దేశ నిర్మాణంపై ఎన్‌సీసీ క్యాడెట్లలో బాధ్యత
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:43 AM
సమాజ జీవనం ద్వారా ఎన్‌సీసీ క్యాడెట్ల దేశనిర్మాణం పట్ల ఐక్యతను, బాధ్యతను పెంపొందించుకుంటారని కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ ఆర్‌ఎం అగర్వాల్ అన్నారు. ప్రత్యేక జాతీయ సమగ్రత శిబిరం రాజానగరం మండలం దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో నిర్వహిస్తున్నారు.
కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ అగర్వాల్
దివాన్‌చెరువులో ప్రత్యేక జాతీయ సమగ్రత శిబిరం
దివాన్‌చెరువు, సెప్టెంబరు 25(ఆంధజ్ర్యోతి): సమాజ జీవనం ద్వారా ఎన్‌సీసీ క్యాడెట్ల దేశనిర్మాణం పట్ల ఐక్యతను, బాధ్యతను పెంపొందించుకుంటారని కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ ఆర్‌ఎం అగర్వాల్ అన్నారు. ప్రత్యేక జాతీయ సమగ్రత శిబిరం రాజానగరం మండలం దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో 3వ ఆంధ్ర బాలికల ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ హెచ్‌ఎస్ మానిక్‌తో కలసి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఆధ్వర్యంలో కాకినాడ ఎన్‌సీసీ గ్రూప్ ప్రధాన కార్యాలయం ప్రతిష్టాత్మకంగా ఈ పాన్ ఇండియా ఎన్‌సీసీ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఈ శిబిరంలో ఆటల పోటీలు, వ్యక్తిగత, సమూహ పోటీలు, విద్యాపర్యటనలు, ప్రేరణాత్మక ఉపన్యాసాలు, సామాజిక సేవార్యాలీలు వంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యకలాపాలు క్యాడెట్లులో నాయకత్వం, క్రమశిక్షణ, స్నేహాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయన్నారు. కల్నల్ మానిక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల వైవిధ్యాన్ని సూచించే 17 ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ల నుంచి ఎంపిక చేసిన 300 మంది క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొన్నారని చెప్పారు. వీరిలో ఏపీ నుంచి 26 మంది, తెలంగాణా నుంచి 18 మంది హాజరయ్యారన్నారు. ఈ శిబిరం అక్టోబరు 5 వరకూ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా శిబిరంలో భాగంగా విజన్ ఆఫ్ ఇండియా-2050 అనే అంశంపై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.