వీడిన మిస్టరీ!
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:53 AM
రామచంద్రపురం పట్టణంలో బాలిక అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వీరి కుటుంబానికి ఎలకీ్ట్రషియన్‌గా పరిచయస్తుడైన వ్యక్తి హత్యకు పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు రామచంద్రపురం డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్‌పీ రాహుల్‌మీనా విలేకరుల సమావేశం ఆదివారం వివరాలు వెల్లడించారు
ఇంట్లో చోరీకి యత్నించి బాలిక హత్య
ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
ఘాతుకానికి పాల్పడింది పరిచయస్తుడైన ఎలక్ర్టీషియన్..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఘటన
ఐదురోజుల్లో అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
వేలిముద్రల ఆధారంగా పట్టుబడిన నిందితుడు
వివరాలు వెల్లడించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ
రామచంద్రపురం(ద్రాక్షారామ), నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రామచంద్రపురం పట్టణంలో బాలిక అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వీరి కుటుంబానికి ఎలకీ్ట్రషియన్‌గా పరిచయస్తుడైన వ్యక్తి హత్యకు పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు రామచంద్రపురం డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్‌పీ రాహుల్‌మీనా విలేకరుల సమావేశం ఆదివారం వివరాలు వెల్లడించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ని త్యాగరాజునగర్‌లో కమల కాంప్లెక్సు పైఅంతస్థులో బాలిక రంజిత(10) కుటుంబం నివాసం ఉంటోంది. ఈనెల 4న ఆమె ఉరివేసుకున్న స్థితిలో మరణించి ఉంది. రంజిత స్థానిక ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి సిర్రా రాజు ముంబయిలోని షిప్‌యార్డులో పనిచేస్తున్నాడు. తల్లి సునీత రామచంద్రపురంలోనే ఉంటూ స్థానిక ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. వీరి పెద్దకుమార్తె నవోదయ పాఠశాలలో చదువుతోంది.
ఎలక్ర్టీషియన్‌గా పరిచయమై..
కాగా, బాలిక కుటుంబానికి రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన పెయ్యల శ్రీనివాస్ ఎలక్ర్టీషియన్‌గా కొన్నాళ్ల క్రితం పరిచయమయ్యాడు. అతడు ఓ యూట్యూబ్ చానెల్‌లో కూడా పనిచేస్తున్నట్టు సమాచారం. బాలిక తల్లిని అతడు అక్క అని పిలిచేవాడు. వీరింట్లో ఎలకి్ట్రకల్ పనులు చేయడంతోపాటు చేదోడుగా ఉండేవాడు. నిందితుడు శ్రీనివాస్‌కు ఇటీవల ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో వీరి ఇంటికి వస్తూ.. వెళ్తూ ఉండే క్రమంలో బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులు ఉండడం గమనించాడు. వాటిని అపహరించాలనుకుని భావించి ఈనెల 4న సాయంత్రం 5.20 సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. అప్పటికే స్కూల్‌నుంచి వచ్చిన బాలిక అతడిని ఎందుకు వచ్చావని ప్రశ్నించగా ఫ్యాన్ మరమ్మతులు చేయడానికి వచ్చినట్లు సమాధానమిచ్చాడు. ఫ్యాన్ మరమ్మతు లేదని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఆమె తల్లికి ఫోన్ చేసి సమాచారం చెప్తుందని భయపడ్డాడు. దీంతో ఆమెను హత్య చేయాలని భావించాడు. ఓ నల్ల చున్నీని బాలిక మెడకు చుట్టి మంచంపైకి తోసి ఆమె ముఖాన్ని నొక్కి అదిమిపట్టి హత్యచేశాడు. అనుమానం రాకుండా బాలిక మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరితీయడం ద్వారా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇంటి బయటకు వచ్చి తలుపును కిటికీలోంచి చేయిపెట్టి లోపల లాక్ చేసి వెళ్లిపోయాడు.
అనుమానాస్పద మృతిగా కేసు
సంఘటన జరిగిన రోజున బాలిక తల్లి కాకినాడ వెళ్లింది. ఆమె సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపు లోపల గెడపెట్టి ఉంది. ఎంతకొట్టినా తీయకపోయేసరికి కంగారుపడింది. స్థానికుల సహాయంతో తలుపు తీయగా బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్టుగా వేలాడుతూ ఉంది. ఇది చూసి కంగారుపడి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అన్నీ క్షుణ్నంగా పరిశీలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటనాస్థలం నుంచి క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. ఈ కేసు చేధనలో భాగంగా పోలీసులు పలువురిని లోతుగా విచారించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షించారు.
హత్య తర్వాత వెంటే ఉండి..
హత్య జరిగిన రోజు రాత్రి శ్రీనివాస్ బాలిక పాఠశాలకు వెళ్లి సీసీ ఫుటేజీ సేకరించాడు. దీన్ని ఒక వాట్సాప్ గ్రూపులో పెట్టాడు. బాలిక మృతిపై ఒక చానల్‌లో ప్రసారం అవుతున్న కథనాన్ని ఖండిస్తూ సోషల్ మిడియాలో ఓ పోస్టింగ్ కూడా పెట్టాడు. రంజిత తల్లి తనకు అక్క అని.. బాలిక మృతితో తనకు బాధగా ఉందని మరో పోస్టు చేశాడు. సంఘటన జరిగిన తర్వాత రోజు బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ రంజిత తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతుండగా నిందితుడు శ్రీనివాస్ వారి పక్కనే ఉన్నాడు.
క్లూస్‌టీం బృందంతో అతిప్రవర్తన
కాగా సంఘటనా స్థలంలో క్లూస్‌టీం బృందం ఆధారాలు సేకరించింది. వేలిముద్రలు సేకరిస్తుండగా నిందితుడు శ్రీనివాస్ క్లూస్ టీం బృందంతో అతిగా ప్రవర్తించినట్లు సమాచారం. వేలిముద్రలు ఇక్కడ తీశారా.. అక్కడ తీశారా అంటూ అతడు వారినే ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్‌కు అనుమానం వచ్చి ఈ శ్రీనివాస్ ఎవరని ఆరాతీశారు. అతడి వేలిముద్రలు కూడా తీసుకున్నారు. కుటుంబీకులతో సహా కొంతమంది అనుమానితులతో పోల్చిచూడగా ఎవరి వేలిముద్రలతో సరిపడలేదు. చివరికి శ్రీనివాస్ వేలిముద్రలతో సరిపోవడంతో దర్యాప్తులో కీలకంగా మారినట్లు సమాచారం. ఈ క్లూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో కేసులో చిక్కుముడి వీడినట్లు తెలుస్తోంది.
కదలికలపై జల్లెడపట్టిన పోలీసులు
వేలిముద్రలు సరిపోవడంతో పోలీసులు బాలిక హత్య జరిగిన రోజు నిందితుడు శ్రీనివాస్ కదలికలపై జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో అతడి కదలికలను పరిశీలించారు. బాలిక సాయంత్రం 4.13 గంటలకు ఇంటికి చేరగా సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 7గంటల వరకు అతడి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. వీటి ఆధారంగానే శ్రీనివాస్ బాలిక ఇంట్లో చోరీ చేసేందుకు సాయంత్రం 5.20 గంటలకు ఇంట్లో ప్రవేశించినట్లు గుర్తించారు. దర్యాప్తులోభాగంగా టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాలతో నిందితుడు పెయ్యల శ్రీనివాస్‌ను అదుపులో తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఈనెల 8న రామచంద్రపురం పోలీస్‌స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, 14రోజులపాటు రిమాండ్ విధించారని జిల్లా ఎస్‌పీ రాహుల్‌మీనా తెలిపారు. బాలిక హత్యకేసును నాలుగురోజుల్లో చేధించిన డీఎస్పీ రఘువీర్, సీఐలు ఎంవీ నారాయణ, పి.దొరరాజు, ఎస్‌ఐలు ఎస్.నాగేశ్వరరావు, ఎం.లక్ష్మణ్, జానీభాషా, సురేష్‌బాబు, అంగర హరీష్, పోలీసు సిబ్బందిని ఎస్‌పీ అభినందించారు. కేసు చేధించడంలో కీలకపాత్ర పోషించిన ఫింగర్ ప్రింట్ బ్యూరో అమలాపురం ఇన్‌స్పెక్టర్ కె.ప్రవీణ్‌కుమార్, వారి బృందం సభ్యులను అభినందించారు.
ఎన్‌కౌంటర్ చేయాల్సిందే: బాలిక తల్లిదండ్రులు
బాలికను హత్య చేసింది శ్రీనివాస్‌గా తేలడంతో సునీత, రాజు దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ చొరవ చూపాలని కోరారు.