Share News

కరోనా..హైరానా!

ABN , Publish Date - May 25 , 2025 | 01:46 AM

మళ్లీ కొవిడ్‌ వైరస్‌ జాడలు వెలుగు చూస్తున్నాయి. దేశ రాజధానితోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌ వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఏపీ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ ఇటీవల కొవిడ్‌ అప్రమత్తతపై ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

కరోనా..హైరానా!
సత్యవాడలో వివరాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

అప్రమత్తమైన అధికారులు

జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

మళ్లీ కొవిడ్‌ వైరస్‌ జాడలు వెలుగు చూస్తున్నాయి. దేశ రాజధానితోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్‌ వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఏపీ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ ఇటీవల కొవిడ్‌ అప్రమత్తతపై ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో కొందరు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. మళ్లీ కొవిడ్‌ వ్యాప్తి చెందుతోందన్న వార్తలతో ఏవైనా లక్షణాలు కనిపిస్తే ప్రజలు వెం టనే అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే కొందరు మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు. కాగా ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీల కార్యక్రమాలు వంటి సామూహిక సమావేశాలను నిలిపివేయాలని హెల్త్‌ డిపార్టుమెంట్‌ సైతం ఆదేశించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొవిడ్‌ 19 జాగ్రత్తలు పాటించాలని వృద్ధులు, గర్భిణులు ఖచ్చితంగా కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లకే పరిమితం కావాల్సిందిగా సూచించారు. మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్‌ 19 లక్షణాలు ఉంటే ముందుగా పరీక్ష చేయించుకుని ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు పాటించాలని సూచించారు. ఆరోగ్యశాఖ అన్ని పరీక్షా సౌకర్యాలతో కూడిన ల్యాబ్‌లు, మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్‌ లేయర్‌ మాస్క్‌లు తగినంత పరిణామంలో ఆసుపత్రిలో సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. కాకినాడ, రాజమహేంద్రవరంలలోని జీజీహెచ్‌లలో ప్ర త్యేక వార్డులను ఏర్పాటుచేశారు. కోనసీమ జిల్లా సత్యవాడలోకొవిడ్‌ కేసు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం అయ్యారు. జలుబు, జ్వరం ఉన్నవారంతా ఆందోళన చెందుతున్నారు.

కోనసీమలో తొలి కేసు..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం సత్యవాడకు చెందిన వృద్ధుడికి గత మూడు రోజులుగా లోఫీవర్‌, నిరంతరంగా ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుండడంతో కుటుంబీకులు శుక్ర వారం రాత్రి ద్రాక్షారామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కొవిడ్‌ ర్యాపిడ్‌ కిట్‌ పరీక్ష నిర్వహించి పాజిటివ్‌గా గుర్తించారు. అనంతరం అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించాల్సిందిగా సూచించారు. కుటుంబీకులు శనివారం జీజీహెచ్‌కు తరలించగా స్వాబ్‌ శాంపిల్‌తో ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేసి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. అనంతరం అతన్ని ఈఎన్‌టీ విభాగంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ వార్డుకు తరలించి చికిత్సను అందజేస్తున్నారు. ప్రస్తు తం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంపీఆర్‌ విఠల్‌ వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలోనే ఈ ఏడాది ఇదే తొలి కేసు కావడంతో వైద్య వర్గాలన్నీ అప్రమత్తం అయ్యాయి.

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిలో కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. సోమవారం నాటికి వార్డు సిద్ధం కావొచ్చని చెబుతున్నారు. ముందుగా 15 బెడ్స్‌తో ఐసోలేషన్‌ వార్డును సిద్ధం చేసి, అవసరమైతే మరో 15 బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. పాత మలేరియా అధికారి కార్యాలయం నిర్వహించిన రేకులషెడ్డును కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం షెడ్డులో ఉన్న సామగ్రిని తరలించే కార్యక్రమం చేపట్టారు. బెడ్స్‌, ఆక్సిజన్‌, ఇతర వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తారు.

ఆందోళన వద్దు.. అప్రమత్తత అవసరం

కొవిడ్‌తో ఆందోళన వద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సత్యవాడకు చెందిన వృద్ధుడికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంపై మంత్రి స్పందించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా వైద్యశాఖ అధికారులు, కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకుని తగిన వైద్యసేవలు పొందాలి. - వాసంశెట్టి సుభాష్‌, మంత్రి

Updated Date - May 25 , 2025 | 01:46 AM