
రామచంద్రపురంలో సోలార్‌ పరికరాలు అమరుస్తున్న సిబ్బంది

  • రామచంద్రపురానికి విద్యుత్కాంతులు

  • అథ్లెట్‌ రజిత ఊరిలో రూ.24 లక్షలతో సోలార్‌ పనులు పూర్తి

  • ప్రతి ఇంటికి ఒక ఫ్యాను, ఐదు బల్బులు ఉచితంగా పంపిణీ

కూనవరం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పొట్టకూటి కోసం వలస వచ్చిన ఆదివాసీలు వాళ్లు.. దట్టమైన అడవుల్లో తలదాచుకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్లే కూనవరం మండలం రామచంద్రపురానికి చెందిన వలస అడవిబిడ్డలు. వలస వచ్చి 28 ఏళ్లు కాగా నిన్నటి వరకు వారివి చీకటి బతుకులే. రాత్రి అయితే అడవి జంతువులకు, విషసర్పాలకు భయపడుతూ నిద్రలోకి వెళ్లాల్సిందే. వీరి బాధలను అర్థం చేసుకున్న కేంద్రం సోలార్‌ విద్యుత్‌ కోసం రామచంద్రపురం గ్రామానికి రూ.24 లక్షలు మంజూరు చేసింది.ప్రముఖ అథ్లెట్‌ కుంజ రజిత జన్మించిన ఈ గ్రా మంలో 45 వలస ఆదివాసీ కు టుంబాలున్నాయి. ప్రతి ఇంటికి సో లార్‌ విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి ఒక ఫ్యాన్‌, ఐదు లైట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటింటికీ స్విచ్‌బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కీ ఆన్‌ ప్రాజెక్ట్సు అండ్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహించారు. 28ఏళ్ల తర్వాత తమ గ్రామంలో విద్యుత్‌ కాంతులు రావడం సంతోషంగా ఉందని వలస ఆదివాసీలు ఆంధ్రజ్యోతికి తెలిపారు. త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు.

  • ఆనందంగా ఉంది: అథ్లెట్‌ రజిత

తమ గ్రామంలో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అథ్లెట్‌ రజిత తెలిపారు. కేరళలో శిక్షణ పొందుతున్న ఆమె ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. చాలా ఏళ్ల తర్వాత తమ గ్రామానికి విద్యుత్‌ వచ్చిందని, దీన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను ఏషియన్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కోసం శిక్షణ పొందుతున్నానన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:47 AM