వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన
ABN , Publish Date - May 14 , 2025 | 12:10 AM
వినియోగదారుల రక్షణ కోసం పౌరసరఫరాల శాఖ నిరంతరం కృషి చేస్తుందని, వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి సరైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ్‌భాస్కర్ పేర్కొన్నారు.
ముమ్మిడివరం, మే13(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల రక్షణ కోసం పౌరసరఫరాల శాఖ నిరంతరం కృషి చేస్తుందని, వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి సరైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ్‌భాస్కర్ పేర్కొన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని పౌర సరఫరాల కార్యాలయంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై మంగళవారం వినియోగదారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వినియోగదారుల హక్కుల చట్టం ఒక ముఖ్యమైన రక్షణ కవచమని, వారి ప్రయోజనాలు కాపాడడానికి ఒక శక్తివంతమైన సాధనమన్నారు. పౌర సరఫరాల శాఖకు తోడు కోకోఫెడ్ ఆధ్వర్యంలోని జిల్లాలో వినియోగదారుల సంఘాలు కూడా విశేష కృషి చేస్తున్నాయన్నారు. దీంతో వినియోగదారుల హక్కులు పూర్తిగా పరిరక్షిస్తున్నామన్నారు. తూనికలు, కొలతల శాఖ ఆహారభద్రత శాఖ వంటి అనుబంధ శాఖలతో కలిసి సమన్వయం చేసుకుని మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.జిల్లా వినియోగదారుల హక్కుల రక్షణ కౌన్సిల్ నియామకం పూర్తి అయిందన్నారు. కోకోఫెడ్ జిల్లా అధ్యక్షుడు అరిగెల బలరామమూర్తి మాట్లాడుతూ వినియోగదారుల రక్షణకు అనేకకార్యక్రమాలు చేపడుతున్నామని, అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి సరైన సహకారం ఉంటే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతామన్నారు. ప్రధాన కార్యదర్శి ఆదిత్యకిరణ్ మాట్లాడుతూ వినియోగదారుల చైతన్యానికి నెలకు ఒక కార్యక్రమం వంతున నిర్వహిస్తామని, కార్యక్రమాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్, పౌరసరఫరాల అధికారులందరూ పాల్గొని ప్రజలకు వినియోగదారుల వ్యవహారాలపై అవగాహన పెంపొందించాలన్నారు. కోకోఫెడ్ సభ్యులు, న్యాయవాది అద్దంకి అమరేశ్వరరావులతో పాటు పలువురు మాట్లాడారు. కోకోఫెడ్ సభ్యులంతా జిల్లా చరిత్రలో మొదటిసారి వినియోగదారుల రక్షణ కౌన్సిల్‌ను ఏర్పాటుచేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయ్‌భాస్కర్‌ను సత్కరించారు.