కాటన్ బ్యారేజీకి.. మంచిరోజులు
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:31 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గోదావరి జిల్లాలకు అడిగింది కాదనరు.. కోరింది లేదనరు.. ఏం కావాలంటే అది ఇస్తారు.. ఏం కావాలంటే అది చేస్తారు.. రాజధానిలో సీఎం అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశమే దానికి ఉదాహరణ.
వచ్చే ఏడాది పొగాకు సాగుకు క్రాప్ హాలిడే
బ్యారేజీ పనులకు రూ.146 కోట్లు మంజూరు
పోలవరం ప్రాజెక్టు వద్ద ఫైవ్‌స్టార్ రిసార్ట్స్
జల క్రీడలకు వీలుగా అడ్వెంచర్ టూరిజం
తూర్పున ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు
కేబినెట్ భేటీలో జిల్లాకు భారీగా ప్రయోజనాలు
రాజమహేంద్రవరం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గోదావరి జిల్లాలకు అడిగింది కాదనరు.. కోరింది లేదనరు.. ఏం కావాలంటే అది ఇస్తారు.. ఏం కావాలంటే అది చేస్తారు.. రాజధానిలో సీఎం అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశమే దానికి ఉదాహరణ. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ పనులకు సుమారు రూ.146 కోట్లకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం మంగళవారం జరిగిన కేబినెట్‌లో డ్రిప్ పథకం కింద రూ.146 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్ ( సీడబ్ల్యుసీ) 2022లో స్వయంగా పరిశీలించి తక్షణం రిపేర్లు చేయకపోతే సమస్య ఉత్పన్నమవుతుందని అప్పటి వైసీపీ ప్రభు త్వాన్ని హెచ్చరించింది. కానీ ఆ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ బ్యారేజీని డ్యామ్ రిహేబి టేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం(డ్రిప్)లో పెట్టారు. ధవళే శ్వరం ఇరిగేషన్ సర్కిల్ నుంచి గత జూన్‌లో ఒక డీఈ ఢిల్లీ వెళ్లి మొత్తం రూ.150 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చి వచ్చారు. ఇందులో రూ.146 కోట్లకు అనుమతి ఇచ్చి శాంక్షన్ చేశారు. ఇవాళ కేబినెట్ పరిపాలనా ఆమోదం తెలపడంతో బ్యారేజీకి మంచిరోజులొచ్చినట్టు అయింది. పోలవరం ప్రాజెక్టు పనులు సకా లంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అటు పోలవరం -బనకచర్ల ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగింది. గోదావరి నుంచి వృఽథాగా పోతున్న 3 వేల టీఎంసీల నీటిని వినియోగించు కోవడా నికే ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు సీఎం స్పష్టం చేశారు.పోలవరం ప్రాజెక్టు వద్ద ఫైవ్‌స్టార్ లగ్జరీ రిసార్ట్స్ నిర్మించడానికి అవసరమైన భూకేటాయింపు, ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్ర కేబినెట్ ఆమో దం తెలిపింది. మెగ్లాన్ లెజర్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీకి ఇక్కడ భూమి కేటాయించడానికి ఆమోదం తెలిపింది. మరో వైపు తూర్పుగోదావరి జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ యూని ట్లు నెలకొల్పడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో జల వనరులు అధికంగా ఉన్న చోట్ల అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులను నెలకొల్పను న్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగవడంతోపాటు సముద్ర తీర ప్రాంతం, గోదావరి నదీ పరీవాహకంలో అనేక జలక్రీడలు అందుబాటులోకి వస్తాయి. పర్యాటకంగానూ ఈ ప్రాంతం పరుగులిడుతుంది. ఈ దిశగానే పర్యాటక శాఖ పలు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇక రాష్ట్రంలో మినీ అంగన్‌వాడీలను ప్రధాన అంగన్‌వాడీలుగా మార్చాలనే ప్రతిపాదన గత కొంతకాలంగా ఉంది. దీనికి పచ్చజెండా ఊపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యలోనే అంగన్‌వాడీలు అప్‌గ్రేడ్ అవుతాయి. ఏపీ మా ర్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదించడంతో పాటు వచ్చే ఏడాది పొగాకు సాగుకు క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రభావం పొగాకు సాగు రైతులపై పడనుం ది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమరావతిలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం పునరంకిత సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలోనూ నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు.